కవాసకి నిన్జా హెచ్2 బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.10 లక్షలు
జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి ఈ ఏడాది మిలాన్‌లో జరిగిన 2014 ఈఐసిఎమ్ఏ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచిన రెండు సరికొత్త మోడళ్లు నిన్జా హెచ్2, నిన్జా హెచ్2ఆర్‌లలో నిన్జా హెచ్2 బైక్‌ని ఇండియాకు తీసుకురానుంది. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి మొత్తం ఐదు కవాసకి నిన్జా హెచ్2 బైక్‌లను అందిస్తామని కంపెనీ పేర్కొంది.
ఈ ఐదు యూనిట్ల కోసం ఇప్పటికే నాలుగు బుకింగ్‌లు వచ్చాయి, కాగా.. మరొక యూనిట్ కోసం మాత్రమే బుకింగ్ అందుబాటులో ఉంది. అయితే, మరిన్ని యూనిట్ల కోసం బుకింగ్‌లు స్వీకరిస్తామని కంపెనీ ప్రకటించింది. కానీ, ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు మాత్రం నెలల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది.

కవాసకి నిన్జా హెచ్2ను బుక్ చేసుకోవాలనుకునే వారు రూ.10 లక్షల అడ్వాన్సును చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్ మొత్తమే ఇంత ఉంటే, అసలు బైక్ ఖరీదు ఎంత ఉంటుందో అనుకుంటున్నారా..? జస్ట్ రూ.32.80 లక్షలు మాత్రమే (ఆన్-రోడ్, పూనే). కవాసకి హెచ్2 అత్యంత వేగవంతమైన, స్ట్రీట్ లీగల్ సూపర్‌బైక్.
కవాసకి నిన్జా హెచ్2 బైక్‌లో 998సీసీ, ఇన్-లైన్ ఫోర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 197.18 హార్స్‌పవర్‌ల శక్తిని, 113.5 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అధిక స్పీడ్‌ను సాధించేందుకు గాను ఇందులో టర్బోచార్జర్‌ను కూడా ఉపయోగించారు.

ఈ బైక్‌లో కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, కవాసకి ఇంటెలిజెంట్ యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్, కవాసకి లాంచ్ కంట్రోల్ మోడ్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లతో పాటుగా పలు ఇతర స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కాగా.. వచ్చే ఏడాది యమహా తమ కొత్త 2015 ఆర్1 బైక్‌ను కూడా ఇండియాకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications








