దీపావళికి ముందే దిగిరానున్న పెట్రోల్ ధరలు
దీపావళికి ముందే పెట్రోల్ ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గముఖం పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై సుమారు రూ.1 తగ్గింపును ప్రకటించే అవకాశం ఉంది.
ఇదే గనుక జరిగితే పెట్రోల్ ధరలు 16 నెలల కనిష్టానికి దిగొచ్చే ఆస్కారం ఉంటుంది. గడచిన జూన్ 2014లో ఆల్-టైమ్ హైకి చేరుకున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ప్రస్తుతం దాదాపు 20 శాతం పైగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా, భారత మార్కెట్లో చమురు ధరలను సవరించనున్నారు.

గుడ్ న్యూస్ ఏంటంటే.. పెట్రోల్‌తో పాటుగా డీజిల్ ధరలు కూడా తగ్గటం. అవును.. గత కొంత కాలంగా ప్రతినెలా పెరుగుతూ వచ్చిన డీజిల్ ధరలు త్వరలోనే తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. డీజిల్ ధరను ప్రతినెలా పెంచుకుంటూ వచ్చిన కారణంగా, ప్రస్తుతం విక్రయిస్తున్న రీటైల్ ధరపై చమురు కంపెనీలు సుమారు రూ.3 వరకూ లాభం పొందుతున్నట్లు సమాచారం.
ఈ మార్కెట్ ట్రెండ్ ఇలానే కొనసాగితే, ప్రభుత్వం డీజిల్ ధరలపై తమ నియంత్రణలను ఎత్తివేస్తుంది. ఆ తర్వాత డీజిల్ ధరల నియంత్రణ చమురు కంపెనీల చేతికి వస్తుంది. ఇదే గనుక జరిగితే, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలోని ధరలను అనుసరించి భారత్‌లో పెట్రోల్ ధరలను సవరించినట్లుగానే, డీజిల్ ధరలను కూడా అంతర్జాతీయ మార్కెట్లలోని ధరలకు అనుగుణంగా నియంత్రించడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








