31 రోజులు.. 2,72,000 కొత్త కస్టమర్లు..నెలకు 2.72 లక్షల అమ్మకాలతో దుమ్మురేపిన హోండా యాక్టివా
భారతదేశంలో టూ-వీలర్ మార్కెట్ అంటే హోండా, హోండా అంటే యాక్టివా.. ఇదొక విడదీయలేని బంధం. దశాబ్దాలు మారుతున్నా, కొత్త మోడల్స్ పుట్టుకొస్తున్నా, ఎలక్ట్రిక్ విప్లవం ముంచుకొస్తున్నా సరే, హోండా యాక్టివా క్రేజ్ మాత్రం అంగుళం కూడా తగ్గడం లేదు. తాజా గణాంకాల ప్రకారం.. జనవరి 2026 నెలలో హోండా యాక్టివా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ ఒక్క నెలలోనే లక్షలాది ఇళ్లలోకి చేరి, తన నంబర్-1 స్థానాన్ని ఎవరూ టచ్ చేయలేరని నిరూపించింది. కేవలం 31 రోజుల్లోనే 2,72,000 యూనిట్ల విక్రయాలను సాధించి, తన సమీప ప్రత్యర్థులను ఆమడ దూరంలో నిలబెట్టింది.
గతేడాది జనవరితో పోలిస్తే హోండా యాక్టివా అమ్మకాలు ఆశ్చర్యకరమైన రీతిలో పెరిగాయి. జనవరి 2025లో 1,66,739 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది జనవరిలో ఆ సంఖ్య ఏకంగా 2,71,924 యూనిట్లకు చేరుకుంది. అంటే వార్షిక ప్రాతిపదికన 63 శాతం వృద్ధి నమోదైంది.

మధ్యతరగతి కుటుంబాలకు యాక్టివా ఒక నమ్మకమైన నేస్తంగా మారిపోయింది. ఆఫీసులకు వెళ్లే పురుషులు, ఇంటి పనులు చూసుకునే మహిళలు, కాలేజీ విద్యార్థులు.. ఇలా అందరికీ కంఫర్ట్ ఇచ్చే ఏకైక స్కూటర్‌గా యాక్టివా తన పట్టును నిలుపుకుంది. దీని ఇంజిన్ పనితీరు, రీసేల్ వాల్యూ మిగిలిన కంపెనీల కంటే దీన్ని ముందు వరుసలో నిలబెడుతున్నాయి.
హోండా కేవలం స్కూటర్లకే పరిమితం కాలేదు, బైక్ మార్కెట్‌లో కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. హోండా షైన్ 125 మోడల్ 1,35,076 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. అయితే గతేడారితో పోలిస్తే ఇందులో 11 శాతం తగ్గుదల కనిపించడం గమనార్హం. ఇక మూడో స్థానంలో హోండా సీబీ యూనికార్న్ 160 నిలిచింది. ఈ మోడల్ 35,710 యూనిట్లతో తన ఉనికిని చాటుకుంది. అదేవిధంగా హోండా షైన్ (స్టాండర్డ్) వేరియంట్ 26,148 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలవడమే కాకుండా, 55 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

యువతను ఎక్కువగా ఆకట్టుకునే హోండా డీఓ స్కూటర్ ఐదో స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఈసారి డీఓ అమ్మకాలు 44 శాతం తగ్గి 13,855 యూనిట్లకు పరిమితమయ్యాయి. దీనికి విరుద్ధంగా హోండా డీఓ 125 మోడల్ 11,607 యూనిట్లతో ఆరో స్థానంలో ఉంది. స్టైలిష్ బైక్ సెగ్మెంట్‌లో హోండా హార్నెట్ (CB 125 Hornet) మోడల్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. జనవరి నెలలో సుమారు 8,752 మంది కొత్త కస్టమర్లు హార్నెట్‌ను తమ ఇంటికి తీసుకెళ్లారు. హోండా లైనప్‌లో ఉన్న వైవిధ్యం కస్టమర్లకు ఎన్నో ఆప్షన్లను అందిస్తోంది.
హోండా సీబీ 350 మోడల్ విక్రయాలు చూస్తుంటే బుల్లెట్ ప్రియులు ఇప్పుడు హోండా వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది. గతేడాది కంటే ఏకంగా 224 శాతం భారీ వృద్ధితో 5,500 యూనిట్ల అమ్మకాలను ఈ బైక్ సాధించింది. ఇది ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో హోండా లీవో (4,433 యూనిట్లు), పదో స్థానంలో హోండా ఎస్పీ 160 (2,474 యూనిట్లు) నిలిచాయి. అయితే ఎస్పీ 160 అమ్మకాలు గతంతో పోలిస్తే 51 శాతం పడిపోవడం కంపెనీకి కొంత ఆందోళన కలిగించే విషయమే.

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం మొత్తం ఎలక్ట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. హోండా కూడా తన పాపులర్ బ్రాండ్ పేరుతో 'యాక్టివా ఈ' (Activa e)ను మార్కెట్లోకి తెచ్చింది. అయితే, పెట్రోల్ యాక్టివా రేంజ్‌లో దీనికి ఆదరణ లభించడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. జనవరి నెలలో కేవలం 224 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత లేదా ధర అయి ఉండొచ్చు. ఇతర మోడల్స్ అయిన హోండా హైనెస్ (2,302 యూనిట్లు), హార్నెట్ 2.0 (883 యూనిట్లు), సీబీ 200ఎక్స్ (691 యూనిట్లు) తమవంతు విక్రయాలను నమోదు చేశాయి.
మొత్తానికి హోండా సంస్థకు యాక్టివా ఒక వెన్నెముక లాంటిది. 13 ఇతర మోడళ్లను కలిపినా యాక్టివా దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా హోండా తన సత్తా చాటుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications