ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్ల కోసం MoveOS2 రెడీ.. ఇప్పుడు కొత్త యాప్ లాక్ ఫీచర్ మరియు ఎకో-మోడ్‌తో..
భారతదేశంలో అతివేగంగా అభివృద్ధి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొన్ని కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఓలా ఎస్1 (Ola S1) మరియు ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్లు త్వరలో యాప్‌లాక్ ఫీచర్ (App Lock) మరియు కొత్త ఎకో మోడ్ (Eco Mode)తో అప్‌డేట్ చేయబడతాయని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఈ కొత్త అప్‌డేట్స్ OTA (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్ ద్వారా విడుదల చేయబడుతాయి.

ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో MoveOS అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. కంపెనీ ఇప్పుడు ఇందులో MoveOS 2 అనే కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను డెవలప్ చేసింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మునుపటి కన్నా మరిన్ని ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే, ఇది మునుపటి కన్నా చాలా సమర్థవంతంగా ఉండబోతోంది. కంపెనీ ఇందులో కొత్తగా పరిచయం చేసిన ఎకో మోడ్ సాయంతో స్కూటర్ గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, సుమారు 170 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

మూవ్ ఓఎస్ 2 అప్‌డేట్‌లో భాగంగా, కంపెనీ ఇందులో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా జోడించవచ్చని సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్‌వేర్ OTA అప్‌డేట్ పొందిన తర్వాత ఇందులో ఆటోమేటిక్ గా కొత్త యాప్ లాక్ ఫీచర్ (App Lock) ఇన్‌స్టాల్ చేయబడుతుంది. దీని సాయంతో యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ సాయంతోనే తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం మరియు సీటును అన్‌లాక్ చేయడం చేయవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ (యాప్)లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. స్కూటర్ ఉపయోగంలో లేనప్పుడు లేదా దానిని ఎక్కడైనా పార్క్ చేసి లాక్ చేయడం మర్చిపోయినప్పుడు తమ ఫోన్‌లోని ఈ అప్లికేషన్ సహాయంతో స్కూటర్‌ను ఎక్కడి నుండైనా రిమోట్ గా లాక్ చేయవచ్చు లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఇక ఇందులో చేయబోయే రెండవ అప్‌డేట్ కొత్త ఎకో మోడ్ (New Eco Mode). ఈ కొత్త ఎడో మోడ్ సిటీ రైడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుందని, ఇది స్కూటర్ పనితీరును కూడా పెంచుతుందని భవీష్ అగర్వాల్ తన ట్వీట్‌లో తెలిపారు.

భవిష్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఎకో మోడ్‌లో, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు. అదే సమయంలో, ఈ మోడ్‌లోస్కూటర్ పరిధి (రేంజ్) 170 కిమీ వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశంలో రెండు మోడళ్లను విక్రయిస్తోంది. ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను గతేడాది ఆగస్టు 15న భారతదేశంలో విడుదల చేయబడ్డాయి. మార్కెట్లో ఈ స్కూటర్ల ధరలు సమారురూ. 1 లక్ష మరియు రూ. 1.30 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉంటాయి.

భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు నేరుగా ఎలాంటి డీలర్‌షిప్‌లు కానీ లేదా అనుభవం కేంద్రాలు (ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు) కానీ లేవు. ఆసక్తిగల కస్టమర్లు నేరుగా వీటిని ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ నుండి కానీ లేదా ఓలా యాప్ నుండి కానీ కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ నుండి రిజిస్ట్రేషన్ వరకూ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కస్టమర్లు పేర్కొన్న చిరునామాకి డెలివరీ చేయబడుతాయి. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల సర్వీస్ కోసం కంపెనీ సర్వీస్ ఆన్ ది వీల్స్ మాదిరిగా కస్టమర్ల వద్దకే సర్వీస్ సేవలు అందించేందుకు కూడా ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతం, భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ దేశంలోనే అత్యధికంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న కంపెనీగా అవతరించింది. గత నెలలో, ఓలా ఎలక్ట్రిక్ 9,127 యూనిట్ల స్కూటర్లను విక్రయించగా, హీరో ఎలక్ట్రిక్ అదే నెలలో 13,023 యూనిట్లను విక్రయించింది.

ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండు మోడళ్లలో 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. అయితే, వీటి బ్యాటరీ సామర్థ్యం మాత్రం వేర్వేరుగా ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌లను తొలగించడానికి వీలు ఉండదు. తప్పనిసరిగా స్కూటర్‌కు చార్జర్‌ను కనెక్ట్ చేయటం ద్వారానే వీటిని చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఓలా ఎస్1లో బ్యాటరీ సామర్థ్యం 2.98 కిలో వాట్ అవర్‌గా ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 121 కిమీ సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్టం వేగం గంటకు 90 కిమీగా ఉంటుంది.

ఓలా ఎస్ 1 ప్రో విషయానికి వస్తే, ఇందులో 3.97 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 181 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిమీగా ఉంటుంది. ఛార్జింగ్ సమయం విషయానికి వస్తే ఫాస్ట్ చార్జర్ సాయంతో దీనిని కేవలం 18 నిమిషాల్లో 75 కిమీ దూరం నడపడానికి సరిపడా చార్జ్ చేసుకోవచ్చు. ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా 750 వాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో వస్తాయి. దీని సాయంతో స్కూటర్‌ను పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది.


Click it and Unblock the Notifications








