కలిసొచ్చిన దసరా & దీపావళి.. దంచి కొట్టిన 2022 అక్టోబర్ Ola Electric సేల్స్: వివరాలు
భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసి మంచి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కంపెనీ గత నెల (2022 అక్టోబర్) అమ్మకాల గణాంకాల నివేదికలను అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఓలా ఎలక్ట్రిక్ విడుదల చేసిన నివేదికల ప్రకారం, 2022 అక్టోబర్ నెలలో ఏకంగా 20,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు తెలిసింది. ఇది అంతకు ముందు నెల అమ్మకాల కంటే కూడా 60 శాతం ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే గత నెలలో కంపెనీ అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

కంపెనీ అమ్మకాలను గురించి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ 'భవిష్ అగర్వాల్' మాట్లాడుతూ.. ఇప్పటివరకు కంపెనీ విక్రయించిన అమ్మకాలలో ఇదే అత్యధికం అని తెలిపారు. కంపెనీ అంతకు ముందుకంటే కూడా అమ్మకాల్లో మంచి పురోగతిని కనపరిచిందని కూడా అన్నారు.

విజయదశమి మరియు దీపావళి పండుగల సందర్భంగా ఎక్కువమంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్ గా భావిస్తారు. ఈ కారణంగానే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఒకే నెలలో రెండు పండుగలు రావడం కూడా వెహికల్ అమ్మకాల పెరుగుదలకు ఒక కారణం అని చెప్పవచ్చు.

పండుగల సీజన్‌లో ఓలా ఎలక్ట్రిక్‌కు మంచి డిమాండ్ ఏర్పడటం మాత్రమే కాకుండా.. కంపెనీ దీనికి తగినట్లు డెలివరీలను కూడా వేగవంతం చేసింది. కంపెనీ డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి ప్రతి రోజు 1,000 యూనిట్ల స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. మొత్తం మీద కంపెనీ గత నెలలో మంచి అమ్మకాలను పొందగలిగింది.

ఇదిలా ఉండగా.. కంపెనీ ఇటీవలే ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. అయితే విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర దేశీయ మార్కెట్లో రూ. 84,999. ఇది దాని మునుపటి మోడల్స్ అయిన ఎస్1 మరియు ఎస్1 ప్రో కంటే కూడా తక్కువ ఫీచర్స్ పొందుతాయి.

ఓలా 'ఎస్1 ఎయిర్' (S1 Air) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే 'ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ తో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది. ఈ S1 ఎయిర్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉండటమే కాకుండా రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇందులో 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అయితే ఇది ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌ను పొందుతుంది.

ఓలా ఎస్1 ఎయిర్ బరువు కేవలం 99 కేజీల వరకు ఉంటుంది, కావున ఇది దాని 'ఎస్1 ప్రో' (125కేజీలు) కంటే కూడా తేలికగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులోని సీటు రీడిజైన్ చేయబడింది. కావున ఇది సింగిల్-పీస్ ట్యూబ్యులర్ గ్రాబ్ హ్యాండిల్ కలిగి ఉంటుంది. ఓలా ఎస్1 ఎయిర్ కేవలం 5 కలర్ ఆప్సన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి కోరల్ గ్లామ్, నియో మింట్, పోర్సలీన్ వైట్, జెట్ బ్లాక్ మరియు లిక్విడ్ సిల్వర్ కలర్.

ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్, ఒకినావా మరియు ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
2022 అక్టోబర్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇందులో ఓలా ఎలక్ట్రిక్ యొక్క అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మొత్తం 68,324 యూనిట్లు కాగా, ఇందులో 20,000 యూనిట్లు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఇది కంపెనీ సాధించిన విజయం అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతోపాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








