24 ఏళ్లలో 3.50 కోట్ల అమ్మకాలు..ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న హోండా కంపెనీ లోగో మారింది చూశారా
భారతదేశంలో హోండా టూ వీలర్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి నెలా అమ్మకాల విషయంలో మార్కెట్లో అగ్రస్థానంలో నిలబడుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు, కొత్త డిజైన్‌లను అందించడంలో హోండా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా బ్రాండ్ తమ గుర్తింపును మరింత బలోపేతం చేసుకునేందుకు లోగోలో కీలక మార్పులు చేసింది.
ఇకపై ఫ్లాగ్‌షిప్ మోడల్స్, సాధారణ పెట్రోల్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లకు వేర్వేరుగా మూడు కొత్త లోగోలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా, ఫన్ కేటగిరీలో హోండా తీసుకువచ్చిన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ హోండా WN7 గురించి, అలాగే దేశంలో రికార్డు సృష్టించిన యాక్టివా (Activa) స్కూటర్ అమ్మకాల వివరాల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.

హోండా ఫన్ కేటగిరీలో మొట్టమొదటి ఫిక్స్‌డ్-బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అయిన హోండా WN7లో ఈ కొత్త లోగోను పరిచయం చేశారు. అద్భుతమైన పర్ఫామెన్స్, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్ కోరుకునే రైడర్‌ల కోసం హోండా WN7ను రూపొందించారు. మొదటి ఎలక్ట్రిక్ నేకెడ్ మోటార్‌సైకిల్ అయిన హోండా WN7తో హోండా యూరోపియన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్‌లోకి ప్రవేశించింది.
2040 నాటికి హోండా తమ మోటార్‌సైకిళ్లన్నింటినీ కార్బన్-న్యూట్రల్‌గా మార్చాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. డిజైన్ విషయానికి వస్తే, కొత్త మోడళ్లకు సన్నని, భవిష్యత్‌ను సూచించే రూపకల్పన ఉంది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అని స్పష్టంగా తెలుపుతుంది. ముందు భాగంలో రెండు ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, వాటితో పాటు అడ్డంగా ఉండే డీఆర్‌ఎల్‌లు (డేటైమ్ రన్నింగ్ లైట్స్) ఉంటాయి.

ముందు భాగంలో డ్యూయల్-డిస్క్ బ్రేక్ సెటప్ ఉంటుంది. ముందువైపు USD ఫోర్కులు (అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు), వెనుకవైపు మోనో-షోక్ సస్పెన్షన్ షాక్‌లను తట్టుకుంటాయి. సింగిల్-సైడెడ్ స్వింగ్‌ఆర్మ్ బైక్ స్పోర్టి డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. రైడర్‌లు హోండా రోడ్‌సింక్ ద్వారా కనెక్టివిటీతో కూడిన 5-అంగుళాల TFT స్క్రీన్‌ను ఆస్వాదించవచ్చు.
హోండాకు అత్యధికంగా డిమాండ్ ఉన్న యాక్టివా స్కూటర్ ఇప్పటివరకు సాధించిన అమ్మకాలు చూస్తే ప్రత్యర్థులు సైతం షాక్ అవుతారు. 2001లో మార్కెట్‌లోకి వచ్చిన యాక్టివా భారతదేశంలో ఏకంగా 3.50 కోట్ల యూనిట్లను అమ్మింది. ఏ ఇతర గేర్‌లెస్ స్కూటర్‌కు ఇది సాధ్యం కాని ఘనత. ప్రస్తుతం యాక్టివా శ్రేణిలో యాక్టివా 110, యాక్టివా 125, యాక్టివా-i, యాక్టివా ఇ మోడల్స్ ఉన్నాయి.

ఒక మామూలు బైక్ కంటే యాక్టివా ఎక్కువ ప్రయోజనాలను అందించడమే దాని ప్రధాన హైలైట్. 2015లో యాక్టివాకు మొదటి కోటి కస్టమర్లు లభించారు. 2018లో అమ్మకాలు రెండు కోట్లకు చేరుకోగా, ఇప్పుడు 2025లో ఏకంగా 3.5 కోట్ల మార్కును అధిగమించి దూసుకుపోతోంది. ఆధునిక పోటీదారుల ముందు నిలబడటానికి అవసరమైన అన్ని అద్భుతమైన ఫీచర్లను యాక్టివాలో చేర్చారు.
ప్రస్తుతం ఇది ఆరవ తరం వెర్షన్‌లో ఉంది. గత 24 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ ఇది. పెట్రోల్ వెర్షన్‌లో యాక్టివా 110 సీసీ ఇంజిన్, 125 సీసీ ఇంజిన్‌లతో వస్తుంది. 109.51 సీసీ BS-VI ఇంజిన్ యాక్టివా 110 వేరియంట్‌కు గుండెకాయ, ఇది 7.73 బీహెచ్‌పి పవర్, 8.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే రూ.78,684 ప్రారంభ ధరతో ఇది కస్టమర్లకు మంచి డీల్.


Click it and Unblock the Notifications








