Citroen C3 Aircross Full Review సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఫీచర్లు, ఇంజిన్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
దేశీయ మార్కెట్‌లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటాపోటీ కొనసాగుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్ క్రెటాతో పాటు కొన్ని మహీంద్రా మోడల్స్ వినియోగదారులను ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో సిట్రోయెన్ సీ3 ఆకర్షణీయమైన మోడల్స్, ఫీచర్లతో రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని తట్టుకోవడానికి ఆ కంపెనీ ఏం చేయాలి..
త్వరలో ఫ్రెంచ్ తయారీదారు సిట్రోయెన్ నుంచి వస్తున్న సీ3 ఎయిర్‌క్రాస్ దేశీయ రోడ్లపై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మా బృందం చెన్నె మరియు ఈస్ట్ కోస్ట్ రోడ్డుకి వెళ్లింది. సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్ డిజైన్, ఇంటిరీయర్ టెక్, పనితీరు, పూర్తి వివరాలను ఈ రివ్యూ ద్వారా మీకు ఈ కథనంలో అందిస్తున్నాం.

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇటీవల భారత్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న C3 ఎయిర్‌క్రాస్ SUVని ఆవిష్కరించింది. Citroen C3 ఎయిర్‌క్రాస్ ఫ్రెంచ్ వాహన తయారీదారు నుంచి నాల్గవ మోడల్. సిట్రోయెన్ ఈ మోడల్‌ను త్వరలో దేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్ ఎస్‌యూవీ, దేశంలో C- క్యూబ్‌డ్ ఫార్ములా నుంచి రూపొందించిన రెండో వాహనం. రెగ్యులర్ సీ3 హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే అదే DRL లు, హెడ్‌ల్యాంప్‌లు, Y- ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంది. అయితే కొన్ని అధునాతన మార్పులు కలిగి ఉండటంతో ఇది దాని మిగతా హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి వేరుచేస్తుంది. ఇక కొత్త సిట్రోయెన్ సీ 3 ఎయిర్ క్రాస్ డిజైన్‌ను పరిశీలిస్తే..

డిజైన్: ఎయిర్‌క్రాస్ ఫ్రంట్ డిజైన్ దాని రెగ్యులర్ C3 తో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. సీ3 ఎయిర్ క్రాస్‌లో పెద్ద గ్రిల్ బంపర్ హౌసింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్లేట్ విభాగం ద్వారా విడిపోయి ఉంటుంది. దిగువన సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్ మరియు సర్కిల్ ఆకారంలో ఫాగ్ ల్యాంప్‌లు ఉంటాయి. సీ3 ఎయిర్‌క్రాస్ సైడ్స్ ద్వారా ఈ ఎస్‌యూవీ 200mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను స్పష్టంగా పరిశీలించవచ్చు. చతుర్భుజ డైమండ్ కట్ ఆకారంలో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
సీ3 ఎయిర్ క్రాస్ ఎస్‌యూవీ వెనుక భాగంలో ఆకట్టుకునే డిజైన్‌ను జోడించింది. వీటిలో 3-D C ఆకారంలో టైల్‌లైట్‌లు సిట్రోయెన్ చెవ్రాన్‌లకు కనెక్ట్ చేయబడి ఉంటుంది. బంపర్‌పై చంకీ ఫాక్స్ బాష్ ప్లేట్‌తో పాటు వెనుకవైపు విండ్ స్క్రీన్, బ్లాక్ ప్లాస్టిక్ స్ట్రిప్స్‌తో ఆకర్షణీయమైన లుక్‌ను కలిగి ఉంది.

ఫీచర్లు: ఇక సీ3 ఎయిర్ క్రాస్‌లో దాని ఫ్రంట్ సీట్లను పరిశీలిస్తే.. సీ3 హ్యాచ్‌బ్యాక్‌తో పోలిస్తే దాదాపు ఇది అదే డిజైన్‌లో ఉంటుంది. 10.2 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను సీ3 హ్యాచ్ నుంచి తీసుకున్నారు. అయితే 7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లేను మాత్రం కొత్తగా రూపొందించారు. కాగా టచ్‌స్క్రీన్ యూనిట్ ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ కాదనే చెప్పవచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టవిటీతో మీరు డిస్టర్బెన్స్ లేని మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.
కొత్త సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లో ముందు సీట్లను సౌకర్యవంతంగా తయారుచేశారు. ఇది ముందు కూర్చున్న డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు కూర్చునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. కాగా మిడిల్ మరియు వెనుక సీట్లలో కుషనింగ్ అనుకున్న స్థాయిలో ఉండదు. 5+2 సీటర్ వేరియంట్‌లో చివరి వరుసలోని సీట్లు పిల్లలకు, పెద్దల కోసం కేటాయించారు. మిడిల్ వరుసలో ఆర్మ్‌రెస్ట్ లేకపోవడం ఓ రకంగా ప్రయాణికులకు మైనస్ పాయింట్.

ఇక కొత్త సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్‌లో బూట్ స్పేస్‌ను చూసుకుంటే 511 లీటర్ బూట్ సెగ్మెంట్‌తో విశాలంగా ఉంటుంది. వారాంతంలో ట్రిప్‌కు వెళ్లాలి అనుకునేవారు చాలా పెద్ద మొత్తంలో సామగ్రి పెట్టుకోవచ్చు. అయితే 5+2 సీటర్ వేరియంట్‌లో బూట్ స్పేస్ కొద్దిగా తగ్గుతుంది. ఆ సమయంలో ఐదుగురు మాత్రమే వెళ్లాలి అనుకున్నప్పుడు వెనుక ఉన్న రెండు సీట్లను మడతపెట్టి.. బూట్ స్పేస్‌ను ఉపయోగించుకోవచ్చు.
సీ3 ఎయిర్‌క్రాస్ ఫ్రెంచ్ సంస్థ MyCitroen Connect సూట్‌ను కలిగి ఉంది. ఈ సూట్‌లో జియో ఫెన్సింగ్, ఫ్యూయెల్ కండిషన్ తనిఖీలు, వన్ క్లిక్, SOS లోకి అక్రమ చొరబాటు హెచ్చరికలు ఇలా 35 వరకు అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్లన్నీ డ్రైవింగ్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఆధునిక సాంకేతికతతో వాహనదారుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని సిట్రోయెన్ ఈ కారులో అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టింది.

సేఫ్టీ ఫీచర్లు: ఇంకా సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లో అనేక భద్రతా లక్షణాలను తీసుకువచ్చింది. కానీ ఇది ఒక వేరియంట్‌లో మాత్రమే ఉంటుంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు, EBD తో కూడిన ABS, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రేర్ వ్యూ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సార్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ కారు ప్రయాణికులకు ఫుల్ సేఫ్టీని ఇస్తుంది.
స్పెక్స్ అండ్ డైమెన్షన్స్: సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ 4,300 మి.మీ పొడవు, 1,796 మి.మీ వెడల్పు, 1,654 మి.మీ ఎత్తు, 2,671 మి.మీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. కాన్ఫిగరేషన్ ఆధారంగా ఎస్‌యూవీ బూట్ స్పేస్ 444 నుంచి 511 లీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంది.

ఇంజిన్: కొత్త సిట్రోయెన్ సీ 3 ఇంజిన్ పనితీరును చూసుకుంటే ఇది 1.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 5,500 rpm వద్ద 108.4 bhp అవుట్‌పుట్‌ను ఇస్తుంది. 1,750 rpm వద్ద 190 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికొస్తే లీటర్ 18.5 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
సీ3 ఎయిర్‌క్రాస్‌లో మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. గుంతల రోడ్లు, ఎగుడుదిగుడు రోడ్లపై ఈ కారు సునాయాసంగా ప్రయాణిస్తుంది. దాని సస్పెన్షన్ సెటప్‌తో రోడ్డుపై స్మూత్‌గా వెళ్లవచ్చు. టర్నింగ్‌ల్లో వ్యయప్రయాసాలు లేకుండా మంచి వేగంతోనే మీ కారును ముందుకు పోనివ్వవచ్చు. ఇంకా ఎయిర్‌క్రాస్‌లోని బ్రేక్‌లు త్వరగా వేగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.

చివరిగా సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ భారతీయ కార్ మార్కెట్‌లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రత్యేకతను కలిగి ఉంది. ఆకర్షణీయమైన, బెస్ట్ ఫీచర్లతో ఫ్రెంచ్ వాహనతయారీదారు సిట్రోయెన్‌ను టాప్‌లో ఉంచుతుందనడంలో సందేహం లేదు. సీ3 ఎయిర్‌క్రాస్‌ను ఒకే ఒక్క 'మ్యాక్స్' వేరియంట్‌లో విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో కారు ధర విడుదలయ్యాక.. అమ్మకాల కోసం కంపెనీ వేగంగా పుష్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కస్టమర్లను ఆకర్షించకపోతే ఈ కారు విక్రయాలు తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








