ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ (Tata Altroz DCA) రివ్యూ.. న్యాచురల్ ఇంజన్ ప్లస్ డిసిటి కాంబినేషన్ హిట్టా లేక ఫట్టా..?
భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేస్తున్న కంపెనీలలో టాటా మోటార్స్ (Tata Motors) ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్ తయారు చేస్తున్న కొత్త ఫర్ఎవర్ రేంజ్ ఉత్పత్తులు గ్లోబల్ సేఫ్టీ క్రాష్ టెస్టులలో మంచి స్కోర్‌ను దక్కించుకుంటున్నాయి. అలాంటి అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz). అంతేకాకుండా, ఇది ప్రస్తుతం దేశంలో లభిస్తున్న అత్యంత స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్‌లలో కూడా ఒకటిగా ఉంది.
కస్టమర్ ఒక ప్రీమియం కారులో ఏవైతే ఫీచర్లను ఆశిస్తారో కంపెనీ అలాంటి అన్ని ఫీచర్లను తమ టాటా ఆల్ట్రోజ్ కారులో అందించింది. అయితే, ఇందులో ఏదైనా లోటు ఉందంటే, అది ఈ కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేకపోవడమే. మొన్నటి వరకూ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఎవరైనా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కారును కోరుకుంటే, వారి విష్ లిస్ట్‌లో టాటా ఆల్ట్రోజ్ ఉండేది కాదు. అయితే, కంపెనీ ఇప్పుడు కొత్త టాటా ఆల్ట్రోజ్ డిసిఏ (Tata Altroz DCA) ని విడుదల చేయడంతో ఆ లోటు కాస్తా తీరిపోయింది. అవును, టాటా ఆల్ట్రోజ్ కారు ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా అందుబాటులోకి వచ్చింది.

టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ మొదటిసారి జనవరి 2020లో విడుదల చేసింది. ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20 వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు పోటీగా టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ కారును ప్రవేశపెట్టింది. ఆల్ట్రోజ్ దాని విశిష్టమైన డిజైన్ మరియు స్టైలింగ్‌తో పాటుగా ఆకర్షణీయమైన ఫీచర్లతో భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత జనవరి 2021లో టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‍తో వచ్చిన టాటా ఆల్ట్రోజ్, పవర్ మరియు పెర్ఫార్మెన్స్ కలయికతో కూడిన పంచీ ఇంజన్‌ను కోరుకునే యవ హృదయాలను కొల్లగొట్టింది. ఇది ఔత్సాహికులను ఉర్రూతలూగించింది మరియు విమర్శకుల నోటికి తాళాలు వేయించింది.

ఇప్పుడు మార్చి 2022లో టాటా ఆల్ట్రోజ్ డిసిఏ పేరుతో కంపెనీ ఓ ఆటోమేటిక్ వెర్షన్‌ను విడుదల చేసింది. కేవలం రూ.8.09 లక్షల ప్రారంభ ధరకే కంపెనీ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCA) గేర్‌బాక్స్‌తో కూడిన ఆల్ట్రోజ్ కారును ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో టాటా మోటార్స్ ఏం చేసినా సంచలనంగా మారుతోంది. కొత్తగా వచ్చిన ఆల్ట్రోజ్ డిసిఏ విషయంలోనూ అదే జరిగింది. ఈ ధర వద్ద ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్ డిసిఏ దేశంలోనే అత్యంత సరసమైన డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ కలిగిన ఆటోమేటిక్ కారుగా మారింది.

సాంప్రదాయ ఆటోమేటిక్ కార్లలో డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ (DCT) ఉంటుంది, కానీ తమ కారులో మాత్రం డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCA) గేర్‌బాక్స్ ఉంటుందని, ఇది డిసిటి కన్నా ఎన్నో రెట్లు మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. మరి ఇది ఎంత వరకూ నిజం? స్టాండర్డ్ మ్యాన్యువల్ ఆల్ట్రోజ్ కారుకి ఈ డిసిఏ ఆటోమేటిక్ ఆల్ట్రోజ్ కారుకి మధ్య ఏవైనా తేడాలు ఉన్నాయా? అసలు ఈ DCA గేర్‌బాక్స్ ప్రత్యేకత ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలను వెతికేందుకు మేము టాటా ఆల్ట్రోజ్ డిసిఏ (Tata Altroz DCA) కారుని ఒక రోజంతా నడిపి చూశాం. ఇందులో మేము గుర్తించింది ఏంటంటే...

Tata Altroz DCA: డిజైన్ మరియు స్టైలింగ్
ఇదివరకు టాటా ఆల్ట్రోజ్ కారుని చూసిన వారు, ఇప్పుడు కొత్తగా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ కారుని చూసినట్లయితే ఈ రెండు మోడళ్ల మధ్య తేడాలను అస్సలు గుర్తించలేరు. మొదటి చూపులో ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో నడిచే స్టాండర్డ్ ఆల్ట్రోజ్ మాదిరిగానే కనిపిస్తుంది. వెనుక వైపు నుండి ఈ రెండు మోడళ్ల మధ్య డిసిఏ (DCA) బ్యాడ్జ్ మినహా వేరే మార్పులు ఏమీ లేవు. ఈ బ్యాడ్జ్ ఒక్కటే, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆల్ట్రోజ్ కార్లను వేరు చేసే ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక మిగతాదంతా సేమ్ టూ సేమ్.

టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ కారును యూరోపియన్ డిజైన్ లాంగ్వేజ్‌తో తయారు చేసింది. ఈ కారు మార్కెట్లోకి వచ్చి దాదాపు రెండేళ్లు దాటినా కూడా కస్టమర్లకు దీని డిజైన్ బోర్ కొట్టలేదు. ఈ మోడల్ నెలవారీ అమ్మకాలే ఇందుకు నిదర్శనం. ఆల్ట్రోజ్ డిజైన్ మరియు స్టైలింగ్ ఎప్పటికీ రిఫ్రెషింగ్‌గానే కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లు వీటన్నింటినీ కూడా ఒకే యూనిట్‌లో చాలా చక్కగా అమర్చారు. ఈ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ కారు ముందు భాగానికి ప్రత్యేకమైన స్టైలింగ్‌ను జోడిస్తుంది. హెడ్‌లైట్ సెటప్ క్రింద బంపర్ ఎగువ భాగంలో, ఎత్తులో అమర్చిన ఫాగ్ ల్యాంప్స్, ఈ కారు స్టైలింగ్‌ను పెంచడమే కాకుండా, రాత్రివేళల్లో సేఫ్టీని కూడా పెంచుతాయి.

ముందు వైపు బానెట్‌ను ఆనుకుని ఉన్నట్లుగా ఉండే ఫ్రంట్ గ్రిల్ మరియు దాని మధ్యలో అమర్చబడిన టాటా లోగో, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌తో కూడిన చంకీ ఫ్రంట్ బంపర్ మరియు బానెట్‌పై ఉండే మజిక్యులర్ బాడీ లైన్స్‌తో ఇది ముందు వైపు నుండి చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఫస్ట్ డ్రైవ్ కోసం టాటా మోటార్స్ మాకు అందించిన ఆల్ట్రోజ్ డిసిఏ ఆటోమేటిక్ కారు కొత్త ఓపెరా బ్లూ (Opera Blue) కలర్‌లో పెయింట్ చేయబడి ఉంది. ఆల్ట్రోజ్ కారులో ఇప్పటి వరకూ ఇలాంటి ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్ లేదు, ఇది కొత్తగా పరిచయం చేయబడిన కలర్ ఆప్షన్. మిరిమిట్లుగొలిపే ఓపెరా బ్లూ కలర్ పెయింట్ ఆల్ట్రోజ్ యొక్క స్పోర్టీ వైఖరికి ఖచ్చితంగా మరింత వన్నె తెచ్చిపెడుతుంది.

ఫ్రంట్ డిజైన్ నుండి సైడ్ డిజైన్‌కు వస్తే, ఇక్కడ ప్రధానంగా మన దృష్టిని ఆకట్టుకునేది ఇందులోని కొత్త 16 ఇంచ్ డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్. స్టైలిష్ డిజైన్‌లో ఉండే ఈ అల్లాయ్ వీల్స్ కారుకి మరింత స్పోర్టీ అండ్ ప్రీమియం లుక్‌ని అందిస్తాయి. ఇది డ్యూయెల్ టోన్ వెర్షన్ కావడంతో దీని రూఫ్ బ్లాక్ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది. ఈ బ్లాక్ అండ్ బ్లూ థీమ్‌ని మరింత విస్తరించేందుకు కంపెనీ ఈ కారులోని సైడ్ మిర్రర్లను మరియు ఏ, బి, సి పిల్లర్లను కూడా బ్లాక్ కలర్‌లోనే ఫినిష్ చేసింది. ఆల్ట్రోజ్ డిసిఏ సింగిల్-టోన్ మరియు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

ఇక వెనుక భాగంలో డిజైన్ విషయానికి వస్తే, కంపెనీ ఇందులోని రియర్ స్పాయిలర్ మరియు టెయిల్ గేట్ పైభాగాన్ని కూడా నలుపు రంగులోనే ఫినిష్ చేసింది. ఇంకా ఇందులో స్ప్లిట్ వ్రాప్-అరౌండ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కారు వెనుక భాగానికి మరింత స్పోర్టీ రూపాన్ని జోడిస్తాయి. టెయిల్ గేట్‌పై Altroz మరియు DCA బ్యాడ్జింగ్‌తో పాటు టాటా బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. మొత్తమ్మీద, ఈ కారు వెనుక భాగం టాటా ఆల్ట్రోజ్ స్పోర్టీనెస్‌కు సరిపోయే అద్భుతమైన మరియు స్టైలిష్ లుక్‌ని అందిస్తుంది.

Tata Altroz DCA: క్యాబిన్, ఇంటీరియర్స్
టాటా వాహనాలు మంచి విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్‌ను కలిగి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా, టాటా ఆల్ట్రోజ్ కూడా విశాలమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. ఆల్ట్రోజ్ డోర్ హ్యాండిల్స్‌ని లాగి తలుపు తెరిచినప్పుడు ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారు డోర్లు 90-డిగ్రీల వరకూ తెరచుకుంటాయి, ఫలితంగా కారులోకి ప్రవేశించడం కానీ లేదా కారు లోనుండి బయటకు రావడం కానీ చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. కారు లోపల ఇంటీరియర్ మొత్తం బ్లాక్ అండ్ బేజ్ కలర్ డ్యూయెల్ టోన్ థీమ్‌లో కనిపిస్తుంది. ఇందులో ఎక్కువగా బేజ్ కలర్ డామినేట్ చేస్తుంది.

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఏసి వెంట్స్, గేర్‌బాక్స్ ఏరియా, ఫ్రంట్ విండ్‌షీల్డ్ బ్లోవర్ ఏరియా మరియు డోర్ ట్రిమ్స్‌పై బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే, స్టీరింగ్ వీల్, ఏసి వెంట్స్, గేర్‌నాబ్, సెంటర్ కన్సోల్ మరియు డోర్ ట్రిమ్స్‌పై ఉండే స్మోకీ సిల్వర్ ట్రిమ్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి మరియు కారు లోపలి భాగానికి మరింత ప్రీమియం అప్పీల్‌ను అందిస్తాయి. డ్యాష్‌బోర్డు మధ్య భాగంలో పాప్అప్ స్క్రీన్ మాదిరిగా కనిపించే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ హార్మన్ బ్రాండ్‌కి చెందినది మరియు ఇది Apple CarPlay, Android Auto వంటి లేటెస్ట్ కనెక్టింగ్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

అయితే, ఇందులో కాస్తంత ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లోని ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్‌ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్లను మీ స్మార్ట్‌ఫోన్ సాయంతో యాక్సెస్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా మీరు వైరు ద్వారా మీ ఫోనును కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో వెర్‌లెస్ అండ్రాయిడ్ ఆటో లేదా వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే ఫీచర్ లేదు. అయితే, ఈ సిస్టమ్‌తో మీ ఫోన్‌ను కనెక్ట్ చేయడానికి మాత్రం మీరు ఇందులోని బిల్ట్-ఇన్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

కారులోని ఎయిర్ కండిషనింగ్‌ను కంట్రోల్ చేయడం వంటి కొన్ని ఇతర పనుల కోసం కూడా ఈ టచ్‌స్క్రీన్‌ని ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడం చాలా సులభం. అయితే, ఇది సహజమైన టచ్ ప్రతిస్పందనను కలిగి ఉండదు, దీనిపై వేలితో స్క్రీన్‌ను క్రిందికి స్క్రోల్ చేయడం కాస్తంత ఇ్బబందిగా అనిపించవచ్చు. ప్రీమియం ఆడియో క్వాలిటీ కోసం ఇందులో 8 స్పీకర్లతో కూడిన హార్మాన్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. ఇది దాని డిఫాల్ట్ EQ సెట్టింగ్ మరియు అందుబాటులో ఉన్న ప్రీసెట్‌లలో, స్పీకర్ల నుండి వచ్చే శబ్ధం మాంచి థ్రిల్లింగా అనిపిస్తుంది. ఈ ఆడియో సిస్టమ్‌ను మీ అభిరుచికి తగినట్లుగా ట్యూన్ చేసుకుంటే, మీ మెడ దానంతట అదే నాట్యం చేయడం మొదలుపెడుతుంది.

ఇక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింది భాగాన్ని పరిశీలిస్తే, కారులోని ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ మరియు క్లైమేట్ కంట్రోల్‌ను నియంత్రించడానికి కొన్ని భౌతిక కంట్రోల్ బటన్స్ కూడా ఉంటాయి. టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో వస్తుంది మరియు ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో ఇది చాలా అవసరమైన ఫీచర్‌గా ఉంటుంది. ఈ వేసవిని చల్లగా మార్చడం కోసం కంపెనీ ఈ కారులో ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దాని పేరే "ఎక్స్‌ప్రెస్ కూల్". కారులో ఈ బటన్‌ను నొక్కగానే టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్‌గా ఫ్రండ్ విండోలను కొద్దిగా దించి, పూర్తి వేగంతో ఎయిర్ కండిషనింగ్‌ను ఆన్ అయ్యేలా చేస్తుంది.

ఎక్స్‌ప్రెస్ కూల్ ఫీచర్ వలన కారులోని వేడిగాలి బయటకుపోయి, క్యాబిన్ త్వరగా కూల్ అవుతుంది. మేము ఈ హ్యాచ్‌బ్యాక్‌ను మండుటెండలో టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, చాలాసార్లు ఈ ఫీచర్‌ని ఉపయోగించి చూశాము, ప్రతిసారి కూడా ఇది చాలా వేగంగా క్యాబిన్‌ను కూల్ చేయడంలో సహకరించింది. ఇకపోతే, ఇందులో డ్రైవర్ మోకాలి వద్ద ఓ చిన్న స్టోరేజ్ పాకెట్ ఉంటుంది, ఇది చూడటానికి వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ యూనిట్ మాదిరిగా అనిపిస్తుంది. కానీ, ఆల్ట్రోజ్ కారులో కంపెనీ అలాంటి ఫీచర్‌ను అందించడం లేదనుకోండి. ఇక, ఇందులోని ట్రైయారో ప్యాటర్న్‌తో కూడిన గేర్‌నాబ్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది.

కారులోని సీట్లు మొత్తం ఫ్యాబ్రిక్‌తో తయారు చేయబడ్డాయి మరియు ఇవి నలుపు రంగులో బేజ్ కలర్ స్టిచింగ్‌తో ఉంటాయి. ఇవి వెంటిలేటెడ్ సీట్లు మరియు ఈ సీట్లపై కూడా టాటా మోటార్స్ యొక్క సిగ్నేచర్ ట్రై-యారో ప్యాటర్న్స్ కనిపిస్తాయి. దీని విశిష్టమైన డ్యాష్‌బోర్డ్ డిజైన్ కారణంగా, కారులో కూర్చున్న డ్రైవర్‌కి ముందున్న రోడ్డు మరియు మార్జిన్ చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ఇందులో మరొక ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే, దాని ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్. దీనిపై ఆడియో కంట్రోల్స్, ఫోన్‌కాల్స్ కోసం టెలిఫోన్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ బటన్ మరియు వాయిస్ అసిస్ట్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడం కోసం ప్రత్యేకమైన బటన్ వంటి చాలా కంట్రోల్స్ ఉంటాయి. అయితే, ఈ స్టీరింగ్ వీల్‌పై బటన్‌ల అమరిక మరింత మెరుగ్గా ఉండవచ్చనేది మా అభిప్రాయం.

స్టీరింగ్ వీల్‌పై ఉండే వాయిస్ అసిస్టెంట్ బటన్‌ను నొక్కి కొన్ని సందేశాలు ఇవ్వడం ద్వారా కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ యొక్క సౌండ్‌ను తగ్గించడం లేదా పెంచడం, అలాగే ఎయిర్ కండిషనింగ్ యొక్క టెంపరేచర్‌ను తగ్గించడం లేదా పెంచడం మొదలైనవి చేయవచ్చు. కాకపోతే, ఇందులో మరిన్ని అదనపు వాయిస్ కమాండ్‌లు కూడా అందుబాటులో ఉంటే బాగుండనేది మా అభిప్రాయం. ఇక స్టీరింగ్ వీల్ వెనుక దాగి ఉన్న అనలాగ్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే, ఇది చాలా వెడల్పుగా ఉంటుంది మరియు డ్రైవర్‌కు అవసరమైన సమాచారం మొత్తాన్ని చాలా సింపుల్‌గా మరియు అందరికీ అర్థమయ్యేలా చూపుతుంది. ఓవరాల్‌గా ఆల్ట్రోజ్ ఇంటీరియర్ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది.

Tata Altroz DCA: ప్రాక్టికాలిటీ, కంఫర్ట్ మరియు బూట్ స్పేస్
టాటా మోటార్స్ తయారు చేస్తున్న ఫరెవర్ శ్రేణి కార్లు ఎల్లప్పుడూ ఆచరణాత్మకంగా మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రస్తుతం, టాటా ఇంజనీర్‌లు ఏదైనా ఒక కొత్త కారును నిర్మించేటప్పుడు, అందులో క్యాబిన్ స్పేస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. టాటా ఆల్ట్రోజ్‌లో కూడా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సెంటర్ కన్సోల్‌లో గేర్ లివర్ వెనుక రెండు కప్ హోల్డర్‌లు ఉంటాయి మరియు సెంటర్ కన్సోల్ చివరిలో స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ కూడా ఉంటుంది. ఈ ఆర్మ్‌రెస్ట్‌ని పైకి ఎత్తగానే అందులో అదనపు స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది. ఇందులో వాలెట్ వంటి చిన్నపాటి వస్తువులను స్టోర్ చేసుకోవచ్చు.

అయితే, సెంటర్ కన్సోల్‌లోని ఈ ఆర్మ్‌రెస్ట్ స్టోరేజ్ స్పేస్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది, ఇందులో ఓ 6 ఇంచ్ స్మార్ట్ ఫోన్ కూడా సరిగ్గా ఇమడదు. ఏదైమనప్పటికీ, ఆల్ట్రోజ్ విషయంలో డిజైనర్లు స్టోరేజ్ స్పేస్‌ను చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారని చెప్పవచ్చు. డ్రైవర్ సైడ్ డోర్ వైపు డాష్‌బోర్డ్‌లో చాలా లోతైన స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అలాగే, ప్రతి డోరులో కూడా వస్తువులను నిల్వ చేయడానికి పెద్ద డోర్ పాకెట్ ఉంటుంది మరియు నాలుగు డోర్లపై 1 లీటర్ వాటర్ బాటిల్‌ను స్టోర్ చేసుకునే బాటిల్ హోల్డర్స్ కూడా ఉంటాయి.

ఈ కారులోని సీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఇందులోని ముందు వైపు ఉన్న రెండు సీట్లు కూడా మంచి సౌకర్యాన్ని అందిస్తాయి. సీట్లు చాలా మృదువైనవిగా మరియు మంచి కుషనింగ్‌ను కలిగినవిగా ఉంటాయి. కాబట్టి, ఇవి చిన్నపాటి సిటీ ప్రయాణాలకైనా సరే లేదా సుదూర ప్రయాణాల కోసం అయినా సరే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వెనుక సీట్లు మాత్రం కాస్తంత గట్టిగా అనిపిస్తాయి. ఇక కారులోని నీరూమ్ (మోకాలి వద్ద స్థలం), లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి.

వెనుకవైపు ఉన్న ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్ కూడా ఉంటాయి. ఇవి కారు ముందు నుండి వచ్చే సెంటర్ కన్సోల్ చివరి భాగంలో అమర్చబడి ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ రియర్ ఏసి వెంట్స్ ద్వారా గాలి ప్రవాహాన్ని మరియు అది వీచే దిశను కూడా కంట్రోల్ చేయడానికి కంట్రోలర్స్ ఉంటాయి. ఈ ఏసి వెంట్స్‌కు దిగువన వెనుక సీటులోని ప్రయాణీకుల సౌకర్యార్థం ఓ 12 వోల్ట్ పవర్ అవుట్‌లెట్ కూడా ఉంటుంది. ఇది వెనుకవైపు కూర్చున్న ప్రయాణీకులు తమ గాడ్జెట్‌లను చార్జ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇక చివరిగా బూట్ స్పేస్ విషయానికి వస్తే, టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఈ సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద 345 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

Tata Altroz DCA: ఇంజన్ పనితీరు మరియు డ్రైవింగ్ అనుభూతి
ఇక అతి ముఖ్యమైన ఘట్టం, టాటా ఆల్ట్రోజ్ డిసిఏ కారులోని ఇంజన్ పనితీరు మరియు అది అందించే డ్రైవింగ్ అనుభూతి విషయానికి వస్తే, ఆల్ట్రోజ్ డిసిఏ భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత ప్రత్యేకమైన కార్లలో ఒకటిగా నిలుస్తుంది. ఎందుకంటే, ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉన్న ఏకైక కారు. ప్రస్తుతం, మార్కెట్‌లో లభిస్తున్న అనేక ఇతర డిసిటి ఆటోమేటిక్ కార్లు దాదాపుగా టర్బోచార్జ్డ్ ఇంజన్‌లతోనే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, ఆల్ట్రోజ్ డిసిఏ మాత్రం ఈ ప్రత్యేకమైన కలయికతో ఈ విభాగంలోనే ఓ ప్రత్యేకమైన కారుగా నిలుస్తుంది.

మరి న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు డిసిఏ కలయికతో వచ్చిన ఆల్ట్రోజ్ డిసిఏ పెర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉంటుంది అంటే.. ఇందులోని 1.2-లీటర్ రెవోట్రాన్ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 84.8 బిహెచ్‌పి శక్తిని మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవేమీ పెద్దగా చెప్పుకోదగిన గణాంకాలు కావు కాబట్టి, మేము కూడా ఈ కారు నుండి అంత గొప్ప పనితీరును అయితే ఆశించలేదు. అయితే, ఇది మమ్మల్ని పూర్తిగా నిరాశ పరచలేదనుకోండి.

కారు లోనికి ప్రవేశించి పుష్ బటన్ స్టార్ట్ చేయగానే, మీకు ఇందులోని 3-సిలిండర్ ఇంజన్ ఓ విలక్షణమైన శబ్ధంతో స్వాగతం పలుకుతుంది. ఆల్ట్రోజ్ డిసిఏ కొన్ని ప్రత్యేకమైన సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది, కాబట్టి తొలిసారిగా మీరు ఈ కారును స్టార్ట్ చేస్తున్నట్లయితే, ఇందులోని ఆ స్పెషల్ సేఫ్టీ ఫీచర్స్ ఏమిటి ముందుగానే తెలుసుకోవడం మంచిది. టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఆటో పార్క్ లాక్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇది కారు అనుకోకుండా ముందుకు కదలడాన్ని నివారించే ఓ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్.

ఈ ఫీచర్‌ను పరీక్షించడానికి మేము కారును కొంచెంసేపు ఆన్‌లో ఉంచి, గేర్‌బాక్స్‌ను న్యూట్రల్‌లో వదిలి, డ్రైవర్ సైడ్ తలుపును తెరిచాము. ఆ వెంటనే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లేపై 'ఆటో పార్క్ యాక్టివేట్ చేయబడింది' అని ఒక మెసేజ్ వచ్చింది. అంటే, కారు తటస్థంగా ఉన్నప్పుడు డోరు తీయగానే డ్రైవర్ కారు నుండి దిగుతున్నట్లు ఈ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్‌గా గుర్తించింది మరియు కారును ముందుకు కదలకుండా ఉంచేందుకు ఆటోమేటిక్‌గా పార్క్ మోడ్‌ను ఎంగేజ్ చేసింది. నిజంగా, చాలా తెలివైన ఫీచర్. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మరియు మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతో తయారు చేయబడిన ఓ గొప్ప ఫీచర్ ఇది.

ఇక ఇప్పుడు, ఇందులోని కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పరీక్షించే సమయం ఆసన్నమైంది. గేర్ నాబ్‌ను సింపుల్‌గా డ్రైవ్ మోడ్‌లోకి నెట్టగానే, టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఎలాంటి డ్రామా లేకుండా సులువుగా ముందుకు సాగిపోతుంది. ఇది నిశ్శబ్దంగా ఉంటుంది మరియు రద్దీగా ఉండే మన సిటీ ట్రాఫిక్‌లో ఈ గేర్‌బాక్స్ ఒక గొప్ప వరం కానుంది. ఆల్ట్రోజ్ కారులో ఉపయోగించిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఒక 6-స్పీడ్ డిసిటి యూనిట్, ఇది కూడా ప్రత్యేకమైనదే. ఎందుకంటే, మార్కెట్లోని చాలా వరకూ డిసిటి గేర్‌బాక్స్‌లు 7-స్పీడ్ యూనిట్ రూపంలో ఉంటాయి. ఆల్ట్రోజ్ డిసిఏలో తగ్గిన ఆ ఒక్క గేర్ కారణంగా, ఇది మెరుగైన మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ సరికొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో తక్కువ కదిలే భాగాల కారణంగా, గేర్ షిఫ్ట్ నాణ్యత మెరుగ్గా ఉంటుందని మరియు ఈ గేర్‌బాక్స్ యూనిట్ మరింత విశ్వసనీయంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. కొత్త Tata Altroz DCA గేర్‌బాక్స్ యొక్క జీవితకాలాన్ని పెంచేందుకు ఇది సెల్ఫ్-డస్ట్ రిమూవల్ టెక్నాలజీతో వస్తుంది. అధిక వేగం (ఫుల్ థ్రోటల్)తో కారును నడుపుతున్నప్పుడు కన్నా తక్కువ వేగంతో నడుపుతున్నప్పుడు ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందించేలా ఈ యూనిట్‌ని తయారు చేశారు. ఇక కారును M (మ్యాన్యువల్) మోడ్‌లో నడపడం మరింత సరదాగా అనిపిస్తుంది.

మ్యాన్యువల్ మోడ్‌లో గేర్‌బాక్స్ డౌన్‌షిఫ్ట్‌ల కారణంగా ఇంజన్ వేగం పెరుగుతుంది. ఈ మోడ్‌లో, గేర్‌షిఫ్ట్‌లు చాలా త్వరగా ఉంటాయి తద్వారా క్విక్ యాక్సిలరేషన్ లభిస్తుంది. కొత్త గేర్‌బాక్స్‌ను టాటా మోటార్స్‌లోని బోఫిన్‌లు చాలా చక్కగా రూపొందించారు. ఇది అన్ని డిసిటి గేర్‌బాక్స్‌లలో సాధారణమైన రెండు లే షాఫ్ట్‌లకు బదులుగా ఒకే లేషాఫ్ట్‌ను పొందుతుంది. ఫలితంగా, గేర్‌బాక్స్ లోపల తక్కువ కదిలే భాగాలు ఉంటాయి. ఓవరాల్‌గా ఈ గేర్‌బాక్స్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కాకపోతే, ఇది న్యాచులర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో జతచేయబడిన కారణంగా, దాని పనితీరు ఓకే ఓకేగా ఉంటుంది. అదే, టాటా మోటార్స్ ఈ గేర్‌బాక్స్‌ను ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్‌తో అందించినట్లయితే, ఇది చాలా సమర్థవంతంగా ఉంటుందనేది మా అభిప్రాయం.

టాటా ఆల్ట్రోజ్ కారులో కంపెనీ ఓ టర్బో వేరియంట్‌ను కూడా అందిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 108.5 బిహెచ్‌పిల శక్తిని మరియు 140 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. న్యాచురల్ ఇంజన్ గణాంకాల కన్నా ఈ టర్బో ఇంజన్ గణాంకాలు చాలా పవర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. అయితే, ఇది కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఆల్ట్రోజ్ డిసిఏ కారులో కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించిన పనితీరులో వ్యత్యాసం మినహా, మిగతా అన్ని విషయాలలో ఇది స్టాండర్డ్ మ్యాన్యువల్ పెట్రోల్ ఆల్ట్రోజ్ మాదిరిగానే ఉంటుంది. ఇందులోని సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సెటప్ కూడా మెరుగ్గా అనిపిస్తుంది.

కాకపోతే, ఇందులోని టైర్ల ఎంపిక మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది. కంపెనీ ఇందులో గుడ్‌ఇయర్ ట్రిపుల్‌మాక్స్ 3 టైర్లను అందిస్తోంది, రోడ్డుపై ఇవి చాలా గ్రిప్పీగా అనిపించవు. కాబట్టి, అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఇది మీ విశ్వాసాన్ని చిన్న మార్జిన్‌తో తగ్గించే అవకాశం ఉంటుంది. మరి సేఫ్టీ పరంగా టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఎలా ఉంటుందో చూద్దాం రండి.

Tata Altroz DCA: సేఫ్టీ ఫీచర్లు
ఇదివరకు చెప్పుకున్నట్లు టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో కూడా ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ కారులో లభించే సేఫ్టీ ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఆల్ఫా ఆర్కిటెక్చర్ మరియు ఎనర్జీ అబ్సార్బింగ్ బాడీ స్ట్రక్చర్
- యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- బ్రేక్ స్వే కంట్రోల్
- ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్
- డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు
- ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్స్
- వాయిస్ హెచ్చరికలు
- iTPMS
- పార్కింగ్ అసిస్ట్
- ఆటో పార్క్ లాక్

Tata Altroz DCA: హైలైట్ ఫీచర్లు
- iRA కనెక్టివిటీ సూట్
- 7.0 ఇంచ్ హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్
- ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే
- వాయిస్ ఆదేశాలు
- ఎక్స్‌ప్రెస్ కూల్
- ఆటో హెడ్‌ల్యాంప్‌లు
- రెయిన్ సెన్సింగ్ వైపర్స్
- క్రూయిజ్ కంట్రోల్
- 7 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

Tata Altroz DCA: వేరియంట్‌లు
- టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఎక్స్ఎమ్ఏ ప్లస్ : రూ. 8,09,900
- టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఎక్స్‌టిఏ : రూ. 8,59,900
- టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఎక్స్‌టిఏ డార్క్ : రూ. 9,05,900
- టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఎక్స్‌జెడ్ఏ : రూ. 9,09,900
- టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఎక్స్‌జెడ్ఏ (ఆప్షనల్) : రూ. 9,21,900
- టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ : రూ. 9,59,900
- టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ డార్క్ : రూ. 9,89,900
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

Tata Altroz DCA: కలర్ ఆప్షన్లు
- కాస్మో డార్క్
- ఓపెరా బ్లూ
- డౌన్‌టౌన్ రెడ్
- ఆర్కేడ్ గ్రే
- అవెన్యూ వైట్
- హార్బర్ బ్లూ
(ఇందులో ఓపెరా బ్లూ అనేది డిసిఏ ఆటోమేటిక్ కారుతో పాటుగా ప్రవేశపెట్టబడిన కొత్త కలర్ ఆప్షన్)

Tata Altroz DCA: చివరిగా ఏం చెబుతారు?
ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రాకముందు నుంచే టాటా ఆల్ట్రోజ్ ఓ మంచి ఫన్ టూ డ్రైవ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఉంది. కాగా, ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చిన డిసిఏ గేర్‌బాక్స్ సాయంతో ఇది మరింత స్పోర్టీ కారుగా మారింది. కాబట్టి, సరసమైన ధరకే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన హ్యాచ్‌బ్యాక్ కోసం మార్కెట్లో వెతుకుతున్న వారికి టాటా ఆల్ట్రోజ్ ఓ చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. ఒకవేళ, టాటా మోటార్స్ రానున్న రోజుల్లో ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్‌లో కూడా ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించినట్లయితే, ఇది మరింత స్పోర్టీ వెర్షన్ ఆటోమేటిక్ కారుగా మారే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








