బ్రేకింగ్ న్యూస్: మిత్సుబిషి సెడియా ధరలో రూ.1.31 లక్షల కోత
జపాన్ ఆటో దిగ్గజం మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'మిత్సుబిషి సెడియా' ధరను భారీగా తగ్గించింది. ఇప్పటి వరకూ మిత్సుబిషి సెడియా సెడాన్ ధర రూ.9.30 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కాగా.. తాజాగా సెడియా ధరను ఏకంగా రూ.1.31 లక్షల తగ్గించి కేవలం రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకే మిత్సుబిషి ఆఫర్ చేస్తుంది. ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
మిత్సుబిషి సెడియా సెడాన్ విషయానికి వస్తే, ఇందులో ఈసిఐ మల్టీ (ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ మల్టీ-పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్)తో కూడిన, రీడిఫైన్ చేయబడిన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 5250 ఆర్‌పిఎమ్ వద్ద 115 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4250 ఆర్‌పిఎమ్ వద్ద 175 గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.
మిత్సుబిషి సెడియా సెడియా ఎక్స్‌టీరియర్స్‌ను పరిశీలిస్తే.. ఇందులో స్లీక్ ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్స్, ఫిష్-ఐ హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ రియర్ స్పాయిలర్‌లు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. అలాగే ఇంటీరియర్స్‌లో లెథర్ సీట్స్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, బ్రేక్, క్లచ్, యాక్సిలరేటర్ పెడల్స్‌పై కాలు జారిపోకుండా ఉండేలా డిజైన్ చేసిన యాంటీ-స్కిడ్ అల్లాయ్ పెడల్స్, మోమో స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
అలాగే, సెడియాలో ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకునేలా డిజైన్ చేసిన రైస్ బాడీ (రీఇన్‌ఫోర్స్‌డ్ ఇంపాక్ట్ సేఫ్టీ ఎవాల్యుయేషన్), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 3-పాయింట్ ఎమర్జెన్సీ లాకింగ్ రియాక్టర్ సీట్ బెల్ట్స్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








