రోడ్డుపై రాజసం కావాలా? స్మూత్ రైడింగ్ కావాలా? రెండు లక్షల బడ్జెట్లో ఈ రెండు బైక్స్ మధ్య పోరు మామూలుగా లేదు
భారతదేశంలో 350సీసీ రెట్రో బైకులంటే కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ విభాగంలో దశాబ్దాలుగా రారాజుగా వెలుగుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) కి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. జపాన్ టెక్నాలజీతో దూసుకొచ్చిన హోండా CB350 (Honda CB350) ఇప్పుడు ఎన్‌ఫీల్డ్ కోటను బద్దలు కొట్టడానికి సిద్ధమైంది. లుక్ పరంగా రెండూ అదిరిపోయినా, ఇంజిన్ పనితీరు, ఫీచర్లలో వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఈ రెండింటిలో మీ వ్యక్తిత్వానికి, మీ అవసరాలకు ఏ బైక్ సెట్ అవుతుందో వివరంగా చూద్దాం.
ముందుగా డిజైన్ విషయానికి వస్తే.. క్లాసిక్ 350 ఒక లెజెండ్. పాత కాలపు రాయల్ ఎన్‌ఫీల్డ్ రాజసాన్ని అలాగే ఉంచుతూ, దీనిని ఆధునికీకరించారు. దీని టైగర్ ఐ ఎల్‌ఈడీ పైలట్ ల్యాంప్స్, సిగ్నేచర్ హ్యాండిల్ బార్, పెద్ద ఫెండర్లు రోడ్డుపై వెళ్తుంటే ఒక భారీ బైక్ వెళ్తున్న అనుభూతిని కలిగిస్తాయి.

మరోవైపు హోండా CB350 కూడా రెట్రో స్టైల్‌లోనే ఉన్నా, ఇందులో చాలా క్లీన్, మోడ్రన్ ఫినిషింగ్ కనిపిస్తుంది. దీని మజిల్ ట్యాంక్, రింగ్ టైప్ ఎల్‌ఈడీ వింకర్లు బైక్‌కు సోలిడ్ లుక్ ఇస్తాయి. ఎన్‌ఫీల్డ్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తే, హోండా మోడ్రన్ రెట్రో స్టైల్‌ను చూపిస్తుంది.
ఇక ఇంజిన్ పవర్, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే.. రెండూ దాదాపు ఒకే స్థాయిలో ఉంటాయి. క్లాసిక్ 350 ఇంజిన్ 20.2 bhp పవర్, 27 Nm టార్క్‌ను ఇస్తుంది. దీని ఇంజిన్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఆ సిగ్నేచర్ డుగ్గు డుగ్గు సౌండ్ అంటే ఇష్టపడే వారికి ఇది ప్రాణం.

అయితే హోండా CB350 ఇంజిన్ (20.78 bhp, 29.5 Nm) మాత్రం చాలా స్మూత్‌గా, ఎటువంటి వైబ్రేషన్లు లేకుండా ఉంటుంది. తక్కువ వేగంలో కూడా ఎక్కువ టార్క్ ఇవ్వడం హోండా ప్రత్యేకత, దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మార్చాల్సిన అవసరం ఉండదు. వైబ్రేషన్లు అస్సలు ఇష్టం లేని వారు కళ్ళు మూసుకుని హోండా వైపు మొగ్గు చూపవచ్చు.
ఫీచర్ల పరంగా హోండా కొంచెం ముందుంది. హోండాలో 15.2 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉండటం వల్ల లాంగ్ ట్రిప్స్‌కు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది (ఎన్‌ఫీల్డ్‌లో 13 లీటర్లు మాత్రమే). కంఫర్ట్ విషయానికి వస్తే ఎన్‌ఫీల్డ్ సీట్లు చాలా మెత్తగా ఉండి సోఫా మీద కూర్చున్న ఫీలింగ్ ఇస్తాయి.

కానీ ఎన్‌ఫీల్డ్ బరువు కొంచెం ఎక్కువ కాబట్టి ట్రాఫిక్‌లో తిప్పడం కొత్తవారికి కొంచెం కష్టమనిపించవచ్చు. హోండా బైక్ పొడవుగా ఉన్నా, బరువు బ్యాలెన్సింగ్ బాగుండటం వల్ల హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది. రెండింటిలోనూ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, టెలిస్కోపిక్ ఫోర్క్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ధరల విషయానికి వస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.93 లక్షల నుండి మొదలవుతుంది. హోండా CB350 ధర రూ. 1.97 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
ముగింపుగా చెప్పాలంటే.. మీకు ఆ పాత కాలపు ఫీలింగ్, భారీ బరువు, ఆ విలక్షణమైన గంభీరమైన సౌండ్ కావాలనుకుంటే క్లాసిక్ 350ని మించినది లేదు. అలా కాకుండా, జపాన్ ఇంజిన్ స్మూత్‌నెస్ కావాలి, వైబ్రేషన్లు ఉండకూడదు, లాంగ్ ట్రిప్స్ హ్యాపీగా వెళ్లాలి అనుకుంటే హోండా CB350 మీ స్మార్ట్ ఛాయిస్ అవుతుంది.


Click it and Unblock the Notifications








