భారత్‌లో 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' విడుదల ఖరారు
అమెరికాకు చెందిన పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' (Indian Motorcycles) వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గడచిన మే నెలలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఇదే విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
అమెరికాలో ఇటీవలే సరికొత్త ఇంజన్‌తో పాటుగా మూడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్స్, ఇప్పుడు ఆ ఉత్పత్తులను భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. భారత్‌లో ప్రీమియం బైక్‌లకు మంచి డిమాండ్ ఉండటంతో, ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే అనేక ప్రీమియం బైక్ కంపెనీలు ఇండియాకు క్యూ కడుతున్న సంగతి తెలిసినదే.
ఒకప్పుడు ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్ కంపెనీ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్'ను ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఏటివి (ఆల్ టెర్రైన్ వెహికల్) తయారీదారైన, అమెరికాకు చెందిన పోలారిస్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకొంది. మరి.. ఈ ఇండియన్ మోటార్‌సైకిల్స్ నుంచి ఇండియాలో లభ్యం కానున్న ఆ కొత్త మోటార్‌సైకిళ్లు ఏంటో తెలుసుకుందాం రండి..!

ప్రస్తుతం ఇండియన్ మోటార్‌సైకిల్స్ కేవలం మూడు ఉత్పత్తులను మాత్రమే ఆఫర్ చేస్తోంది. అవి- ఇండియన్ ఛీఫ్ క్లాసిక్, ఇండియన్ ఛీఫ్ వింటేజ్, ఇండియన్ ఛీఫ్టైన్. ఈ మూడింటిని పోలారిస్ భారత్‌లో విడుదల చేయనుంది.

వాస్తవానికి ఈ మూడు మోటార్‌సైకిళ్లు ఒకే మాదిరిగా ఉంటాయి. కాకపోతే, వీటి పేరును బట్టి ఇందులో ఆఫర్ చేసే ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. ఫలితంగా వీటి ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి.

ఈ మూడు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. అదే సరికొత్త థండర్ స్ట్రోక్ 111 ఇంజన్. ఈ 1819సీసీ ఇంజన్ 161 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇండియన్ అందించే ఎంట్రీ లెవల్ మోడల్ ఛీఫ్ క్లాసిక్ కూడా ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, ప్రీమియం లెథర్ సీట్స్, కీలెస్ స్టార్ట్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి. అమెరికాలో ఈ మోడల్ ధర 18,999 డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.11.83 లక్షలు.

సాఫ్ట్ లెథర్ బ్యాగ్స్‌తో లభించే ఛీప్ వింటేజ్ ధర 20,999 డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.13.08 లక్షలు.

ఇకపోతే క్విక్ రిలీజ్ హార్డ్ లగేజ్ కేస్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లతో లభించే ఇండియన్ ఛీఫ్టైన్ ధర 22,999 డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.14.33 లక్షలు.

ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థ 1901లో స్థాపించారు. కాగా.. 2011లో దీనిని అమెరికాకు చెందిన పోలారిస్ ఇండస్ట్రీస్ తమ కైవశం చేసుకుంది. ఇండియన్ మోటార్‌సైకిల్స్ బ్రాండ్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేస్తామని గతంలో పోలారిస్ ఇండస్ట్రీస్ ఇండియా హెడ్ పంకజ్ దూబే వెల్లడించారు. జనవరిలో 2014లో వీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

గడచిన శతాబ్ధ కాలంలో ఇండియన్ మోటార్‌సైకిల్ ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రాచుర్యమైన ఇండియన్ ఛీఫ్, స్కౌట్ వంటి మోటార్‌సైకిళ్లను పరిచయం చేసింది. ఇండియన్ స్కౌట్ మోటార్‌సైకిల్ ఆంథోనీ హాప్‌కిన్స్ నటించిన ప్రముఖ హాలీవుడ్ చిత్రం ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఇండియన్‌లో దర్శనమిస్తుంది.

పోలారిస్ చేతిలో ఇప్పటికే ప్రముఖ అమెరికన్ మోటార్‍సైకిల్ బ్రాండ్ విక్టరీ కూడా ఉన్న సంగతి తెలిసినదే. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం విక్టరీ మోటార్‌సైకిళ్లు కూడా భారత్‌కు రానున్నాయి.


Click it and Unblock the Notifications








