హోండా సిబిఆర్300ఆర్ వస్తే, సిబిఆర్250 సంగతి ఏంటి?
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా తమ అధునాతన 'హోండా సిబిఆర్300ఆర్' (Honda CBR300R) స్పోర్ట్స్ బైక్‌ను ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, రాబోయే పండుగ సీజన్ నాటికి ఈ మోడల్ అందుబాటులోకి రావచ్చని అంచనా.
అయితే, హోండా సిబిఆర్300ఆర్ మోడల్ రాకతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న హోండా సిబిఆర్250ఆర్ మోడల్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ 250సీసీ మోడల్‌ను కంపెనీ అలానే కొనసాగిస్తుందా లేక దానిని పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించి ఆ స్థానంలో ఈ కొత్త 300సీసీ మోడల్‌ను ప్రవేశపెట్టనుందా అనే విషయం మరికొద్ది నెలల్లోనే తేలిపోనుంది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ గత కొంత కాలంగా దేశీయ విపణిలో సిబిఆర్250ఆర్ మోడల్‌ను విక్రయిస్తోంది. అయితే, ఈ బైక్‌లో ఇంతవరకూ ఎలాంటి పూర్తిస్థాయి ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదల కాలేదు. కానీ హోండా ఇందులో రిఫ్రెష్డ్ కలర్ ఆప్షన్లను, లిమిటెడ్ ఎడిషన్లను మాత్రమే ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, కొత్తగా రానున్న సిబిఆర్300ఆర్‌పై భారీ అంచనాలున్నాయి.

వాస్తవానికి హోండా సిబిఆర్300ఆర్ స్పోర్ట్స్ బైక్ ఓ గ్లోబల్ మోడల్. అంటే, ఇది దాదాపుగా అన్ని దేశాల్లో ఒకే రూపంలో లభ్యం అుతుందన్నమాట. ప్రస్తుతం హోండా భారత మార్కెట్లో విక్రయిస్తున్న 250సీసీ వెర్షన్ సిబిఆర్250ఆర్ స్థానంలో ఈ అధునాతన, పవర్‌ఫుల్ 300సీసీ వెర్షన్ సిబిఆర్250ఆర్‌ను ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
హోండా సిబిఆర్1000ఆర్ నుంచి స్ఫూర్తి పొంది హోండా సిబిఆర్300ఆర్ బైక్‌ను అభివృద్ధి చేశారు. ఇది ట్విన్ హెడ్‌ల్యాంప్స్ మరియు విభిన్నంగా డిజైన్ చేయబడిన ఎగ్జాస్ట్ క్యాన్‌తో లభిస్తుంది. ఇందులో 286సీసీ వెర్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీనిని పాత 250సీసీ ఇంజన్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. మునుపటి వెర్షన్ ఇంజన్‌తో పోల్చుకుంటే ఇది అధనంగా 37సీసీ డిస్‌ప్లేస్‌మెంట్, 8 మి.మీ. స్ట్రోక్‌ను (63 మి.మీ.) పెంచారు. బోర్‌ను యధావిధిగా (76 మి.మీ.) ఉంచారు.
కొత్త హోండా సిబిఆర్300ఆర్ బైక్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 30.4 హెచ్‌పిల శక్తిని, 7250 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (హోండా సిబిఆర్250ఆర్ 26 హెచ్‌పిల శక్తిని, 23.86 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది). పెద్ద ఇంజన్ కారణంగా పెరిగిన బరువు, వైబ్రేషన్‌ను హ్యాండిల్ చేసేందుకు హెవీ బ్యాలెన్సర్ షాఫ్ట్‌ను ఇందులో అమర్చారు. ఇంజన్ మౌంట్స్‌ను మరింత ధృఢంగా తీర్చిదిద్దారు.

ఇందులోని డిజిటల్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కూడా రిప్రోగ్రామ్ చేశామని, ఫలితంగా ఇది మంచి యాక్సిలరేషన్‌ను ఆఫర్ చేస్తుందని, అలాగే పెద్ద సైలెన్సర్ కారణంగా ఇది డీపర్ ఎగ్జాస్ట్ నోట్‌ను డెలివరీ చేస్తుందని హోండా తెలిపింది. ఈ కొత్త ఇంజన్ నుంచి వచ్చే అధిక పవర్‌ను సరిగ్గా ఉపయోగించుకునేందుకు గేర్ రేషియోలను కూడా హోండా మెరుగుపరచింది. ఫలితంగా హైవేలపై వెళ్తున్నప్పుడు మంచి పెర్ఫామెన్స్‌ను ఫీల్ అవటం జరుగుతుంది.
హోండా సిబిఆర్300ఆర్‌ను ఫుల్ ట్యాంక్ (12.87 లీటర్లు) చేయించుకుంటే 389 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది లీటరు పెట్రోల్‌కు సుమారు 30 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. హోండా సిబిఆర్300ఆర్ బైక్‌లోని ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ 37 మి.మీ. పొడవును కలిగి ఉంటాయి. వెనుక వైపు ప్రో-లింక్ మోనోషాక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.
బ్రేక్స్ విషయావికి వస్తే, ముందు వైపు 296 మి.మీ. టూ-పిస్టన్ కాలిపర్ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు సింగిల్-పిస్టన్ 220 మి.మీ. డిస్క్ బ్రేక్స్‌ను జోడించారు. అయితే, ఈ కొత్త బైక్‌లో సీట్ ఎత్తు (శాడల్ హైట్)ను మాత్రం ఇది వరకటి మాదిరిగానే ఉంచారు. కానీ ఇవి మునుపటి వెర్షన్ కన్నా సన్నగా ఉంటాయి. హోండా సిబిఆర్300ఆర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా మార్చకుండా అలానే ఉంచారు. యూరప్ మార్కెట్లలో ఈ బైక్‌లో ఏబిఎస్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయనున్నారు (ఎందుకంటే, ఇది అక్కడ తప్పనిసరి కాబట్టి). ఇతర మార్కెట్లలో మాత్రం ఏబిఎస్ ఆప్షనల్‌గా ఉండనుంది.


Click it and Unblock the Notifications








