బెనెల్లీ నుండి 150సీసీ బైకు: పేటెంట్ ఫోటోలు రివీల్
బెనెల్లీ అభివృద్ది చేస్తున్న 150సీసీ బైకు మీద పేటెంట్ హక్కులు పొందిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటాలియన్ టూ వీలర్ల తయారీ సంస్థ బెనెల్లీ సరికొత్త 150సీసీ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేస్తోంది. బెనెల్లీ అభివృద్ది చేస్తున్న 150సీసీ బైకు మీద పేటెంట్ హక్కులు పొందిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

బెనెల్లీ అభివృద్ది చేస్తున్న 150సీసీ మోటార్ సైకిల్‌కు BJ 150-31 అనే కోడ్ పేరును కంపెనీ ఖరారు చేసింది. ఇందులో 150 అనగా బైకులో అందించే ఇంజన్ సామర్థ్యం మరియు 31 అనగా బెనెల్లీ లోని మోడల్ నెంబర్. దీనిని ప్రత్యేకించి ఆసియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.
Recommended Video


గతంలో, 150సీసీ సామర్థ్యం గల ఫెయిర్డ్ వెర్షన్ మోటార్ సైకిల్‌కు పేటెంట్ హక్కులు పొందింది. దీనికి BJ 150-30 కోడ్ పేరును ఖరారు చేసింది. స్పోర్టివ్ లక్షణాలతో పదునైన డిజైన్ అంశాలతో దీనిని రూపొందించింది.

పెద్ద పరిమాణంలో, కండలు తిరిగిన రూపంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ కలదు, ఫ్రంట్ డిజైన్‌లో రేడియేటర్ ఉంది కాబట్టి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఇందులో రానుంది. భీమ్ ఆధారిత ఛాసిస్ ఫ్రేమ్ మీద ఇంజన్ కూర్చోనుంది.

బెనెల్లీ 150సీసీ మోటార్ సైకిల్ ముందు వైపున అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్‌తో రానుంది. బ్రేకింగ్ డ్యూటి కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందివ్వనుంది. చైనాలో బెనెల్లీ విడుదల చేసిన టిఎన్‌టి 150 లో అందించిన అల్లాయ్ వీల్స్‌కు ఇందులో చోటు కల్పించనుంది.

స్పోర్టివ్ స్ల్పిట్ సీటు(రైడర్ మరియు కో రైడర్ కోసం రెండుగా విభజించిన సీటు), టర్న్ ఇండికేటర్లు మరియు నెంబర్ ప్లేటుకు చక్కటి పొజిషన్‌ను కల్పిస్తూ రూపొందించిన రియర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. రెండుగా విభజించబడిన హెడ్ ల్యాంప్ 2017 కెటిఎమ్ డ్యూక్ 390 హెడ్ ల్యాంప్‌ను పోలి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి బెనెల్లీ సర్వత్రా సిద్దమవుతోంది. అందులో భాగంగానే 150సీసీ ఇంజన్ సామర్థ్యం గల బైకులకు పోటెంట్ హక్కులను పొందింది. బెనెల్లీ దేశీయంగా రెండు కొత్త టూ వీలర్లను పరీక్షిస్తోంది. వీటిలో ఒకటి క్రూయిజర్ బైకు కాగా, మరొకటి స్కూటర్.


Click it and Unblock the Notifications








