ఆరు వారాల్లో 30,000 బుకింగ్‌లను సొంతం చేసుకున్న సెంచురో
మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం, మహీంద్రా టూవీలర్స్ గడచిన నెలలో విడుదల చేసిన చీప్ అండ్ బెస్ట్ 110సీసీ బడ్జెట్ మోటార్‌సైకిల్ 'మహీంద్రా సెంచురో' భారత మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించింది. విడుదలైన కొద్ది రోజులకే ఇది రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లోకి విడుదలైన మొదటి ఆరు వారాల్లోనే 30,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మరియు టూవీలర్ సెక్టార్ ప్రెసిడెంట్ అనూప్ మాథుర్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే మహీంద్రా సెంచుకో 30,000 బుకింగ్‌లను దక్కించుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని, ఇదే సమయంలో వినియోగదారులు తమపై పెంచుకున్న అంచనాలకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సందర్భంగా ఆయన తమ వినియోగదారులకు ధన్యవాదములు తెలుపుకున్నారు.
మహీంద్రా సెంచురో జులై 1, 2013న విడుదలైంది. దేశీయ విపణిలో దీని ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ బైక్‌పై కంపెనీ ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేస్తుంది. మహీంద్రా సెంచురో బైక్‌లో కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications









