ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ప్రత్యర్థిగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్; ఆగష్టు 15 న విడుదల
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన శకం మొదలైపోయింది. ఇందులో భాగంగానే చాలా కంపెనీలు ఎక్కువ సంఖ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. వాహన వినియోగదారులు కూడా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం అమాంతం పెరిగిన ఇంధన ధరలు.

పెరుగుతున్న ఇంధన ధరలు మాత్రమే కాకుండా, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడానికి అనేక రాయితీలను కల్పిస్తున్నారు. అయితే ఈ నెల ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు చాలా అద్భుతంగా ఉండనుంది. ఎందుకంటే రెండు భారతీయ వాహన తయారీదారులు ఈ నెలలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయబోతున్నాయి.

ఇందులో ఒకటి ఓలా ఎలక్ట్రిక్ కాగా, రెండవది సింపుల్ ఎనర్జీ. సింపుల్ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ నెలలో భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఓలా ఎలక్ట్రిక్ మరియు సింపుల్ ఎనర్జీ కంపెనీలు రెండూ కూడా భారత స్వాతంత్య దినోత్సవం రోజున విడుదల చేయనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల గురించి మునుపటి కథనాల్లో తెలుసుకున్నాము. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పుడు సింపుల్ ఎనర్జీ విషయానికి వస్తే, బెంగుళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను ఆగస్టు 15 న దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆన్‌లైన్ బుకింగ్ కూడా ప్రారంభించింది. ఈ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు.

సింపుల్ ఎనర్జీ తన ఉత్పత్తి కర్మాగారాన్ని తమిళనాడులోని హోసూర్ జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్లాంట్ 2 లక్షల చదరపు అడుగులలో నిర్మించబడుతుందని కంపెనీ ఇదివరకే ప్రకటించింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ కర్మాగారంలో ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది.

సింపుల్ ఎనర్జీ నిర్మిస్తున్న ఈ ప్లాంట్ నుండి ఏడాదిలో 10 లక్షల స్కూటర్లను పంపించనున్నట్లు తెలిసింది. ఈ ప్లాంట్‌లో సుమారు 1,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కంపెనీ దీని కోసం దాదాపు రూ. 350 కోట్లు ఖర్చు చేయబోతోంది.

సింపుల్ ఎనర్జీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌లో కంపెనీ 4.8 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తోంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 240 కిమీ రేంజ్ ఇస్తుందని నివేదికల ద్వారా తెలిసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతమవుతుంది. ఇది హై స్పీడ్ స్కూటర్, కావున దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది.

ఈ స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇవ్వవచ్చు. కావున ఈ బ్యాటరీని స్కూటర్ నుంచి తీసి సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్, జిపిఎస్ నావిగేషన్, డిజిటల్ టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.10 లక్షల నుండి రూ. 1.20 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం గత ఏప్రిల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు, 1000 మందికి పైగా దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లు తెలిసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభంలో దేశంలోని 4 నగరాల్లో డీలర్‌షిప్‌లు మరియు సర్వీస్ సెంటర్లు ప్రారంభించే అవకాశం ఉంటుంది. దేశీయ మార్కెట్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఏథర్ 450ఎక్స్ మరియు త్వరలో రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








