ఇక టాటా నానోకు కాంపిటిటర్ లేనట్లేనా..!?

అల్ట్రా-లో-కాస్ట్ కారును రూపొందించేందుకు జనరల్ మోటార్స్ మరియు రీనాల్ట్-నిస్సాన్‌లతో ఫోర్డ్ చేతులు కలపింది. అయితే, ఆ తర్వాత మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, ముడి సకురుల ధరలు, మార్జిన్లు, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల కారణంగా ఫోర్డ్ తన ప్రయత్నాన్ని విరమించుకుంది.
జనరల్ మోటార్స్ కూడా భారత్‌లో చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కారు స్పార్క్ కన్న చౌకగా మరో కారును విడుదల చేయలేమని చేతులెత్తేసింది. "లక్ష రూపాయల కారు (టాటా నానో) మార్కెట్లోకి వచ్చినపుడు ఇది (చిన్న కారు) కంపెనీలో చర్చనీయాంశంగా ఉన్నది. అయితే, ఇప్పుడు ఇది మాకు సరికాదనే నిర్ణయానికి వచ్చామ"ని జనరల్ మోటార్స్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ తెలిపారు.
అలాగే, టాటా నానో కారు ధీటుగా భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో రూపొందిస్తున్న ఆల్ట్రా-లో-కాస్ట్ కారు ప్రాజెక్టు కూడా టాటా నానోకు పోటీ ఇవ్వడం అనుమానమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై బజాజ్ ఆటో ఇప్పటికీ ఓ స్పష్టమైన వైఖరిని తెలియజేకపోవడంతో ఇందులో భాగస్వామ్యంగా ఉన్న రీనాల్ట్-నిస్సాన్ కంపెనీలో సందేహంలో పడ్డాయి. వీటన్నింటినీ చూస్తుంటే 'ప్రజల కారు'కు పోటీగా మరో చిన్న కారు భారత మార్కెట్లోకి రాదేమో అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. మరి మీరేమంటారు..!?


Click it and Unblock the Notifications








