విల్లీస్ జీప్ కేవలం రూ.12,421 మాత్రమే.. ఫొటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!
ఎస్‌యూవీ ప్రియులకు విల్లీస్ జీప్ (Willys Jeep) ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కస్టమైజ్డ్ జీప్స్ కోరుకునే వారు ఇప్పటికీ పురాతన విల్లీస్ జీప్ లకే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ కాలంలో (1960లో) ఈ మోడళ్లకు ఉండే ప్రత్యేక గుర్తింపే వేరు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ పరిచయం చేసిన ఈ జీప్ వాహనాలు ఆనాటి రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా, మంచి ప్రజా రవాణా సాధనంగా ఉపయోగపడేవి.

మరి ఇంతటి ప్రాచుర్యం కలిగిన జీప్ వాహనాలను అప్పట్లో ఎంత ధరకు విక్రయించేవారో తెలుసా..? ఆ విషయాన్ని తాజాగా ఆనంద్ మహీంద్రా తెలియజేశారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసినదే. సమాజంలో తనకి నచ్చే వివిధ అంశాలను మరియు విషయాలను ఆయన తన ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా పురాతన జీప్ విషయంలో ఆయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

మహీంద్రా తయారు చేసిన జీప్ విల్లీస్ పాత ధరను ఆయన ప్రజలతో పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, 1960 కాలంలో మహీంద్రా విల్లీస్ జీప్ మోడల్ సిజె 33 (Willys Model CJ 33 Jeep) ని కేవలం రూ. 12,421 లకు (ఎక్స్-షోరూమ్, ముంబై) కి మాత్రమే విక్రయించేవారు. ఈ పోస్టర్ 1960 సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ప్రచురించబడినట్లుగా చెబుతున్నారు. ఆ సమయంలో విల్లీస్ జీప్ ధరపై రూ.200 తగ్గింపును కూడా అందించినట్లు ఈ ప్రకటనలో పేర్కొనబడి ఉంది.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన 1960 జీప్ విల్లీస్ పోస్టర్ ప్రకారం, మహీంద్రా అండ్ మహీంద్రా తమ విల్లీస్ జీప్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్లు, ధర తగ్గింపు అనంతరం విల్లీస్ మోడల్ సీజే 33 జీప్ కొత్త ధర రూ. 12,421 గా ఉంటుందని ఈ పోస్టర్ ముద్రించారు. ఈ ప్రకటనను ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో, "దశాబ్దాలుగా మహీంద్రా వాహనాలను వ్యాపారం చేస్తున్న నా మంచి స్నేహితుడు అతని ఆర్కైవ్‌ల నుండి దీన్ని నాతో పంచుకున్నారు. ఆహ్! అవి మంచి పాత రోజులు... ఆమె (జీప్) ధరలు సరైన దిశలో కదులుతున్నప్పటి రోజులు" అని ట్వీట్ చేశారు.

వినియోగదారుల నుండి ఫన్నీ రెస్పాన్స్
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ పోస్ట్‌పై ఫన్నీ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, "ఈ ధర చాలా బాగుంది, మేము కూడా ఈ ధరకు వాహనం కొనుగోలు చేయవచ్చా?" అని. దీనికి ఆనంద్ మహీంద్రా ఇలా వ్రాశారు, "నేటి కాలంలో ఈ మొత్తంతో మీరు ఏ మహీంద్రా ఉపకరణాలను కొనుగోలు చేయవచ్చో తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను." అని సమాధానం ఇచ్చారు.

ఇదే విషయంపై మరొక వినియోగదారుడు ఇలా వ్రాశారు, "సార్ నా కోసం రూ. 12,421 కి రెండు బుక్ చేయండి. దయచేసి మునుపటి ధర యొక్క రోజుని తిరిగి ఇవ్వండి" అని. దీనికి ప్రతిస్పందనగా, ఆనంద్ మహీంద్రా థార్ యొక్క స్క్రీన్‌షాట్ ను పంచుకున్నారు మరియు ఈ ధరకు మహీంద్రా అమెజాన్‌లో విక్రయించే 10 డై-కాస్ట్ థార్ బొమ్మలను కొనుగోలు చేయగలమని చెప్పారు. ఇంతకుముందు జీప్ రూ. 12,421 కి వచ్చేదని, ఇప్పుడు ఫ్లోర్ మ్యాట్, మడ్‌ఫ్లాప్స్, పెర్ఫ్యూమ్ బాటిల్, ఏదైనా చిన్న విగ్రహం, డస్ట్ కవర్ వంటివి మాత్రమే ఈ ధరకు కొనుగోలు చేయవచ్చని చెప్పారు.

అసలు విల్లీస్ జీప్ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమైంది?
మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల తయారీని ప్రారంభించే ముందు, ఈ కంపెనీ యూకే లోని కంపెనీలతో ఉక్కు వ్యాపారం చేసేది. అదే సంవత్సరంలో మహీంద్రా భారతదేశంలో విల్లీస్ జీప్ ఉత్పత్తి చేయడానికి లైసెన్స్ పొందింది మరియు 1949 లో మొదటి విల్లీస్ సిజె33 జీప్ ఉత్పత్తిని ప్రారంభించింది. దేశంలో 4-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో వచ్చిన మొదటి ఆఫ్‌రోడర్ కారు కూడా ఇదే కావడం విశేషం. కొన్ని సంవత్సరాల తర్వాత మహీంద్రా విల్లీస్ జీప్ లైసెన్స్ ను ఓ జపాన్ కంపెనీకి అప్పగించింది.

మహీంద్రా బొలెరో క్యాంపర్ (Mahindra Bolero Camper) వస్తోంది..
ఇదిలా ఉంటే మహీంద్రా అండ్ మహీంద్రా నుండి భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్ లో ఒకటైన 'మహీంద్రా బోలేరో' (Mahindra Bolero) లో కంపెనీ ఓ క్యాంపర్ వేరియంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బొలెరో యొక్క క్యాంపర్ మోడల్ కోసం కంపెనీ ఇటీవలే ఐఐటి మద్రాస్-బేస్డ్ కారవాన్ తయారీ సంస్థ అయిన కాంపర్‌వాన్ ఫ్యాక్టరీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో కంపెనీ 'మహీంద్రా బొలెరో క్యాంపర్' ను విడుదల చేస్తుంది. - దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications