చెప్పినట్టుగానే రూ. 79,999 వద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ - పూర్తి వివరాలు
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తూ అత్యధిక ప్రజాదరణ పొందుతోంది. కంపెనీ గత కొన్నిరోజుల కిందట దీపావళి పండుగను పురస్కరించుకుని కస్టమర్ల కోసం ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. చెప్పిన విధంగానే ఈ రోజు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు దేశీయ విఫణిలో తన ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎస్1 ఎయిర్' (S1 Air) విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ. 79,999 మాత్రమే. కంపెనీ ఈ ధర వద్ద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2022 అక్టోబర్ 24 వరకు మాత్రమే అందిస్తుంది. అంటే కేవలం రెండు రోజులు మాత్రమే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 79,999 కి అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఈ స్కూటర్ ధర రూ. 84,999 అవుతుంది.

ఓలా 'ఎస్1 ఎయిర్' (S1 Air) ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకంటే తక్కువ ఫీచర్స్ మరియు తక్కువ రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. కావున ఇందులో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఓలా 'ఎస్1 ఎయిర్' (S1 Air) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జ్ తో 'ఎకో మోడ్' లో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే 'ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ తో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది. ఈ S1 ఎయిర్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉండటమే కాకుండా రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

ఓలా ఎస్1 ఎయిర్ బరువు కేవలం 99 కేజీల వరకు ఉంటుంది, కావున ఇది దాని 'ఎస్1 ప్రో' (125కేజీలు) కంటే కూడా తేలికగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులోని సీటు రీడిజైన్ చేయబడింది. కావున ఇది సింగిల్-పీస్ ట్యూబ్యులర్ గ్రాబ్ హ్యాండిల్ కలిగి ఉంటుంది. కాగా ఇందలో 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అయితే ఇది ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌ను పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే.. అదే 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అదే సమయంలో ఇందులోని ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ తో పాటు రివర్సింగ్ ఫంక్షనాలిటీని కూడా పొందుతుంది.

ఓలా ఎస్1 ఎయిర్ కేవలం 5 కలర్ ఆప్సన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి కోరల్ గ్లామ్, నియో మింట్, పోర్సలీన్ వైట్, జెట్ బ్లాక్ మరియు లిక్విడ్ సిల్వర్ కలర్. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్1 మరియు ఎస్1 ప్రో మొత్తం 10 కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

కొత్త ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ MoveOS 3.0 సాఫ్ట్‌వేర్‌ను కూడా స్టాండర్డ్‌గా పొందుతుంది. ఇది హిల్-హోల్డ్ ఫంక్షనాలిటీ వంటి ఆధునిక ఫంక్షన్స్ నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కావున ఇది అన్ని విధాలుగా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్, ఒకినావా మరియు ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








