ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం జూన్ 18న మూవ్ ఓఎస్2 విడుదల.. ఇప్పుడు అందరూ ఎక్కువ రేంజ్ పొందవచ్చు!
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగదారుల కోసం మరిన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసేందుకు సిద్దమైంది. ఓలా ఎస్1 (Ola S1) మరియు ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించే కస్టమర్లు త్వరలోనే మూవ్ ఓఎస్2 (Move OS2) ఆపరేటింగ్ సిస్టమ్ ను ఓటిఓ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్ ద్వారా పొందనున్నారు. మూవ్ ఓస్2 ఇప్పటికే బీటా దశలో ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. కాగా, ఇప్పుడు ఇది జూన్ 18వ తేదీ నుండి ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులకు మూవ్ ఓఎస్2 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలియజేశారు. ఆగస్టు 2021లో ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లను ప్రవేశపెట్టిన తర్వాత వస్తున్న ఇది మొదటి ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇది. ఈ అప్‌డేట్ ద్వారా కస్టమర్‌లు అనేక కొత్త ఫీచర్‌లను పొందబోతున్నారు. ఈ ఫీచర్లలో కొత్త యాప్‌లాక్ ఫీచర్ (App Lock) మరియు కొత్త ఎకో మోడ్ (Eco Mode) ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ OTA (ఓవర్ ది ఎయిర్) ద్వారా విడుదల చేయబడుతుంది. అంటే, యూజర్లు తమ స్కూటర్ ను నేరుగా వైఫై కి కానీ లేదా ఫోన్ ద్వారా వైఫై హాట్‌స్పాట్ కి కానీ కనెక్ట్ అయి ఈ సాఫ్ట్‌వేర్ ను అప్‌డేట్ చేసుకోవచ్చు. కొత్త ఓఎస్ కి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అప్‌డేట్ కాగానే, కస్టమర్లు ఇందులోని కొత్త ఫీచర్లను యాక్సెస్ చేసుకోగలరు. ఈ ఓటిఏ అప్‌డేట్ సాధారణంగా మన స్మార్ట్ ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మాదిరిగానే చాలా సింపుల్ గా ఉంటుంది.

ఈ ఏడాది కాలంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో వివిధ కస్టమర్ల నుండి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త మూవ్ ఓఎస్2 ని మునుపటి కన్నా మరింత మెరుగ్గా ఉండేలా డిజైన్ చేసింది. ప్రస్తుతం ఉన్న స్కూటర్లలో ఇంకా ఇవ్వని ఫీచర్లను కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా యాక్టివేట్ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ ఫీచర్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు హైపర్ మోడ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో MoveOS అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో MoveOS 2 అనే కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను డెవలప్ చేసింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మునుపటి కన్నా మరిన్ని ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే, ఇది మునుపటి కన్నా చాలా సమర్థవంతంగా ఉండబోతోంది. కంపెనీ ఇందులో కొత్తగా పరిచయం చేసిన ఎకో మోడ్ సాయంతో స్కూటర్ గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, సుమారు 170 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

అయితే, బీటా దశలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సాఫ్ట్‌వేర్ ను మూవ్ ఓఎస్2 కి అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత కస్టమర్లు ఇప్పుడు ఓలా ఎస్1 ప్రో స్కూటర్ తో పూర్తి చార్జ్ పై గరిష్టంగా 200 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఓలా ఎలక్ట్రిక్ కూడా ఓ ఛాలెంజ్ చేసింది. ఇలా సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత ఎవరైతే పూర్తి ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్ల రేంజ్ ను కవర్ చేస్తారో, అలాంటి మొదటి 10 మంది కస్టమర్‌లకు ఉచితంగా 'గెరువా' కలర్ ఓలా స్కూటర్‌లను బహుమతిగా ఇవ్వనున్నట్లు భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు తమ స్కూటర్లను మూవ్ ఓఎస్ 2 కి అప్‌డేట్ చేసుకున్న తర్వాత తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందనున్నారు. అలాగే, ఇందులో ఆటోమేటిక్ గా ఓ కొత్త యాప్ లాక్ ఫీచర్ (App Lock) కూడా ఇన్‌స్టాల్ చేయబడుతుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం మరియు సీటును అన్‌లాక్ చేయడం చేయవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ (యాప్)లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. స్కూటర్ ఉపయోగంలో లేనప్పుడు లేదా దానిని ఎక్కడైనా పార్క్ చేసి లాక్ చేయడం మర్చిపోయినప్పుడు తమ ఫోన్‌లోని ఈ అప్లికేషన్ సహాయంతో స్కూటర్ యజమానులు ఎక్కడి నుండైనా సరే రిమోట్ గా తమ స్కూటర్ ని లాక్ చేయవచ్చు లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఇకపోతే, కొత్త ఎకో మోడ్ సాయంతో పనితీరు విషయంలో ఎక్కడా రాజీ పడకుండానే మెరుగైన రేంజ్ ను పొందవచ్చని కంపెనీ చెబుతోంది.

రూ.10,000 పెరిగిన ధరలు
ఇదిలా ఉంటే, ఓలా ఎలక్ట్రిక్ తమ ప్రీమియం వేరియంట్ అయిన ఎస్1 ప్రో ధరను రూ. 10,000 మేర పెంచింది. ధరల పెంపు అనంతరం ఇప్పుడు దాని ధర రూ. 1.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కాగా, ఈ ధర పెంపుపై కంపెనీ వ్యాఖ్యానించలేదు. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గత ఏడాది ఆగస్టు 15న మార్కెట్లో విడుదల చేసినప్పుడు దాని ప్రారంభ ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది. కాగా, ఇప్పుడు తొలిసారిగా కంపెనీ ఈ స్కూటర్ ధరలను పెంచింది.


Click it and Unblock the Notifications








