హీరో మోటోకార్ప్ వెబ్‌సైట్‌లో ప్యాషన్ ప్రో టిఆర్ డిటేల్స్..
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2014లో అనేక కొత్త ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసినదే. అందులో ఒకటి ఈ కొత్త ప్యాషన్ ప్రో టిఆర్. రెగ్యులర్ హీరో ప్యాషన్ ప్రో మోడల్‌ను ఆధారంగా చేసుకొని, అదనపు బాడీ కిట్‌తో ఆఫ్-రోడర్ బైక్‌లా డిజైన్ చేయబడినదే ఈ హీరో ప్యాషన్ ప్రో టిఆర్.
ఈ కొత్త హీరో ప్యాషన్ ప్రో టిఆర్ ఆఫ్-రోడ్ స్టయిల్ బైక్‌లో.. బెటర్ రోడ్ గ్రిప్ కోసం కొత్త ఆఫ్-రోడ్ టైర్స్, హై ఫ్రంట్ ఫెండర్, ఇంజన్‌ను ప్రొటెక్ట్ చేసే స్కిడ్ ప్లేట్, ఫ్యూయెల్ ట్యాంక్‌పై క్నీ ప్యాడ్స్ (మోకాలి సంరక్షణ కోసం), హెడ్‌లైట్ గ్రిల్ (లైట్ రక్షణ కోసం), చేతుల రక్షణ కోసం క్నకల్ ప్రొటెక్టర్ వంటి మార్పులను చూడొచ్చు. ఇందులో ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో ఎలాంటి మార్పులు లేవనే చెప్పాలి. రెగ్యులర్ ప్యాషన్ ప్రోలో ఉపయోగించే 97.2సీసీ ఇంజన్‌నే ఈ కొత్త ప్యాషన్ ప్రో టిఆర్ బైక్‌లోను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.8 బిహెచ్‌పిల శక్తిని, 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
కొత్త ప్యాషన్ ప్రో టిఆర్‌లో పైన చెప్పుకున్న కాస్మోటిక్ మార్పులతో పాటుగా కొత్త బాడీ గ్రాఫిక్స్ కూడా ఇందులో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ సైలెన్సర్ కవర్‌లను ఇందులో చూడొచ్చు. ప్రత్యేకించి గ్రామీణ మార్కెట్లలోని కస్టమర్లు మరియు ఆఫ్-రోడ్ స్టైల్ బైక్‌లను కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకొని హీరో మోటోకార్ప్ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనుంది.

హీరో మోటోకార్ప్ తమ ప్యాషన్ ప్రో టిఆర్ మోడల్‌ను ఎప్పుడు మార్కెట్లో విడుదల చేసే అంశాన్ని ఇంకా ఖరారు చేయలేదు. అయితే, ఈ మోడల్‌కు సంబంధించిన సమాచారాన్ని మాత్రం అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే, వీలైనంత త్వరలోనే ఈ కొత్త మోడల్ మార్కెట్‌ను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








