ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ డెలివరీకి శ్రీకారం చుట్టిన ఓలా; పూర్తి వివరాలు
ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఓలా, ఇండియన్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి తగిన అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలవ్వకముందే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ గా నిలిచింది. ఎందుకంటే బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 1 లక్షకి పైగా బుకింగ్లను స్వీకరించి రికార్డ్ సృష్టించింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ చేసుకున్న వారిలో చాలామందికి ఒక సందేహం, అదేమిటంటే డీలర్ షిప్ లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ఎలా జరుగుతుంది, అని. అయితే దీనికి కంపెనీ పరిష్కారం తెలిపింది. ఇప్పుడు కంపెనీ వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న కస్టమర్లందరికి నేరుగా వారి ఇంటికే డెలివరీ చేస్తుంది. దీనికోసం ఓలా కంపెనీ డైరెక్ట్-టు-కన్స్యూమర్ సేల్స్ మోడల్‌ను ఉపయోగిస్తుంది. కాబట్టి ఇందులో మొత్తం ప్రక్రియ తయారీదారు మరియు కొనుగోలుదారు మధ్య మాత్రమే ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ధర కేవలం 499 రూపాయలు మాత్రమే. ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని త్వరలో విడుదల చేయనుంది. ఈ కొత్త స్కూటర్ రెండు వేరియంట్లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

కంపెనీ విడుదల చేయనున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ స్కూటర్ ధర 1 లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల ఈ స్కూటర్ టెస్ట్ చేసే సమయంలో మూడు కలర్ ఆప్సన్స్ లో గుర్తించబడ్డాయి. ఇందులో పింక్ మరియు బ్లాక్ కాకుండా, బ్లూ కలర్ స్కూటర్స్ గుర్తించబడ్డాయి.

ఈ మూడు కలర్ ఆప్సన్స్ లో మాత్రమే కాకుండా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇతర కలర్ ఆప్షన్లలో కూడా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కారణంగానే ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఛైర్మన్ మరియు సిఇఒ భవీష్ అగర్వాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కలర్స్ పై ప్రజల అభిప్రాయాన్ని కోరింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పరిధి విషయానికి వస్తే, ఇది ఒక పూర్తి ఛార్జీతో దాదాపు 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని తెలుస్తుంది. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్‌తో, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో విస్తృత శ్రేణిలో చేరనుంది. స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల నుంచి 2.5 గంటలు సమయం పడుతుది.

ఓలా ఎలక్ట్రిక్ వద్ద ఉన్న లాజిస్టిక్స్ టీమ్ స్కూటర్ బుకింగ్స్ తెలుసుకుని, దానిని కొనుగోలుదారుడి ఇంటికి చేరుస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లో ఈ మోడల్‌ను స్వీకరించిన మొదటి ద్విచక్ర వాహన తయారీదారు కానుంది. ఈ మోడల్ సహాయంతో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలోని ఏ నగరానికైనా అందించగలదు.

ఈ పద్ధతినే భవిష్యత్ లో చాలా కంపెనీలు అనుసరించే అవకాశం ఉంటుంది. ఈ విధానం అనుసరించినట్లైతే డీలర్ షిప్ సంప్రదించాల్సిన అవసరం ఉండదు. కావున ఈ ప్రక్రియ తయారీదారు మరియు కొనుగోలుదారుల మధ్య మాత్రమే జరుగుతుంది.


Click it and Unblock the Notifications








