పాల్-వి ఫ్లయింగ్ కార్ ప్రత్యేకతలు - పార్ట్ 1
రోజు రద్దీగా ఉండే ఈ రోడ్లపై ప్రయాణిస్తూ, గంటలు గంటలు నిలిచిపోయే ట్రాఫిక్‌ను చూస్తే చిరాకు వేస్తుంది కదూ. ఇలాంటి సమయంలో మీ కారు ఎంచక్కా రెక్కలు ఉండి, గాలిలో రివ్వున ఎగిరిపోతే బావుంటుందని అనిపిస్తుంది కదూ. ఏంటీ పగటి కలలు కంటున్నారా..? ఇవన్నీ సినిమాలోనే సాధ్యం అని కొట్టి పారేయకండి. ఈ ఊహ ఇప్పటికే నిజం కూడా అయిపోయింది. ఇక అమలులోకి రావటమే తరువాయి.
ఇప్పటికే, అమెరికాకు చెందిన టెర్రాఫుజియా అనే కంపెనీ ఓ ఎగిరేకారు (ట్రాన్సిషన్)ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా, నెథర్లాండ్స్‌కు చెందిన "పాల్-వి యూరప్ ఎన్‌వి" అనే ఓ డచ్ కంపెనీ విభిన్నమైన ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్‌ను తయారు చేసింది. అంతేకాదు, ఈ కారును విజయవంతంగా టెస్ట్ రన్ కూడా నిర్వహించింది.
ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించేలా మూడు చక్రాలతో డిజైన్ చేసిన ఈ ఫ్లయింగ్ కార్ 'పాల్-వి'లో 160 కి.వా. ఫ్లైట్ సర్టిఫైడ్ గ్యాసోలైన్ ఇంజన్‌ను అమర్చారు. ఇది కేవలం 8 సెకండ్లలలోపే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టం గంటకు 180 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. నేలపై పాల్-వి లీటరుకు 12 కి.మీ. మైలేజీనిస్తుంది. దీనిని ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 1,200 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications









