జులై నాటికి కొత్త 2014 స్కొడా యెటి ఎస్‌యూవీ విడుదల
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'స్కొడా' (Skoda) భారత మార్కెట్లో విక్రయిస్తున్న యెటి సెడాన్‌లో వచ్చే నెలలో ఓ అప్‌గ్రేడెడ్ 2014 వెర్షన్‌ను విడుదల చేయనుంది. స్కొడా ఇండియా గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో తమ సరికొత్త యెటి ఎస్‌యూవీని ప్రదర్శనకు ఉంచింది. భారత మార్కెట్లో స్కొడా యెటి విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మోడల్‌లో పూర్తిస్థాయి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాలేదు.
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసినదే. అయితే, ఈ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చేలా స్కొడా నుంచి ఎలాంటి ఎస్‌యూవీ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, జులై 2014లో విడుదల కానున్న కొత్త యెటి ఎస్‌యూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి స్కొడా ఇప్పటికే తమ అప్‌గ్రేడెడ్ యెటి ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లోల విక్రయిస్తోంది.

స్కొడా యెటి రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్ కలిగిన స్కొడా యెటిలో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 110 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
ఇకపోతే, ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ కలిగిన స్కొడా యెటిలో కూడా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. అయుతే, ఈ ఇంజన్ గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
ప్రస్తుతానికి స్కొడా యెటి ఆటోమేటిక్ వేరియంట్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. స్కొడా యెటి 110 పిఎస్, 4x2 వెర్షన్ ధర రూ.15 లక్షలు, స్కొడా యెటి 140 పిఎస్, 4x4 వెర్షన్ ధర రూ.19 లక్షలు ఉండొచ్చని అంచనా.

సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు, మోడ్రన్ టెక్నాలజీ మరియు విలాసవంతమైన కంఫర్టీ ఫీచర్లతో కొత్త స్కాడా యెటిని అప్‌గ్రేడ్ చేశారు. కొత్త 2014 స్కొడా యెటి రిఫ్రెష్డ్ డిజైన్‌తో సరికొత్త లుక్‌ను కలిగి ఉంటుంది. ముందు వైపు కొత్త బంపర్, కొత్త గ్రిల్, కొత్త బ్యాడ్జ్‌లతో చాలా నీట్‌గా కనిపిస్తుంది.
అలాగే, వెనుక డిజైన్‌ను గమనిస్తే, C ఆకారంలో ఉండే టెయిల్ ల్యాంప్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. బాడీ కలర్డ్ బంపర్స్, సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ మరొక ప్రత్యేకత. దీని ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. 2014 స్కొడా యెతి ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








