దక్షిణ భారతదేశంలో మరో కొత్త ఫ్యాక్టరీ: హీరో మోటోకార్ప్
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ 6వ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. దక్షిణ భారతదేశ మార్కెట్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఆ ప్రాంతంలో ఆరవ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ తెలిపారు.
ఇప్పటికే ఈ ప్లాంట్ ఏర్పాటుకు కావల్సిన స్థలం కోసం అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే, ఈ కొత్త ప్లాంట్ పనులను ఎప్పుడు ప్రారంభించనున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌కు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, హర్యానాలోని గుర్గావ్, దారుహెరల్లో మూడు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ ప్లాంట్ల నుంచి సాలీనా 69 లక్షల వాహనాలు ఉత్పత్తి అవుతాయి.

కాగా.. హీరో మోటోకార్ప్ ఇటీవలే తమ నాల్గవ ప్లాంట్‌ను రూ.400 కోట్ల పెట్టుబడులతో రాజస్థాన్‌లోని నీమ్‌రాణాలో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌తో కలుపుకుంటే కంపెనీ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 76.5 లక్షల యూనిట్లు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నడుస్తోందని, త్వరలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని పవన్ ముంజాల్ వివరించారు.
మరోవైపు హీరో మోటోకార్ప్ గుజరాత్‌లోని హలోల్‌లో వద్ద రూ.1,100 కోట్ల పెట్టుబడులతో తమ ఐదవ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. సాలీనా 18 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అందుబాటులోకి రానుంది. కాగా, తాము దక్షిణ భారతంలో ఏర్పాటు చేయనున్న ఆరవ ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్ల యూనిట్లకు పెరుగుతుందని ముంజాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








