భారత్‌లో ద్విచక్ర వాహనాలకు ఏబిఎస్ తప్పనిసరి కానుందా?
దేశంలో వాహనల సంఖ్య పెరుగుతున్న కొద్దీ రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, వాహనాల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే, వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి అన్ని వాణిజ్య వాహనాల్లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను తప్పనిసరి చేయాల్సిందిగా ఆదేశించిన ప్రభుత్వం తాజాగా భారతదేశంలోని అన్ని ద్విచక్ర వాహనాల్లో కూడా ఈ ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది.
ప్రారంభంలో భాగంగా, ఎక్కువ ఇంజన్ సామర్థ్యం (బహుశా 200-250 సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం) కలిగిన అన్ని పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లలోను ఈ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)ని తప్పనిసరి చేసిన తర్వాత, దశల వారీగా సాధారణ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో కూడా ఏబిఎస్‌ను ప్రవేశపెట్టాలని భారత రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.

అంటే, మరికొద్ది సంవత్సరాల్లో అన్ని ద్విచక్ర వాహనాల్లోను ఏబిఎస్ ఓ తప్పనిసరి కనీస భద్రతా ఫీచర్ కానుందన్నమాట. ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు ఇక తమ అన్ని భవిష్యత్ మోడళ్లలో ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే, అధిక ఇంజన్ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలన్నీ కూడా తప్పనిసరిగా ఏబిఎస్‌ను కలిగి ఉండాలనే నిబంధన అమల్లో ఉంది.
ఏబిఎస్ అంటే ఏమిటి..? అదెలా పనిచేస్తుంది..?
సాదారణ బ్రేకింగ్ సిస్టమ్ (డ్రమ్/డిస్క్)లో రోడ్డుపై అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో (ప్రత్యేకించి తడిసిన రోడ్లపై) బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరిగడం (టైర్ రోలింగ్) ఆగిపోయి టైర్లు రోడ్డపై రాచుకుంటూ, బ్రేకింగ్ దూరం పెరిగి వాహనం జారిపోయే ప్రమాదం ఉంది. అయితే, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లో అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరగడం ఆగిపోకుండానే వాహన వేగాన్ని పూర్తిగా నియంత్రించి, బ్రేకింగ్ దూరాన్ని (బ్రేకింగ్ డిస్టన్స్) తగ్గించి, ప్రమాదం నుండి తప్పించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.


Click it and Unblock the Notifications








