ఫ్రంట్ స్ప్రాకెట్ సమస్య కారణంగా కెటిఎమ్ 390 డ్యూక్ రీకాల్
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఫ్లాగ్‌షిప్ 390 డ్యూక్‌లో తయారీ లోపం వల్ల కొన్ని యూనిట్లకు వెనక్కు (రీకాల్) పిలిపిస్తోంది. కెటిఎమ్ డ్యూక్ 390 మోడళ్లలోని ఫ్రంట్ స్ప్రాకెట్ లాకింగ్ ప్లేట్ సమస్య కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ మేరకు కెటిఎమ్ రీకాల్‌కు వర్తించే డ్యూక్ 390 యజమానులను ప్రత్యేకంగా సంప్రదించి, ఈ సమస్య గురించి తెలియజేసి, తమ మోటార్‌సైకిళ్లను సర్వీస్ సెంటర్ల వద్దకు తీసుకురావల్సిందిగా సూచించనుంది. సర్వీస్ సెంటర్లకు తీసుకు వచ్చిన డ్యూక్ 390 బైక్‌లలో ఈ సమస్యను చెక్ చేసి, లోపాలను ఉచితంగా సరిచేయనున్నారు.
మార్చ్ 2014 తర్వాత ఉత్పత్తి చేసిన వాహనాల్లో ఈ సమస్యను గుర్తించామని కెటిఎమ్ పేర్కొంది. దీనిని సరిచేయకుండా అలానే వదిలేస్తే, కొంత కాలం తర్వాత స్ప్రాకెట్ అలైన్‌మెంట్ మారి, చైన్ తరచూ జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ లోపాన్ని సరిచేయటానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుందని కంపెనీ తెలిపింది.

కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 373.2సీసీ ఇంజన్ గరిష్టంగా 43.5 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది.
ఏబిఎస్, మెట్‌జెలెర్ టైర్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్, సాటిలేని పవర్‌లతో ఇది రేసింగ్, సిటీ, హైవే రైడ్‌ల కోసం చక్కగా సరిపోతుంది. భారతదేశంలోనే ఇది తొలి మిడ్-సైజ్ స్పోర్ట్స్ బైక్ కావటం విశేషం. దీని పవర్ టు రేషియో (పిటిడబ్ల్యూ) టన్నుకు 300 పిఎస్‌లు. ఈ పిటిడబ్ల్యూతో ఇది సాటిలేని పికప్‌ను, గరిష్ట వేగాన్ని ఆఫర్ చేస్తుంది.
పవర్‌ఫుల్ ఇంజన్, లైట్ వెయిట్ మరియు ఈజీ హ్యాండ్లింగ్ ఫీచర్లతో కూడిన 390 డ్యూక్ ప్రొఫెషనల్ రైడర్లకు అలాగే స్పోర్టీ రైడ్ కోరుకునే వారికి చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. ముందు వైపు 300 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 మి.మీ. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 145 కిలోల బరువు, మెట్‌జెలెర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు, స్పోర్టీ డిజైన్ వంటి ప్రధాన ఫీచర్లు కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ సొంతం.


Click it and Unblock the Notifications








