వెస్పా రేంజ్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్‌ను పరిచయం చేయనున్న పియాజ్జియో
ఇటాలియన్ కార్ కంపెనీ పియాజ్జియో దేశీయ విపణిలో విక్రయిస్తున్న వెస్పా రేంజ్ స్కూటర్లలో ఫ్యూయెల్ ఇంజెక్షన్ (FI) వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రెగ్యులర్ కార్బురేటర్ ఇంజన్లతో పోల్చుకుంటే, ఈ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజన్లు మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేయటమే కాకుండా, మెరుగైనన మైలేజీని కూడా ఇస్తాయి.
ప్రస్తుతం పియాజ్జియో భారత మార్కెట్లో వెస్పా విఎక్స్, ఎల్ఎక్స్, ఎస్ మరియు ఎస్‌క్లూజివో వేరియంట్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.68,272 నుంచి రూ.76,495 (ఎక్స్-షోరూమ్, ముంబై) మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ కార్బురేటర్ కలిగిన ఇంజన్లే. ఈ నేపథ్యంలో, ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగిన వెస్పా స్కూటర్ల ధరలు సుమారు రూ.4,000 వరకు అధనంగా ఉండొచ్చని అంచనా.

ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగిన వెస్పా స్కూటర్లు నవంబర్ మధ్యభాగం నాటికి మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని అంచనా. ప్రస్తుతం దేశీయ విపణిలో వెస్పా అందిస్తున్న అన్ని స్కూటర్లలోను ఒకేరకమైన 125సీసీ, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.45 హార్స్‌పవర్‌ల శక్తిని, 10 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ కూడా సివిటి గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటాయి.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, పియాజ్జియో తమ వెస్పా స్కూటర్లలో మరింత ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా అది 150సీసీ ఇంజన్ అయి ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








