ఫోర్డ్ ఫియస్టా డీజిల్ రివ్యూ: ఈ కారులో అసలేముంది?
అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియా, ఈ జూన్ 2014లో తమ సరికొత్త ఫియస్టా ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ రీడిజైన్డ్ స్టయిలిష్ 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌ను తొలిసారిగా 2014 ఆటో ఎక్స్‌లో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. తాజాగా.. మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఈ సరికొత్త కారును ముంబైలో టెస్ట్ డ్రైవ్ చేసింది.
ఫోర్డ్ ఫియస్టా ఓ గ్లోబల్ మోడల్. దాదాపు అన్ని మార్కెట్లలో దీని డిజైన్ ఒకేలా ఉంటుంది. అయితే ఫీచర్లలో మాత్రం కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉంటాయి. అంతేకాకుండా.. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఫోర్డ్ ఫియస్టా హ్యాచ్‌బ్యాక్ రూపంలో కూడా లభ్యమవుతోంది.
ఈ కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో, మూడు వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది. మరి మా టెస్ట్ డ్రైవ్ పరీక్షలో ఈ కొత్త ఫియస్టా సెడాన్ ఎన్ని మార్కులు తెచ్చుకుందో తెలుసుకోవాలంటే ఈ సమీక్షను చదవాల్సిందే.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఓవర్‌వ్యూ
* టెస్ట్ చేసిన మోడల్: 2014 ఫోర్డ్ ఫియస్టా టైటానియం
* ఇంధన రకం: డీజిల్
* ఇంజన్: 1.5 లీటర్ టిడిసిఐ (కేవలం డీజిల్ ఆప్షన్ మాత్రమే)
* డ్రైవ్‌ట్రైన్: ఫ్రంట్ వీల్ డ్రైవ్
* ట్రాన్సిమిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్
* రోడ్ టెస్ట్ లొకేషన్: ముంబై
* ధర: రూ.11.06 లక్షలు (ఆన్-రోడ్, హైదరాబాద్)

స్టయిలింగ్ - ఫ్రంట్
కొత్త 2014 ఫియస్టా సెడాన్ స్టయిలింగ్ విషయంలో ఫోర్డ్ ఇండియా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. దీని ఫ్రంట్ డిజైన్‌లో ప్రధానంగా ఆస్టన్ మార్టిన్ లాంటి ఫ్రంట్ గ్రిల్ (ఇదివరకటి ఫియస్టాలోని బ్లాక్ ప్లాస్టిక్ గ్రిల్ స్థానంలో క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన గ్రిల్) ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌నిస్తుంది. ఫ్రంట్ బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరియు హెడ్‌ల్యాంప్స్ డిజైన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తమ్మీద చూసుకుంటే, కొత్త ఫియస్టా మునపటి వెర్షన్ కన్నా మరింత స్టయిలిష్‌గా అనిపిస్తుంది

స్టయిలింగ్ - సైడ్
సైడ్ నుంచి గమనిస్తే.. కొత్త ఫియస్టా బాడీ లైన్స్ కారు నిలిచి ఉన్నప్పటికీ, గమనంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఇందులో మొదటి పెద్ద బాడీ లైన్ ఫ్రంట్ వీల్ ఆర్చ్ నుండి ప్రారంభమై రెండు డోర్ హ్యాండిల్స్‌ను కలుపుతూ వెనుక టెయిల్ ల్యాంప్ వరకూ డిజైన్ చేయబడి ఉంటుంది. ఇరపోతే రెండవ బాడీ లైన్ డోర్స్ క్రింది భాగంలో ఉంటుంది. ఫోర్డ్ తమ కొత్త 2014 ఫియస్టా సెడాన్‌ను కైనటెకి డిజైన్ 2.0 ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని తయారు చేశారు. భవిష్యత్తులో అన్ని మోడళ్లను ఇదే డిజైన్ ఫిలాసఫీతో తయారు చేయనున్నట్లు కంపెనీ పేర్కోంది. కొత్త ఫియస్టాలోని డబుల్ స్పోక్ అల్లాయ్ వీల్స్ కారుకు మరింత స్పోర్టీ ఫీల్‌నిస్తాయి.

స్టయిలింగ్ - రియర్
ఫోర్డ్ ఫియస్టా వెనుక డిజైన్‌ను నీట్ అండ్ క్లీన్‌గా ఉంచారు. రీడిజైన్ చేయబడిన స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్ (సగం బాడీపై, సగం బూట్ డోరుపై), డిఫ్యూజర్‌తో కూడిన రియర్ బంపర్‌లు కొత్తవిగా అనిపిస్తాయి. అలాగే బంపర్‌పై క్రోమ్ గార్నిష్ కారుకు మరింత స్పోర్టీ అండ్ ప్రీమియం లుక్‌నిస్తుంది. అయితే, టెయిల్ ల్యాంప్ క్లస్టర్ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది, దీనిని మరింత మోడ్రన్‌గా డిజైన్ చేసి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం. ఇతర సెడాన్ల మాదిరిగా ఫియస్టా సెడాన్ వెనుక వైపు చూస్తే, సైలెన్సర్ బయటకు కనిపించదు. ఎగ్జాస్ట్ (సైలెన్సర్) బయటకు కనిపించకుండా ఉండేలా ఇంజనీర్లు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇంజన్
కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్, టిడిసిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని, 203 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ డీజిల్ ఇంజన్ ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) లెవల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఫోర్డ్ ఫియస్టా కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది, ఇందులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)
ఫోర్డ్ ఇండియాతమ 2014 ఫియస్టా సెడాన్‌ను కేవలం డీజిల్ ఇంజన్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేకపోవటం నిరుత్సాహకరం. ఏదేమైనప్పటికీ, ఈ మ్యాన్యువల్ వెర్షన్ ఫియస్టాలోని గేర్‌బాక్స్, షిఫ్టింగ్ చాలా స్మూత్‌గా అనిపించింది. నిత్యం ఆగుతూ ముందుకు వెళ్లే సిటీ ట్రాఫిక్‌లో క్లచ్ కాస్తతం హెవీగా అనిపించింది. అయితే, ఓపెన్ రోడ్స్‌లో మాత్రం కొత్త ఫియస్టా పంచకళ్యాణి గుర్రంలా పరుగులు తీసింది.

మైలేజ్
మైలేజ్ విషయానికి వచ్చే సరికి కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరు డీజిలుకు 25.01 కిలోమీటర్ల మైలేజీనివ్వాలి. అయితే, మా టెస్ట్ డ్రైవ్ సందర్భంలో ఇది సగటున లీటరు డీజిలుకు 12.5 కిలోమీటర్ల (సిటీ, హైవే, ఘాట్ రోడ్లతో కలిపి) మైలేజీని మాత్రమే ఇచ్చింది.

డ్రైవ్ అండ్ హ్యాండ్లింగ్
ఫోర్డ్ ఫియస్టా ఓ మంచి డ్రైవర్స్ కార్. ప్రత్యేకించి స్టీరింగ్ విషయంలో ఫోర్డ్ పలు జాగ్రత్తలు తీసుకుంది. ట్రాఫిక్ కండిషన్స్‌లో ఫియస్టా స్టీరింగ్ లైట్‌గా అనిపిస్తుంది, అలాగే హైవేలు, ఓపెన్ రోడ్లపై హెవీగా మారుతుంది. ఈ స్టీరింగ్ లైట్‌గా ఉన్నప్పటికీ, డ్రైవర్‌కు మంచి రోడ్ ఫీడ్‌బ్యాక్ అందిస్తుంది, ఫలితంగా డ్రైవింగ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. గేర్లను త్వరగా వేగంగా మార్చుకోవచ్చు కాబట్టి పవర్‌లో ఎలాంటి డిలే ఉండదు. ఓవర్‌టేకింగ్ చేసేటప్పుడు కూడా దీని పవర్ మెరుగ్గా ఉంటుంది.

క్యాబిన్
కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా డ్యాష్‌బోర్డుకి దానికి మునుపటి వెర్షన్ ఫియస్టా డ్యాష్‌బోర్డుకి పెద్దా తేడాలేమీ ఉండవు. ఇంటీరియర్ లేవుట్, డిజైన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో మాదిరిగా అనిపిస్తుంది. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ కన్సోల్‌ను సింపుల్‌గా ఉంచారు. గ్రే అండ్ బీజ్ కలర్ కాంబినేషన్ ఇంటీరియర్ థీమ్ కారులో మరింత ప్రీమియం అప్పీల్‌ని తెచ్చి పెడుతుంది. ప్రకాశవంతంగా ఉండే స్పీడో మీటర్ కన్సోల్‌పై రీడింగ్ స్పష్టంగా ఉంటుంది. ఎక్విప్‌మెంట్స్ లైట్లన్నీ కూడా బ్లూ కలర్‌లో ప్రకాశిస్తూ ఉంటాయి.

క్యాబిన్
వెనుక సీట్లను సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. విశాలమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వెనుక సీటులో రెండు ఇండివిడ్యువల్ అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్స్ మాత్రమే ఉంటాయి. అలాగే, ఫోల్డబిల్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది.

ఇన్‌స్ట్రుమెంట్స్
కొత్త ఫోర్డ్ ఫియస్టా ఇన్‌స్ట్రుమెంట్ కంట్రోల్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇది ఫోర్డ్ పాపులర్ సింక్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. ఈ సిస్టమ్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీ ఫోన్ కాల్స్, హ్యాండ్సీ-ఫ్రీ మ్యూజిక్ ప్లేబ్యాక్, టెక్స్ట్ మెసేజ్ రీడ్-అవుట్, యాప్‌లింక్, వాయిస్ యాక్టివేటెడ్ ఎమర్జెన్సీ అసిస్ట్ వంటి పలు ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లున్నాయి.

మాకు నచ్చినవి - బూట్ స్పేస్
కొత్త ఫోర్డ్ ఫియస్టా పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ, బూట్ స్పేస్ విషయంలో మాత్రం రాజీపడకుండా డిజైన్ చేశారు. ఇది 430 లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంటుంది. ఓ చిన్న కుటుంబానికి సరిగ్గా సరిపోయే రీతిలో ఈ కారును డిజైన్ చేశారు. బూట్ స్పేస్‌లో కనీసం రెండు మీడియం సైజ్ స్ట్రాలీ బ్యాగ్‌లను రెండు డఫెల్ బ్యాగ్‌లను స్టోర్ చేసుకునేంత స్థలం ఉంటుంది.

మాకు నచ్చినవి - సీట్స్
ఇదివరకు చెప్పుకున్నట్లుగానే 2014 ఫోర్డ్ ఫియస్టా మంచి డ్రైవర్స్ కారు. ఇందులోని సీట్లు ఈ సెగ్మెంట్లో కెల్లా బెటర్‌గా అనిపిస్తాయి. ప్రత్యేకించి డ్రైవర్ సీట్ చాలా సౌకర్యంగా ఉండటమే కాకుండా, లోపలి వైపు నుంచి మంచి వ్యూని ఆఫర్ చేస్తుంది.

మాకు నచ్చినవి - వీల్స్ అండ్ టైర్స్
కొత్త ఫోర్డ్ ఫియస్టా టైటానియం వేరియంట్‌లో 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, 185/60 ఆర్15 గుడ్ఇయర్ ఈగల్ ఎన్‌సిటి 5 ట్యూబ్‌లెస్ టైర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇవి మంచి రోడ్ గ్రిప్‌ను ఇస్తాయి. ఇవి చాలా ఖరీదైన టైర్లు. ఈ టైర్లు ఇండియాలో తయారు కావటం లేదు. కంపెనీ వీటిని విదేశాల నుంచి దిగుమచి చేసుకుంటుంది. ఈ సెడాన్ ధరను తగ్గించాలని ఫియస్టా చవక టైర్లను ఆశ్రయించలేదు.

మాకు నచ్చనివి - స్టీరింగ్ వీల్
కొత్త ఫోర్డ్ ఫియస్టాలో మాకు నచ్చినవే కాదు, నచ్చని అంశాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా స్టీరింగ్ వీల్. ఇది మంచి ఫీడ్‌బ్యాక్‌నే ఆఫర్ చేసినప్పటికీ, దీని సన్నటి వ్యాసార్థం కాస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు తరచూ వాహనాలను మార్చి మార్చి డ్రైవ్ చేసేవారైతే, ఈ స్టీరింగ్‌కు అలవాటు పడటానకి కాస్తంత సమయం పడుతుంది లేదా ఇది కొత్తగా అనిపిస్తుంది.

మాకు నచ్చనివి - బానెట్ ఓపెన్ ల్యాచ్
సాధారణంగా అన్ని కార్లలో బానెట్ ఓపెన్ ల్యాచ్ ఎక్కడుంటుందో సులువుగా తెలిసిపోతుంది. అయితే, ప్రత్యేకించి ఈ కొత్త ఫియస్టా కారులో బానెట్ ఓపెన్ ల్యాచ్‌ను డ్రైవర్ కుడికాలికి సమీపంలో ఏర్పాటు చేశారు. కొత్తగా ఈ కారును డ్రైవ్ చేసే వారికి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.

మాకు నచ్చనివి - రియర్ విజిబిలిటీ
ఫోర్డ్ ఫియస్టా వెనుక సీటులో ఉండే అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్‌ని కాస్తంత పైకి లేపినా లేదా వెనుక సీటులో పొడవుగా ఉండే వ్యక్తులు కూర్చున్నా ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌లో వెనుక నుంచి వచ్చే వాహనాలను గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. ఈ సందర్భంలో పూర్తిగా రియర్ పార్కింగ్ సెన్సార్లపై మాత్రమే ఆధారపడాల్సి ఉంటుంది.

మాకు నచ్చనివి - బ్రేక్స్
సాధారణంగా ఫోర్డ్ ఫియస్టా బ్రేక్స్ పనితీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ, అత్యవసరంగా కారును నిలపాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇవి మరింత రెస్పాన్సివ్‌గా ఉంటే బాగుండనేది మా అభిప్రాయం.

కాంపిటీటర్స్
కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్ ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, ఫియట్ లీనియా వంటి మోడళ్లతో తలపడనుంది. ఫియస్టా, వెంటో మోడళ్లలో ఒకేరకమైన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. కాగా.. వెర్నా, లీనియా మోడళ్లలో 1.4 లీటర్, 1.3 లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. సేఫ్టీ విషయానికి వస్తే, ఫియస్టా బేస్ వేరియంట్లోనే ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.
డ్రైవర్ ఎంగేజ్‌మెంట్, ఓవరాల్ ఫన్ ఫ్యాక్టర్ వంటి విషయాల్లో కొత్త ఫియస్టా అత్యధిక స్కోరింగ్‌ను దక్కించుకుంది. అయితే, పరిమాణంలో చిన్నదిగా ఉండటం వలన కొనుగోలుదారులు ఈ మోడల్‌కు దూరంగా ఉంటున్నారనిపిస్తోంది.

ఫోర్డ్ ఫన్ ఫ్యాక్ట్
ఇదివరకు ఫోర్డ్ వాహనాల డిజైన్ ప్లెయిన్‌గా, బోరింగ్‌గా ఉండేవి. అయితే, ఈ సంస్థలో కొత్త ఛీఫ్ డిజైనర్ ఇహాబ్ కావోడ్ వచ్చిన తర్వాత ఫోర్డ్ వాహనాల డిజైన్ ఫిలాసఫీ పూర్తిగా మారిపోయింది. ఈయనకు గతంలో ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉంది. అందుకేనేమో, ఫియస్టాలో ఫ్రంట్ గ్రిల్ ప్రస్తుతం ఆస్టన్ మార్టిన్ కార్లను తలపిస్తుంది. ఫోర్డ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈకోస్పోర్ట్‌ని డిజైన్ చేసింది కూడా ఇతనే. త్వరలో రానున్న కొత్త ఫోర్డ్ ఫిగో కూడా ఇదే డిజైన్ ఫిలాసఫీని ఫాలో కానుంది.

చివరి మాట
ఈ కారు విషయంలో కొన్ని ప్లస్‌లు మైనస్‌లు ఉన్నప్పటికీ, మొత్తమ్మీద 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్ మాత్రం మంచి మిడ్-సైజ్ సెడాన్ అని చెప్పవచ్చు. ఈ కారులోని ఇంజన్ మంచి పవర్‌ను, పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటే బాగుండనేది మా అభిప్రాయం. ప్రత్యేకించి ఈకోబూస్ట్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లను పరిచయం చేసి ఉంటే ఇంకా బాగుండేది. స్టయిలింగ్, కలర్ ఆప్షన్స్, మోడ్రన్ టెక్నాలజీ ఫీచర్స్ ఆకట్టుకుంటాయి.

ధరల కాంపిటీషన్
ఫోర్డ్ ఫియస్టా సెడాన్ ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్ల కన్నా తక్కువ ధరను కలిగి ఉంటుంది. ధరల పోలికను ఈ స్లైడ్‌లో చూడొచ్చు.
(అన్ని ధరలు ఆన్-రోడ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








