Ola Electric ఆగస్టు 15న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనున్న ఓలా..!!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. అందులో భాగంగా చాలా కంపెనీలు కొత్త కొత్త వాహనాలను ప్రవేశ పెడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఓలా ఎలక్ట్రిక్ దూసుకుపోతుంది. ఆకర్షణీయమైన ఫీచర్లు, రేంజ్‌లో వాహనాలను తీసుకువచ్చి సేల్స్‌ను పెంచుకుంటోంది.
భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో ఓలా తొలి స్థానంలో కొనసాగుతోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన ఎస్ 1 సిరీస్ స్కూటర్లు అమ్మకాల్లో సత్తా చాటుతున్నాయి. ఈ విభాగంలో ఓలా కొత్త వేవ్ సృష్టిస్తోంది. ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్‌ని ఏర్పాటు చేయడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువకానుంది. అయితే ఈ సంస్థ నుంచి సరికొత్త అప్‌డేట్ రానుంది.

వచ్చే నెలలో సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను విడుదల చేయడం ద్వారా దేశంలో పెద్ద విప్లవానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాజాగా ఆయన షేర్ చేసిన మోటార్ సైకిళ్ల చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. టెస్ట్ ట్రాక్ పై ఇతర కంపెనీ మోటార్ సైకిళ్లను పరీక్షిస్తున్న ఫొటోలను ఆయన శనివారం షేర్ చేశారు.
కొన్ని కంపెనీలు పాత వెస్ట్రన్ ఐసీఈ (ఇంధనంతో నడిచే) మోటారు సైకిళ్లను భారత్లో తయారు చేయడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నాయో అర్థం కావడం లేదని ట్విట్టర్‌లో ఆయన రాసుకొచ్చారు. 'మేకిన్ ఇండియా' కాన్సెప్ట్ కింద యావత్ ప్రపంచం కోసం, ముఖ్యంగా భవిష్యత్ మోటార్ సైకిళ్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ మోటార్ సైకిళ్లు ఎలా ఉంటాయనే దానిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఓలా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న వార్షిక లాంచ్ డేను నిర్వహిస్తుంది. అదే రోజు కొత్త మోటార్ సైకిళ్లను విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్కూటర్‌ను విడుదల చేసింది.
ఓలా విడుదల చేయబోవు స్కూటర్‌కి సంబంధించి ప్రస్తుతానికి కచ్చితమైన సమాచారం లేదు. అయితే కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని ఓ టర్మాక్ పై ఎస్ 1 ఎయిర్ ను పరీక్షిస్తున్న వీడియోను కంపెనీ షేర్ చేసింది. దీంతో త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉందనే సందేశాన్ని కంపెనీ ఇచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.
జూలై నెలలో ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో రెండు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఆ రంగుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. అయితే నియాన్ ఆకుపచ్చ, నీలం రంగుల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
భారత మార్కెట్లో ఓలా అత్యధిక వాటాను కలిగి ఉంది మరియు అమ్మకాలలో రోజు రోజుకు పెరుగుతోంది. కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్న ఓలా సంస్థ టీజర్ ను ఫిబ్రవరి 5న విడుదల చేసింది. ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేయడం నిజమైతే అది పెద్ద విప్లవానికి దారితీయనుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో ఓలా విక్రయించిన ఎస్ 1 ఎయిర్ ధర రూ.1.10 లక్షలు, ఎస్ 1 ధర రూ.1.30 లక్షలు, ఎస్ 1 ప్రో ధర రూ.1.40 లక్షలుగా ఉంది. వేరియంట్లను బట్టి ఇవి వేర్వేరుగా ఉంటాయి. నెలకు 20,000 యూనిట్ల స్కూటర్లను విక్రయిస్తూ అతి తక్కువ కాలంలోనే ఓలా దేశంలో భారీ విజయాన్ని సాధించింది.


Click it and Unblock the Notifications








