తక్కువ సమయంలోనే అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు డోకా లేనట్టే?
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'ఓలా' (Ola) తన మొదటి ఉత్పత్తిని 2021 ఆగష్టు 15 న మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతూ ఇప్పటికి కూడా ముందుకు సాగుతోంది. కాగా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిలో ఇప్పటికి ఒక గొప్ప మైలురాయిని సాధించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ యొక్క S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు 1,00,000 ఉత్పత్తి మైలురాయిని దాటింది. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ స్వయంగా వెల్లడించారు. ఈ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఒక లక్ష యూనిట్ తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓలా యొక్క ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడింది.

ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది జూలైలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు స్వీకరించడం ప్రారభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే ఏకంగా ఒక లక్షకు పైగా బుకింగ్స్ వచ్చాయి. కాగా ఈ గొప్ప రికార్డ్ సాధించడానికి 10 నెలల సమయం పట్టింది. సప్లయ్ చైన్ అంతరాయాలు మరియు కరోనా వైరస్ ప్రభావంవల్ల ఇది కొంత ఆలస్యం అయింది, లేకుంటే ఈ రికార్డ్ ఇప్పటికే సాధించి ఉండవచ్చని కూడా తెలిపారు.

ఉత్పత్తి కొంత ఆలస్యం కావడం వల్ల వెయిటింగ్ పీరియడ్ కూడా కొంత పోడిగించాల్సి వచ్చింది. దీనివల్ల డెలివరీలు కూడా ఆలస్యం అయ్యాయి. కాగా ఇప్పుడు డెలివరీలో ఎటువంటి ఆలస్యం జరిగే అవకాశం లేదు. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటలను ఉత్పత్తి చేయడానికి కావాల్సిన సౌకర్యాలను కలిగి ఉంది. కాగా 2024 నాటికి ఓలా ఎలక్ట్రిక్ కారు కూడా రానుంది. దీనిని కూడా కంపెనీ యొక్క ప్లాంట్ లో ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు జరిపే అవకాశాలు ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో తన ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ. 99,999 వద్ద, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ. 1,39,999 వద్ద విక్రయిస్తోంది. ఈ రెండు స్కూటర్లు మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. ఇవి 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల రూ. 84,999 వద్ద 'ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు రూ. 999 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది.

'ఓలా ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారును పొందుతుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 'ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ 500W పోర్టబుల్ హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది.

ఓలా S1 ఎయిర్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉండటమే కాకుండా రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు కేవలం 99 కేజీల వరకు ఉంటుంది, కావున ఇది దాని 'ఎస్1 ప్రో' (125కేజీలు) కంటే కూడా తేలికగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులోని సీటు రీడిజైన్ చేయబడింది. కావున ఇది సింగిల్-పీస్ ట్యూబ్యులర్ గ్రాబ్ హ్యాండిల్ కలిగి ఉంటుంది. కాగా ఇందులో 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ కేవలం ఉత్పత్తి పరంగా మాత్రమే కాకుండా.. అమ్మకాల పరంగా కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇందులో భాగంగానే 2022 అక్టోబర్ నెలలో 20,000 యూనిట్లను విక్రయించింది. ఈ విక్రయాలు గత నెల కంటే కూడా దాదాపు 60 శాతం ఎక్కువ అని తెలుస్తోంది.

కంపెనీ అమ్మకాలను గురించి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ 'భవిష్ అగర్వాల్' మాట్లాడుతూ.. ఇప్పటివరకు కంపెనీ విక్రయించిన అమ్మకాలలో ఇదే అత్యధికం అని తెలిపారు. కంపెనీ అంతకు ముందుకంటే కూడా అమ్మకాల్లో మంచి పురోగతిని కనపరిచిందని కూడా అన్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఓలా కంపెనీ దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లో విడుదల చేయకముందు నుంచే గొప్ప అంచనాలతో ముందుకు రాగలిగింది. అయితే బ్యాటరీలో ఏర్పడిన సమస్యల వల్ల మరియు ఇతరత్రా కారణాల వల్ల కొన్ని రోజుల ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడానికి కస్టమర్లు కొంత వెనుకాడరు, అయితే దీనిపైన కంపెనీ తగిన చర్యలను తీసుకుంటోంది. ఈ కారణంగానే గత నెల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








