పాల్ వాకర్ పోర్షే యాక్సిడెంట్‌కు గల కారణం తెలిసింది!
గడచిన డిసెంబర్ నెలలో భీకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ (Paul Walker), పోర్షే కారు యాక్సిడెంట్‌కు గల కారణం వెల్లడైంది. పాల్ వాకర్ మరియు అతని స్నేహితుడు రోగర్ రోడ్స్ పోర్షే కరెరా జిటి స్పోర్ట్స్ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో కారును రోగర్ రోడ్స్ నడుపుతుండగా, పాల్ వాకర్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లో కూర్చుని ఉన్నాడు.
ఈ ప్రమాదానికి కారణం, మితిమీరిన వేగమేనని లాస్ ఏంజిల్స్ కంట్రీ కార్నర్స్ ఆఫీస్ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ప్రమాదానికి ముందు పోర్షే కారును గంటకు 100 మైళ్లకు పైగా వేగంతో (160+ కెఎమ్‌పిహెచ్) నడుపుతున్నట్లు ఆ నివిదేకలో తేలింది. మొత్తం 15 పేజీలున్న ఆ రిపోర్టులో రోగర్ రోడ్స్ కారును అతివేగంగా నడుపుతుండటంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే చెట్టును ఢీకొట్టడంతో క్షణాల వ్యధిలో కారులో మంటలు చెలరేగి, అందులోని ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందడం జరిగిందని స్పష్టం చేశారు.
మొదట కారు డ్రైవర్ భాగం ఓ చెట్టును ఢీకొట్టడంతో, కారు గాలిలో 180 డిగ్రీల కోణంలో పల్టీ కొట్టి పక్కనే ఉన్న మరో చెట్టును ఢీకొని మంటల్లో కాలిపోయిందని, ఆ సమయంలో డ్రైవర్ రోగర్ రోడ్స్ కానీ, పాల్ వాకర్ కానీ మద్యం లేదా డ్రగ్స్ తీసుకోలేదని ఆ నివేదికలో తేలింది. యాక్సిడెంట్ వలన రోగర్ రోడ్స్‌కు తల, మెడ, ఛాతీ భాగంలో గాయాల కారణంగా అక్కడిక్కడే మరణించగా, పాల్ వాకర్ కారులో మంటలు రావటం, పొగ కమ్ముకుపోవటంతో ఊపిరి అందక మృతి చెందినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఫిలీప్పిన్స్ తుపాను బాధితులకు సాయం చేయటం కోసం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్ వాకర్ మరణించాడు. పాల్ వాకర్‌కు నివాళిగా యూనివర్సల్ పిక్చర్స్ (ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ) తమ 7వ ఎడిషన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్ర షూటింగ్‌ను కొంత కాలం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications









