నిస్సాన్ టెర్రానో సమీక్ష: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, మైలేజ్, వేరియంట్స్
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీదారుల గుండెల్లో 'టెర్రర్' పుట్టించేందుకు 'నిస్సాన్ టెర్రానో' (Nissan Terrano) వస్తున్న సంగతి తెలిసినందే. జపనీస్ కార్ కంపెనీ భారతీయుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన నిస్సాన్ టెర్రానో, అక్టోబర్ నెలలో (బహుశా 9వ తేది) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, నిస్సాన్ ఇండియా మీడియా కోసం టెర్రానో టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
నిస్సాన్ టెర్రానో టెస్ట్ డ్రైవ్ కార్యక్రమంలో డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా పాల్గొని ఈ స్టయిలిష్ ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ చేసింది. ఆ అనుభవాలను ఇప్పుడు మేము ఈ కథనంలో మీతో పంచుకోబోతున్నాం. ముందుగా.. నిస్సాన్‌కు టెర్రానో అనే పేరు కొత్తదేమీ కాదు, కంపెనీ వివిధ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న వివిధ మోడళ్లకు ఈ పేరును ఉపయోగిస్తోంది.
ప్రత్యేకించి భారత మార్కెట్లో అందిస్తున్న నిస్సాన్ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీని, రెనో అందిస్తున్న సక్సెస్‌ఫుల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. అయితే, బయటివైపు నుంచి ఇందులో రెనో డస్టర్ డిఎన్ఏ అస్సలు కనిపించదు. మరి ఇందులో మంచేంటి, చెడేంటి, దీని పెర్ఫామెన్స్ ఎలా ఉంది మొదలైన అనేక అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ముందు మాట
నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ రాకతో భారత మార్కెట్లో నిస్సాన్ ఇండియా దశ తిరుగుతుందా..? కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది సరికొత్త రికార్డులను సృష్టిస్తుందా..? ఇది వినియోగదారుల అంచనాలకు ధీటుగా ఉంటుందా..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా, తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

టెర్రానో కొలతలు
ముందుగా నిస్సాన్ టెర్రానో కొలతలను పరిశీలిద్దాం. ఇది సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీ కాదు. దీని కొలతలు క్రింది విధంగా ఉన్నాయి:
* పొడవు: 4,331 మి.మీ.
* వెడల్పు: 1822 మి.మీ.
* ఎత్తు: 1671 మి.మీ.
* వీల్‌బేస్: 2673 మి.మీ.
* గ్రౌండ్ క్లియరెన్స్: 205 మి.మీ.
* టర్నిక్ రేడియస్: 5.2 మీటర్లు (డస్టర్ మాదిరిగానే)

ఎక్స్టీరియర్
టెర్రానోను డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు కాబట్టి ఇవి రెండు కూడా మైక్రా/పల్స్, సన్నీ/స్కాలా మాదిరిగా ఒకేరకంగా ఉంటాయనుకుంటే మీరు బ్రేక్‌పై కాలేసినట్లే. టెర్రానోను డస్టర్ కన్నా డిఫరెంట్‌గా ఉంచేందుకు నిస్సాన్ ఇందులో అనేక మార్పులు చేర్పులు చేసింది. వాస్తవానికి డస్టర్ కన్నా టెర్రానో 16 మి.మీ. అధిక పొడవును, 14 మి.మీ. తక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. అయితే, రెండింటి గ్రౌండ్ క్లియరెన్స్ ఒకేలా ఉంటుంది కాబట్టి, టెర్రానోలో హెడ్‌రూమ్ తక్కువ అనిపిస్తుంది.

స్టయిలింగ్
ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, టెర్రానో విషయంలో నిస్సాన్ డిజైన్ టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనిని ఆకర్షనీయంగా, స్టయిలిష్‌గా డిజైన్ చేసింది. డస్టర్ డిజైన్‌తో పోల్చుకుంటే, టెర్రానో డిజైన్ అనేక రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఇందులో నిస్సాన్ డిజైన్ డిఎన్ఏ స్పష్టంగా కనిపిస్తుంది.

ఫ్రంట్ గ్రిల్
నిస్సాన్ ఈ ఫ్రంట్ గ్రిల్‌ను 'హెరిటేజ్ గ్రిల్' అని పిలుస్తుంది. దీని చుట్టూ 'V' షేపులో ఉండే క్రోమ్ బార్స్, గ్రిల్‌కు పక్కనే చిన్న ఎయిర్ ఇన్‌టేక్స్ మరియు దాని చుట్టూ క్రోమ్ గార్నిష్‌తో ఇది తొలిచూపులోనే కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది.

హెడ్‌లైట్స్
హెడ్‌లైట్స్ కూడా డస్టర్‌తో పోల్చి చూసుకుంటే, పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. డస్టర్‌లో ఉండే రౌండెడ్ హెడ్‌లైట్స్ డిజైన్ కన్నా టెర్రానోలో ఉండే యాంగ్యులర్ హెడ్‌లైట్స్ డిజైన్ మరింత అధునాతనంగా ఉంటుంది. హెడ్‌లైట్స్ లోపలివైపు, లైట్ల చుట్టూ నలుపు రంగు ఉంటుంది. అయితే, ఇందులోని ప్రొజెక్టర్ స్టయిల్ ఫాగ్ ల్యాంప్స్ మాత్రం డస్టర్‌లోని ఫాగ్ ల్యాంప్స్‌ను తలపిస్తాయి.

రియర్ డిజైన్
టెర్రానో వెనుక వైపు డిజైన్, ముందువై ఉన్నంత గ్రాండ్‌గా అనిపించదు. అయినప్పటికీ, ఇది స్టలిష్‌గానే ఉంటుంది. దీని వెనుక వైపు టెయిల్ ల్యాంప్ సగం బాడీపై, సగం వెనుక డోరుపై ఉంటుంది. ఈ స్ప్లిట్ డిజైన్ కొత్తగా అనిపిస్తుంది.

సైడ్ డిజైన్
నిస్సాన్ టెర్రానోను ఒక్కసారిగా సైడ్ నుంచి చూస్తే, చాలా వరకు డస్టర్ మాదిరిగానే అనిపిస్తుంది. అయినప్పటికీ, ఇందులో కొన్ని మార్పులున్నాయి. ఉదాహరణకు బ్లాక్ కలర్‌లో ఉండే బి, సి-పిల్లర్స్ (డస్టర్‌లో ఇవి బాడీ కలర్లో ఉంటాయి), సైడ్ మిర్రర్స్ మొదలైనవి చెప్పుకోవచ్చు.

రూఫ్ రెయిల్స్
నిస్సాన్ టెర్రానోకి కొత్త లుక్‌నివ్వడంలో రూఫ్ రెయిల్స్ కూడా కీలక పాత్రను పోషిస్తాయని చెప్పవచ్చు. ఇవి కారుకు కేవలం స్పోర్టీ లుక్‌ను ఇవ్వటానికే కాకుండా, కారుపైన లగేజ్‌ను ప్యాక్ చేసుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడుతాయి. డస్టర్‌లో మాదిరిగా కాకుండా, ఇవి పూర్తిగా డ్యూయెల్ కలర్ షేడ్‌లో ఉంటాయి.

స్టయిలిష్ అల్లాయ్ వీల్స్
నిస్సాన్ టెర్రానో లోని రెండు టాప్ ఎండ్ వేరియంట్లలో 16 ఇంచ్ డైమండ్-కట్ మెషీన్డ్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. విశిష్టమైన డిజైన్‌తో కూడిన ఈ అల్లాయ్ వీల్స్, టెర్రానోకు మరింత విశిష్టమైన లుక్‌ని కల్పిస్తాయి.

సైడ్ మిర్రర్స్
టెర్రానోలోని సైడ్ మిర్రర్స్ డ్యూయెల్ కలర్ ఆప్షన్‌తో (క్రింది భాగం బ్లాక్ కలర్‌లో పైభాగం బాడీ కలర్‌లో ఉంటుంది) లభిస్తాయి. అయితే, ఇవి టాప్ ఎండ్ వేరియంట్లకు మాత్రమే పరిమితం అయినట్లు తెలుస్తోంది. విడుదల తర్వాత దీనికి సంబంధించిన వివరాలు తెలిసే ఆస్కారం ఉంది.

ఇంటీరియర్
నిస్సాన్ టెర్రానో, రెనో డస్టర్ ఇంటీరియర్స్ ఇంచు మించు ఒకేలా అనిపిస్తాయి. అయితే, చిన్నపాటి మార్పులు ఉన్నాయనుకోండి. అందులో ముందుగా, విభిన్నమైన షేపులో ఉండే సెంట్రల్ ఎయిర్ వెంట్స్ (చుట్టూ క్రోమ్ కోటింగ్)ను ఇందులో గమనించవచ్చు.

స్టీరింగ్ వీల్
టెర్రానోలో 3-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది, దీనిపై సిల్వర్ ఫినిష్‌తో కూడిన ప్లాస్టిక్ భాగాలు ఉంటాయి. అయితే, విచారకరమైన అంశం ఏంటంటే, ఈ స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్ లేకుండా ప్లెయిన్‌గా ఉండటమే. కనీసం టాప్ ఎండ్ వేరియంట్లలో కూడా ఈ ఫీచర్ లేదు. భవిష్యత్తులో నిస్సాన్ ఈ దిశగా మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్టోరేజ్ స్పేస్
టెర్రానో డ్యాష్‌బోర్డ్ పైభాగంలో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, దీనికి ఓ లిడ్ (మూత) కూడా ఉంటుంది. డస్టర్‌లోని స్టోరేజ్ స్పేస్‌కు లిడ్ ఉండదు.

డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ థీమ్
నిస్సాన్ టెర్రానో బీజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌తో డ్యూయెల్ టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. డ్యాష్ బోర్డ్ పై భాగంలో బ్లాక్ కలర్, క్రింది భాగంలో బీజ్ కలర్ ఉంటుంది. అయితే, బేస్ వేరియంట్లో ఇది కేవలం బ్లాక్ కలర్ ఇంటీరియర్ థీమ్‌తో మాత్రమే లభిస్తుంది. టెర్రానోలోని ఆడియో సిస్టమ్ కూడా డస్టర్‌లోని ఆడియో సిస్టమ్ కన్నా భిన్నంగా ఉంటుంది.

విశాలమైన స్పేస్
టెర్రానోలో విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉంటుంది. ఇందులోని డ్రైవర్‌కు సౌకర్యవంతమైన లెగ్‌రూమ్ ఉంటుంది, ఫలితంగా దీన్ని నడిపేవారు (పొడవుగా ఉన్న వ్యక్తులైనా సరే) ఇబ్బందికి గురికారు. ఇందులోని డ్రైవర్ సీటుకు రెండు సెట్టింగ్స్ ఉంటాయి. ఈ కారు ఎత్తు డస్టర్ కన్నా తక్కువ ఉన్నప్పటికీ, హెడ్‌రూమ్ మాత్రం సౌకర్యంగానే అనిపిస్తుంది.

రియర్ సీట్స్
నిస్సానో టెర్రానో వెనుక సీట్ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇందులో ముగ్గురు పెద్దవాళ్లు హాయిగా కూర్చోవచ్చు. మరింత లగేజ్ స్పేస్ కావాలనుకుంటే, వెనుక సీట్లను ఫోల్డ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉంది.

డోర్స్‌పై సిల్వర్ ట్రిమ్స్
నిస్సానో టెర్రానో డోర్స్ లోపలి వైపు సిల్వర్ ఫినిషింగ్ మరియు క్రోమ్ ఇన్‌సైడ్ డోర్ హ్యాండిల్స్ మరింత ప్రీమియం లుక్‌నిస్తాయి. ప్రతి డోరుపై పవర్ విండో కంట్రోల్ స్విచ్, డోర్ మౌంటెడ్ స్పీకర్స్, మ్యాగజైన్ల కోసం డాక్స్ ఉంటాయి.

బూట్ స్పేస్
నిస్సాన్ టెర్రానో బూట్ స్పేస్ 475 లీటర్లు (సీట్ మడచక ముందు)గా ఉంటుంది. రెనో డస్టర్ బూట్ స్పేస్ కూడా ఇంతే ఉంటుంది. టెర్రానోలో వెనుక సీట్లను మడిచినట్లయితే, ఈ బూట్ స్పేస్ 1064 లీటర్లకు పెరుగుతుంది.

ఇంజన్
రెనో డస్టర్ మాదిరిగానే నిస్సాన్ టెర్రానో కూడా 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ కె9కె టర్బో డీజిల్ ఇంజన్ రెండు విభిన్న ట్యూనింగ్‌లతో (85 పిఎస్, 110 పిఎస్) లభిస్తుంది.

ట్రాన్సిమిషన్
ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌లతోనే లభ్యం కానున్నాయి. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ గురించి సమాచారం లేదు. టెర్రాన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ (2-వీల్ డ్రైవ్)తో లభిస్తుంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ కూడా విడుదల కావచ్చనే రూమర్లు ఉన్నాయి.

హ్యాండ్లింగ్
యాంత్రికంగా చూసుకుంటే, నిస్సాన్ టెర్రానో మరియు రెనో డస్టర్ రెండు ఒకేలా ఉంటాయి. టెర్రానోలో హైవేలపై వెళ్తున్నప్పుడు సౌకర్యవంతంగా అనిపిస్తుంది. డీజిల్ వెర్షన్‌లో టర్బో లాగ్ ఉన్నప్పటికీ, ఇంజన్ ఆర్‌పిఎమ్ మిడ్-రేంజ్‌ను తాకగానే ఈ టర్బో లాగ్‌ను మర్చిపోవచ్చు. హైస్పీడ్‌లో కూడా ఎలాంటి వైబ్రేషన్ లేకుండా ఉండేలా ఈ కారును అభివృద్ధి చేశారు.

మైలేజ్
నిస్సాన్ ఇండియా పేర్కొన్న సమాచారం ప్రకారం, 1.6 పెట్రోల్ వెర్షన్ టెర్రానో లీటరుకు 13.2 కి.మీ. మైలేజీని, 85పిఎస్ డీజిల్ వెర్షన్ టెర్రానో లీటరుకు 20.45 కి.మీ. మైలేజీని మరియు 110పిఎస్ డీజిల్ వెర్షన్ లీటరుకు 19.01 కి.మీ. మైలేజీస్తుంది. అయితే, వాస్తవిక పరిస్థితుల్లో ఇవి మారే ఆస్కారం ఉంటుంది.

అన్ని నిస్సాన్ టెర్రానో వేరియంట్లలో స్టాండర్డ్ లభించే ఫీచర్లు
నిస్సాన్ టెర్రానో మొత్తం ఐదు వేరియంట్లలో (ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్ఎల్ ప్లస్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం) లభిస్తుంది. వీటిలో లభ్యమయ్యే స్టాండర్డ్ ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి
* డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్
* ఇంజన్ ఇమ్మొబిలైజర్
* సెంట్రల్ లాకింగ్
* సీట్ బెల్ట్స్ (అన్ని సీట్లపై రీట్రాక్టర్లతో)
* పవర్ విండో
* కీలెస్ ఎంట్రీ
* పవర్ స్టీరింగ్ (టిల్ట్ ఫీచర్‌తో)
* ఫోల్డబిల్ రియర్ సీట్స్
* అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్ హెడ్‌రెస్ట్స్
* సిడి/ఎమ్‌పి3/ఏఎమ్/ఎఫ్ఎమ్/యూఎస్‌బి/ఆక్స్-ఇన్, బ్లూటూత్ సపోర్ట్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ 2 డిన్ ఆడియో సిస్టమ్ (ఎక్స్ఈ వేరియంట్లో మినహా)

ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం వేరియంట్లలో లభించే ఫీచర్లు
* 16 ఇంచ్ మెషీన్డ్ అల్లాయ్ వీల్స్
* రూఫ్ రెయిల్స్‌పై సిల్వర్ ఫినిషింగ్
* క్రోమ్ టిప్ప్‌డ్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్)
* లెథర్ సీట్ కవర్స్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ (ఎక్స్‌వి ప్రీమియం వేరియంట్లో మాత్రమే)
* లంబార్ సపోర్ట్
* ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్
* రియర్ పార్కింగ్ సెన్సార్స్
* ఇండిపెండెంట్ కంట్రోల్, సిగరెట్ లైటర్‌తో కూడిన రియర్ ఏసి వెంట్స్
* టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఆప్షనల్)

కలర్ ఆప్షన్స్
నిస్సాన్ టెర్రానో మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి..
* బ్రాంజ్ గ్రే
* పెరల్ వైట్
* బ్లేడ్ సిల్వర్
* సఫైర్ బ్లాక్
* స్టెర్లింగ్ గ్రే
* ఫైర్ రెడ్

ధర
నిస్సాన్ ఇండియా అధికారులు గడచిన ఆగస్ట్ నెలలో టెర్రానోను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ.. దీనిని రూ.10 లక్షలకు దిగువనే అందిస్తామని పేర్కొన్నారు. ఖచ్చితమైన ధర విడుదల తేదీన (అక్టోబర్ 9న) వెల్లడి కానుంది. ప్రస్తుతం నిస్సాన్ ఇండియా డీలర్లు ఈ ఎస్‌యూవీ కోసం సెప్టెంబర్ ఆరంభం నుంచే బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు.

చివరి మాట
డస్టర్ గురించి మంచిగా చెప్పుకునే అంశాలన్నీ టెర్రానోకు కూడా వర్తిస్తాయి. హైవేలపై నిస్సాన్ టెర్రానో పెర్ఫామెన్స్, సిటీ రోడ్లపై హ్యాండ్లింగ్ చక్కగా ఉంటుంది. కానీ, ధర విషయంలో ఇది డస్టర్ కన్నా సుమారు రూ.50,000 ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు చెల్లించే ఈ అదనపు మొత్తానికి తగిన విలువను ఫీచర్లు, ప్రీమియం లుక్ రూపంలో పొందవచ్చు. ఎక్కువగా సిటీ రైడ్ చేసే వారికి నిస్సాన్ టెర్రానో చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. అలాగే తక్కువ ధరలో స్టయిలిష్ ఆఫ్-రోడర్ కోరుకునే వారికి రెనో డస్టర్ మంచి ఆప్షన్ చెప్పవచ్చు.

మీ ఛాయిస్ ఏంటి..?
మరి రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో.. ఈ రెండింటిలో మీ ఛాయిస్ ఏంటి..?


Click it and Unblock the Notifications








