2014 ఆటో ఎక్స్‌పోలో విడుదల కానున్న హోండా యాక్టివా 125
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ఈ ఏడాది జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త 125సీసీ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు గడచిన సంవత్సరం జులై నెలలో మేము ఓ కథనంలోప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హోండా నుంచి రానున్న ఈ 125సీసీ స్కూటర్ కూడా యాక్టివా ప్లాట్‌ఫామ్‌పైనే తయారు కానుంది. యాక్టివాలో ఇప్పటికే తక్కువ ధర కలిగిన 'యాక్టివా ఐ' స్కూటర్ ప్రవేశపెట్టిన హోండా, ఇప్పుడు మరింత శక్తివంతమైన ఇంజన్‌తో కూడిన ప్రీమియం యాక్టివాను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరిలో హోండా యాక్టివా 125ను విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెగ్యులర్ 110సీసీ హోండా యాక్టివాకు ఎగువన హోండా యాక్టివా 125 స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఈ సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్, స్విష్, వెస్పా వంటి 125సీసీ స్కూటర్లను పోటీగా నిలువనుంది. హోండాకు 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో కూడా ఇదే మొదటి ఉత్పత్తి కావటం విశేషం.
కొత్త హోండా యాక్టివా 125లో ఫోర్-స్ట్రోక్, ఫోర్స్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది వేరియేటర్ కంట్రోల్డ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడనుంది. డిజైన్, ఫీచర్ల పరంగా కూడా ఈ కొత్త యాక్టివాలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








