ఆగస్ట్ అప్‌డేట్: ఒక్క వారం రోజుల్లో 7 కొత్త కార్లు విడుదల
భారతదేశంలో పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఈ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు సరికొత్త కార్లను దేశీయ విపణిలో విడుదల చేస్తున్నాయి. తగ్గముఖం పడుతున్న అమ్మకాల ట్రెండ్‌ను బీట్ చేసేందుకు, ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కార్ల విడుదతో సరికొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతున్నాయి.
ఆగస్ట్ నెలలో ఒక్క వారం రోజుల వ్యవధిలోనే కార్ల తయారీ కంపెనీలు 7 సరికొత్త కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. మరి ఈ ఆగస్ట్ నెలలో విడుదలైన ఆ కొత్త కార్లు ఏవో, వాటి విశేషాలంటే ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

టాటా సఫారీ స్టోర్మ్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీలో 'సఫారీ స్టోర్మ్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్' (Tata Safari Storme Explorer Edition) అనే ఓ కొత్త వేరియంట్‌ను ఆగస్ట్ 23, 2013న కంపెనీ విడుదల చేసింది. ప్రత్యేకించి ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం రూపొందించిన ఈ కొత్త సఫారీ వేరియంట్ ధర భారత మార్కెట్లో రూ.10.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఆగస్ట్ 22, 2013వ తేదీన కొత్త క్రాస్ పోలో (Cross Polo) హ్యాచ్‌బ్యాక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. మరింత స్పోర్టీ డిజైన్‌తో కూడిన ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో ధర రూ.7.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది 1.2 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్‌తోలభ్యమవుతుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

మారుతి సుజుకి స్టింగ్‌రే
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, కొత్త 'స్టింగ్‌రే' (Stingray) కారును ఆగస్ట్ 21, 2013న భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మారుతి సుజుకి స్టింగ్‌రే కారు మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. దేశీయ విపణిలో మారుతి సుజుకి స్టింగ్‌రే ప్రారంభం వేరియంట్ ధర రూ.4.09 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లక్షలుగా ఉంది.

నిస్సాన్ టెర్రానో
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, తమ 'టెర్రానో' (Nissan Terrano) ఎస్‍యూవీని ఆగస్ట్ 20, 2013న భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ కోసం సెప్టెంబర్ 1వ తేది నుంచి బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో నిస్సాన్ టెర్రాన్ అంచనా ధర సుమారు రూ.10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని సమాచారం.

ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండ్ ఎస్ ఎడిషన్
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ నుంచి భారత మార్కెట్లో అత్యంత సరమైన ధరకే లభ్యమవుతున్న ఫ్రీల్యాండర్ లగ్జరీ ఎస్‌యూవీలో 'బిజినెస్ ఎడిషన్' పేరిట ఓ చవక వేరియంట్‌ను ఆగస్ట్ 20, 2013న కంపెనీ విడుదల చేసింది. భారత మార్కెట్లో ఫ్రీల్యాండర్ బిజినెస్ ఎడిషన్ వేరియంట్ ధర రూ.37.11లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఆడి క్యూ3 ఎస్ ఎడిషన్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న క్యూ3 సిరీస్‌లో ఓ చవక వేరియంట్‌ను ఆగస్ట్ 19, 2013వ తేదీన విడుదల చేసింది. 'ఆడి క్యూ3 ఎస్' (Audi Q3 S) పేరుతో విడుదలైన ఈ ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు ధర, దేశీయ విపణిలో రూ.24.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

రోల్స్ రాయిస్ వ్రైత్
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా, దేశీయ విపణిలో తమ లేటెస్ట్ హైపెర్ఫామెన్స్ కారు రోల్స్ రాయిస్ వ్రైత్ (Rolls Royce Wraith)ను ఆగస్ట్ 19, 2013న విడుదల చేసింది. భారత మార్కెట్లో రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ సెడాన్ ధర రూ.4.4 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఆగస్ట్ నెలలో ఒక్క వారం రోజుల వ్యవధిలోనే కార్ల తయారీ కంపెనీలు 7 సరికొత్త కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి.


Click it and Unblock the Notifications








