స్కొడా ఆక్టావియాలో చవక వేరియంట్ విడుదల
స్కొడా ఇండియా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం సెడాన్ '2013 స్కొడా ఆక్టావియా'లో కంపెనీ తాజాగా తక్కువ ధరకే ఓ ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త స్కొడా ఆక్టావియా 1.8 యాంబిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.16.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: 2013 స్కొడా ఆక్టావియా రివ్యూ
ఇప్పటి వరకు 1.8 టిఎస్ పెట్రోల్ ఇంజన్ కలిగిన వేరియంట్ కేవలం ఎలిగాన్స్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుండేది. దాని ధర రూ.18.81 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. ఈ వేరియంట్ కన్నా దాదాపు రూ.2 లక్షలు తక్కువ ధరకే స్కొడా ఈ కొత్త ఆక్టావియా వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్లో ధరతో పాటే కొన్ని ఫీచర్లను కూడా కత్తిరించారు.
కొత్త స్కొడా ఆక్టావియా 1.8 యాంబిషన్ పెట్రోల్ వేరియంట్లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, జెనాన్ హెడ్‌ల్యాంప్స్, హెడ్‌లైట్ వాషర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, పనారోమిక్ సన్‌రూఫ్, 12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, వింగ్ మిర్రర్స్ కోసం మెమరీ సెట్టింగ్స్‌ను తొలగించారు.
అయితే, ఇందులో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్లైమేట్ కంట్రోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షనల్ డిస్‌ప్లే ఫీచర్లను అలానే ఉంచారు. ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 1.8 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 177.66 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications









