2021 మే 24 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్న హీరో మోటోకార్ప్; పూర్తి వివరాలు
భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ అధికంగా వ్యాపించి ఎంతో మంది మరణానికి కారణమైంది. ఈ మహమ్మారి నివారణ కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటూ కరోనా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్ డౌన్ సమయంలో దాదాపు దేశంలోని అన్ని ఆటో మొబైల్ పరిశ్రమలు మూసివేయబడ్డాయి.

అయితే ఇటీవల దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరుపొందిన హీరో మోటోకార్ప్ తన ప్లాంట్లలను ఇప్పుడు దశల వారీగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2021 మే 24 నుండి హీరో మోటోకార్ప్ కంపెనీ తన అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలిపింది.

కంపెనీ తన ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించిన సమయంలో సరైన భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. కరోనా సంక్రమణను తగ్గించడానికి హీరో మోటోకార్ప్ ఈ నెల ప్రారంభం నుండి తన ఉత్పత్తి ప్లాంట్లను మూసివేసింది.

అయితే ఇప్పుడు దేశంలో కరోనా కేసులు తగ్గిన చోట, ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి పూర్తి భద్రతతో ప్లాంట్లను ప్రారంభించనున్నారు. మే 17 నుండి సంస్థ తన మూడు ప్లాంట్లైన గురుగ్రామ్, డెహ్రాడూన్ మరియు హరిద్వార్ లో సింగిల్ షిఫ్ట్ లో ఉత్పత్తిని ప్రారంభించింది.

అయితే కంపెనీ ఇతర ప్లాంట్లు, నీమ్రానా, రాజస్థాన్, హలోల్, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మే 24 సోమవారం నుండి సింగిల్ షిఫ్ట్ లో ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. దీనితో పాటు నీమ్రానా లోని గ్లోవల్ పార్ట్స్ సెంటర్ కూడా ప్రారంభమవుతుంది.

భారతదేశంలో కంపెనీ దేశీయ మార్కెట్ కోసం ఉత్పత్తిని ప్రారంభించడమే కాకుండా, ప్రపంచ స్థాయిలో ఉత్పత్తిని మెరుగుపర్చడానికి కంపెనీ కృషి చేస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని క్రమంగా సెకండ్ షిఫ్ట్ ఉత్పత్తి కూడా ప్రారంభించనుంది.

హీరో మోటోకార్ప్ 18 నుంచి 45 సంవత్సరాల వయసున్న ఉద్యోగులకు టీకాలు వేయడానికి వీలైనంత త్వరగా చొరవ ప్రారంభించింది. ఇందులో కూడా 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు దాదాపు 90 శాతం మందికి టీకాలు వేశారు. ఈ సమయంలో అన్ని భద్రత మరియు పరిశుభ్రత ప్రోటోకాల్‌లను జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుందని కంపెనీ తెలిపింది.

హీరో మోటోకార్ప్ కంపెనీతో పాటు దేశంలో ఉన్న చాలా ద్విచక్ర వాహన సంస్థలు మే నెలలో తమ ఉత్పత్తి ప్లాంట్లను మూసివేసాయి. అయితే ఇప్పుడు హీరో మోటోకార్ప్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనున్న మొదటి కంపెనీ అవుతుంది. ఇతర కంపెనీలు కూడా రాబోయే రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








