ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న రెండు ఒబామా 'దెయ్యాలు'
అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జనవరి 26న జరగనున్న గణతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు భారతదేశానికి వస్తున్న సంగతి తెలిసినదే. ఒబామా ఆదివారం (జనవరి 25, 2015) ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగనున్నారు. ఈ నేపథ్యంలో, ఒబామా కంటే ముందుగా ఆయన భద్రతా వాహనాలు ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నాయి.
భారత్‌లో ఒబామా పర్యటన కోసం ఆ దేశం తమ అధ్యక్ష వాహనాలను (క్యాడిలాక్) సి-17 గ్లోబ్‌మాస్టర్ అనే విమానంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయంలో ల్యాండ్ చేసింది. మొత్తం రెండు వాహనాలు ఇండియాకి వచ్చినట్లు సమాచారం. వీటిని విమానాశ్రయంలో పూర్తి భద్రతా వలయంలో ఉంచారు. ఒబామా ఎయిర్ ఫోర్స్ విమానం కూడా ఇదే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది.
బరాక్ ఒబామా ఎయిర్‌పోర్ట్ నుంచే తన కారును ఉపయోగించనున్నారు. ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే ఆయన నేరుగా సర్దార్ పటేర్ మార్గ్‌లో ఉన్న మౌర్య షెరటాన్ హోటల్‌లో బస చేస్తారు. గడచిన మే నెలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నిమిత్తం వెళ్లినప్పుడు ఈ క్యాడిలాక్ లీమోజైన్ వాహనంలో ప్రయాణించారు.
ఒబామా ఢిల్లీ పర్యటన నేపథ్యంలో, ఇప్పటికే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ బలగాలు ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాలను జల్లెడ పట్టేస్తున్నాయి. అమెరికా నుంచి కూడా ప్రత్యేక సాయుధ బలగాలు ఇండియాకు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్ష వాహనాలు ఇండియాకు చేరుకున్నప్పటికీ, ఆయన తమ క్యాడిలాక్ కారులోనే ప్రయాణిస్తారా లేక మనదేశ సాంప్రదాయం ప్రకారం భారత ప్రెసిడెంట్ కారులో ప్రయాణిస్తారా అనే అంశంపై ఇంకా సందిగ్ధత అలానే ఉంది.
సాధారణంగా అమెరికా అధ్యక్షులు ఏ దేశానికి వెళ్లినా, తమ అధికారిక కారులోనే ప్రయాణిస్తారు. అయితే, మన దేశంలో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఇతర దేశాల అధిపతులు మాత్రం రాష్ట్రపతితో కలిసి వారి వాహనంలోనే వేదికను చేరుకోవడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో, ఒబామా ఈ సంప్రదాయాన్ని గౌరవించి రాష్ట్రపతి కారులో ప్రయాణిస్తారా లేక అమెరికా నుంచి వస్తున్న క్యాడిలాక్ కారులోనే ప్రయాణిస్తారా అనేది తెలియాలంటే జనవరి 26 వరకూ వేచి ఉండాల్సిందే.
అమెరికా సైన్యం ముద్దుగా ది బీస్ట్ (దెయ్యం) అని పిలుచుకునే ఈ అత్యంత సురక్షితమైన, సాయుధ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్యాడిలాక్ లీమోజైన్‌ను అమెరికా అధ్యక్షుడి కోసం జనరల్ మోటార్స్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసింది. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై కానీ లేదా పైఫొటో కానీ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications










