రెంటల్ సర్వీస్ సెగ్మెంట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్.. బెస్ట్ ఐడియా ఇచ్చిన వారికి Ola S1X ప్లస్ ఇ స్కూటర్ గిఫ్ట్
ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్ కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయంలో ఓలాదే పై చేయి అనడంలో సందేహం లేదు. తక్కువ ధర, నాణ్యమైన పనితీరుతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. క్యాబ్ సర్వీస్ నుంచి ఈవీల తయారీ దాకా వేగవంతమైన వృద్ధిని సాధించింది. అయితే ఓలా ఇప్పుడు మరో వినూత్న ప్రయత్నం చేపట్టే యోచనలో ఉంది.
దేశీయ మార్కెట్లో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తోంది. ఈ బ్రాండ్‌కు చెందిన S1 సిరీస్ స్కూటర్‌లను అద్దెకు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని Ola ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ X(గతంలో ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు.

కస్టమర్లకు ద్విచక్ర వాహనాల అద్దె సేవను ప్రారంభించడం గురించి భవిష్ అగర్వాల్(Ola Scooters Rental Service) ఆసక్తికర సమాచారం వెల్లడించారు. దాని సాధ్యాసాధ్యాల గురించి పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఓలా S1 సిరీస్ స్కూటర్లు గోవా వంటి పర్యాటక నగరాల్లో అద్దెకు అందుబాటులో సంస్థ ప్రవేశపెట్టింది.
అయితే ఇందుకు సంబంధించి సలహా ఇవ్వాలని X ద్వారా నెటిజన్లను భవిష్ అగర్వాల్ కోరారు. భారత్‌లోని ఏ నగరాల్లో ఇటువంటి సర్వీసులను ప్రారంభించవచ్చో ఐడియాలు ఇవ్వాలని వెల్లడించారు. అయితే ఉత్తమ సలహా ఇచ్చిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు ఓలా సీఈవో. వారికి ఓలా S1X + ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇస్తామని X లో పేర్కొన్నారు.

ఓలా యోచిస్తున్న ఈ ఐడియా.. ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, అద్దె సర్వీస్ వెంచర్ సాధారణంగా పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ అద్దె వ్యాపారంలోకి అధికారికంగా ప్రవేశించినట్లు తెలిపింది. రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్స్ అటువంటి వెంచర్‌ను ప్రారంభించిన భారతదేశంలో మొదటి ద్విచక్ర వాహన తయారీదారుగా కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ నిలిచింది.
కాగా చెన్నైకి చెందిన మోటార్‌సైకిల్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలోని 25 నగరాల్లో 40 కంటే ఎక్కువ బైక్ రెంటల్ ఆపరేటర్ల ద్వారా అద్దె కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 300కు పైగా మోటార్‌సైకిళ్లను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇదే స్ఫూర్తితో ఓలా కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోంది.

భారత్‌లో గోవా, పాండిచ్చేరి మరియు మనాలి వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ద్విచక్రవాహన రెంటల్ సర్వీస్ ప్రజాదరణ పొందుతోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువ మందికి చేరువ అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా ఓలా ఎలక్ట్రిక్ తన మోడళ్లను సరసమైన ధరలకు ప్రజలకు అందించడంలో ఉపయోగపడే అవకాశం ఉంది.
అంతే కాకుండా ఓలా ఎలక్ట్రిక్ ఓలా క్యాబ్ సర్వీస్‌లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రెంటల్ సర్వీసులను అనుసంధానించవచ్చు. ఇ-స్కూటర్‌లను అద్దెకు తీసుకోవడం వలన పర్యాటకులు ఎక్కువ పర్యాటక ప్రదేశాలను చుట్టేయొచ్చు. రెంటల్ సర్వీస్ ద్వారా కొన్ని గంటలు లేదా రోజుల పాటు అపరిమిత ప్రయాణాన్ని చేయవచ్చు.
కాగా ప్రస్తుతం ఓలా తీసుకున్న నిర్ణయాలన్నీ మార్కెట్‌లో విజయవంతమవుతున్నాయి. 2023 క్యాలెండర్ సంవత్సరంలో దేశంలో2.50 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఓలా ఎలక్ట్రిక్ ఘనత సాధించింది. జనవరి 1, 2023 నుండి డిసెంబర్ 21, 2023 వరకు, Ola.. 2,52,647 ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది.


Click it and Unblock the Notifications








