షోరూమ్ నుంచి బయటకు రాలేదు.. అంతలోనే నుజ్జునుజ్జు.. కొత్త కారు కొన్నవారికి షాక్!
కారు కొనడం అనేది సామాన్యులకు కల లాంటిది. కొత్త కారు కొనే రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్యులు కారు కొనుగోలు చేయడానికి రూపాయి రూపాయి కూడబెట్టుకుంటారు. వారు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుందని.. కారు డెలివరీ తీసుకునే రోజు వారి సంతోషానికి అవధులు ఉండవు. కానీ, ఒక్కోసారి ఆ ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకోలేక కొందరు కొత్త కారుతో క్షణాల్లోనే ప్రమాదాలకు గురవుతుంటారు.
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక ఘటనే దీనికి ఉదాహరణ. షోరూమ్ నుంచి బయటకు కూడా రాని మహీంద్రా థార్ కారు యాక్సిడెంట్‌కు గురైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దురదృష్టకర సంఘటన గురించి వివరంగా తెలుసుకుందాం.

ఢిల్లీలో వైరల్ అయిన ఘటన
ప్రతీక్ సింగ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సరికొత్త మహీంద్రా థార్ రాక్స్ కారు డెలివరీ తీసుకుంటున్న సమయంలోనే భారీ ప్రమాదానికి గురైంది. ఈ కారును కొనుగోలు చేసింది ఒక మహిళ. ఆమె కారును డెలివరీ తీసుకునే రోజున, మహీంద్రా థార్ రాక్స్ మొదటి అంతస్తులో నిలిపి ఉంది.
కారును బయటకు తీస్తున్న క్రమంలో ఆమె పొరపాటున యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కడంతో, కారు వేగంగా ముందుకు దూసుకెళ్లింది. మొదటి అంతస్తులోని అద్దాలను బద్దలు కొట్టుకుని, మహీంద్రా థార్ రాక్స్ కారు కిందకు తలకిందులుగా పడిపోయింది. కొత్త కారును డెలివరీ తీసుకునే రోజే ఇలాంటి ప్రమాదానికి గురికావడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
భారీ నష్టం
ఈ ప్రమాదంలో మహీంద్రా థార్ రాక్స్ కారు చాలా తీవ్రంగా దెబ్బతింది. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భారత మార్కెట్‌లో మహీంద్రా థార్ రాక్స్ కారు ప్రారంభ వేరియంట్ ధర రూ.12.99 లక్షల నుండి మొదలై, టాప్ వేరియంట్ రూ.23.39 లక్షల వరకు ఉంటుంది. అయితే, ప్రమాదానికి గురైన కారు ఏ వేరియంట్‌కు చెందినదో తెలియరాలేదు.

ఇదే మొదటిసారి కాదు
భారతదేశంలో కొత్త కారును డెలివరీ తీసుకునే రోజున ప్రమాదాలకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. వైరల్ వీడియో ప్రారంభంలో అలాంటి కొన్ని సంఘటనలను కూడా చూడవచ్చు.
జాగ్రత్త అవసరం
కొత్త కారును డెలివరీ తీసుకునే రోజున మనసు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే, ఈ ఉత్సాహాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే, ఇలాంటి ప్రమాదాలు జరిగి సంతోషకరమైన రోజు కాస్త విషాదంగా ముగిసే అవకాశం ఉంది. కారుతో సహా ఏ వాహనాన్ని నడుపుతున్నప్పుడు అయినా, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు, కారు ఏదైనా సరే, చాలా నిదానంగా, జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఇది చాలా ముఖ్యం. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

ఫీచర్ల విషయానికి వస్తే.. థార్ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మొదటిది, 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (mStallion), ఇది 150 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పవర్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. రెండవది, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ (mHawk), ఇది 130 bhp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తాయి.
బయట నుంచి దృఢంగా కనిపించే థార్ లోపల మాత్రం చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. సుదూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండేందుకు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. థార్ సాఫ్ట్ టాప్, హార్డ్ టాప్ ఆప్షన్లలో లభిస్తుంది. హార్డ్ టాప్ కారు లోపల శబ్దాన్ని తగ్గించి ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తుంది.
సేఫ్టీ విషయంలో మహీంద్రా థార్ ఎక్కడా రాజీ పడదు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను ఇది సాధించింది. ఇందులో డ్రైవర్, ప్యాసింజర్ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(EBD) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అలాగే, పార్కింగ్ చేసేటప్పుడు సహాయపడే రియర్ పార్కింగ్ సెన్సార్స్, పిల్లల సీట్లను సురక్షితంగా అమర్చడానికి ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








