సింపుల్ వన్ (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ, మోటార్ అప్‌గ్రేడ్: ఫుల్ చార్జ్‌పై 300 కిమీ రేంజ్!
బెంగళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) తమ మొదటి మోడల్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Simple One Electric Scooter)ను మరింత శక్తివంతమైన మోటారుతో అప్‌గ్రేడ్ చేసింది. ఈ అప్‌గ్రేడ్ ద్వారా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మునుపటి కన్నా మెరుగైన పనితీరు, థర్మల్ మేనేజ్‌మెంట్ మరియు సామర్థ్యాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఈ విభాగంలో అత్యధికంగా 72 Nm గరిష్ట టార్క్‌తో కొత్త మోటార్ ఇ-స్కూటర్‌ను అందించనున్నట్లు ప్రకటించింది.

సింపుల్ ఎనర్జీ గతేడాది తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'సింపుల్ వన్' ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభిస్తామని కంపెనీ ఇదివరక పేర్కొంది. అయితే, ఇప్పుడు కంపెనీ ఇప్పుడు దాని కన్నా ముందుగా కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మోటార్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ మోడల్‌కు సంబంధించిన డెలివరీలు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, ఓలా ఎలక్ట్రిక్ వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుంది.

పూర్తి చార్జ్ పై 300 కిలోమీటర్లకు పైగా రేంజ్
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉపయోగించిన అప్‌గ్రేడెడ్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8.5 kW శక్తిని మరియు 72 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సరికొత్త సింపుల్ వన్ మోటార్ 96 శాతం సామర్థ్యాన్ని అందజేస్తుందని నివేదించబడింది. ఎకో మోడ్‌లో ఛార్జ్ చేసినప్పుడు ఇందులోని బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 236 కిమీ (వాస్తవ ప్రపంచంలో 203 కిమీ) రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ తాజాగా ప్రకటించిన పెద్ద 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ సాయంతో దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 300 కంటే ఎక్కువ కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

సింపుల్ వన్ ధరలు
సింగిల్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.09 లక్షలు కాగా, రెండు బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. సింగిల్ బ్యాటరీ ఆప్షన్ మాదిరిగానే, డబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా పూర్తిగా తొలగించదగినది. అంటే, వీటిని స్కూటర్ నుండి విడిగా తీసి చార్జ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఇందులోని 2 బ్యాటరీలు మొత్తంగా 6.4 kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కొత్త బ్యాటరీ ఆప్షన్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్ ఛార్జ్ అందించే రేంజ్‌లో లీడర్‌గా చేస్తుందని కంపెనీ పేర్కొంది.

అప్‌గ్రేడ్ చేయబడిన ఎలక్ట్రిక్ మోటార్ కారణంగా, ఈ స్కూటర్ గతంలోని 2.95 సెకన్ల టైమ్ ఫ్రేమ్ నుండి ప్రస్తుతం కేవలం 2.85 సెకన్లలోనే గంటకు 0-40 km / h వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ సందర్భంగా సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, "మేము సింపుల్ వన్‌ను ఊహించినప్పుడు, వినియోగదారులకు రేంజ్ లేదా ఛార్జింగ్ గురించి ఆందోళన చెందకుండా తగిన రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం" అని అన్నారు.

ఇందులో భాగంగానే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అదనపు బ్యాటరీని అందించడం వల్ల భారతదేశంలోని ఏ ఇతర ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం చేరలేని గమ్యస్థానాలకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు చేరుకోవచ్చని ఆయన చెప్పారు. పూర్తి చార్జ్ పై 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ను అందించే ఈ అదనపు బ్యాటరీ స్కూటర్ బూట్‌లో సులభంగా సరిపోతుందని, ఇదొక పెద్ద మైలురాయి అని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ విషయంలో కస్టమర్లలో అవగాహనను మరింత బలోపేతం చేయడంలో కూడా ఈ చర్య చాలా దోహదపడుతుందని ఆయన అన్నారు.

జూన్ 2022లో సింపుల్ వన్ డెలివరీలు ప్రారంభం
సింపుల్ వన్ ఇ-స్కూటర్ డెలివరీలు జూన్ 2022లో ప్రారంభం కానున్నట్లు సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగస్టు 15, 2021వ తేదీన దేశంలో అధికారికంగా ప్రారంభించబడింది. ఇప్పటి వరకూ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 30,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్క్2 ప్రోటోటైప్‌పై ఆధారపడి ఉంటుంది మరియు ఫ్యూచర్ డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆన్‌బోర్డ్ నావిగేషన్ మరియు బ్లూటూత్ మరియు 4G కనెక్టివిటీతో టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. సంగీతం మరియు ఫోన్ కాల్స్ ను యాక్సెస్ చేసుకునేందుకు గానూ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కూటర్ కు రిమోట్ గా కనెక్ట్ అయ్యే సదుపాయం కూడా ఉంటుంది. ఈ స్కూటర్ ముందు మరియు వెనుక భాగంలో పూర్తి ఎల్ఈడి లైటింగ్, సీటు కింద 30 లీటర్ల బూట్ స్పేస్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ 4 ఆకర్షణీయమైన రంగులలో విక్రయిస్తోంది. వీటిలో బ్రాసెన్ బ్లాక్, నమ్మ రెడ్, గ్రేస్ వైట్ మరియు అజూర్ బ్లూ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం బరువు కేవలం 110 కిలోలు మాత్రమే. ఇంకా ఇందులో 12 ఇంచ్ వీల్స్, బ్రేకింగ్ కోసం ముందు మరియు వెనుక వైపున వరుసగా 200 mm డిస్క్ మరియు 180 mm డిస్క్ బ్రేకులు, సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపు మోనోషాక్ సెటప్ ఉంటాయి. సింపుల్ ఎనర్జీ సింపుల్ వన్ కాంబి-బ్రేక్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








