భారత్‌లో లభిస్తున్న టాప్ బెస్ట్ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్స్
నిత్యం రద్దీగా ఉండే సిటీ రోడ్లపై తరచూ గేర్లు మార్చుకుంటే కారు నడపటం అంటే ఎవ్వరికైనా మహా చెడ్డ చిరాకుగా అనిపిస్తుంది. ఇలా నడపటం వలన కారు మైలేజ్ కూడా తగ్గుతుంది. మరి ఇందుకు ప్రత్యామ్యాన్యాయం లేదా అంటే, ఎందుకు లేదు.. ఎంచక్కగా ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన కార్లను కొనుగోలు చేయటమే. ఈ ఆటోమేటిక్ కార్లలో మన తరచు గేర్లు మార్చే అవసరం లేదు.
డ్రైవ్ మోడ్‌లో గేర్‌ను ఉంచి ఎంతదూరమైన చికాకు లేకుండా కారును నడపొచ్చు. వాస్తవానికి, మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలిగిన కార్లు ఇచ్చే మైలేజీతో పోల్చుకుంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన కార్లు ఇచ్చే మైలేజ్ తక్కువగా ఉంటుంది. కానీ ప్రత్యేకించి, సిటీ రోడ్లను పరిగణలోకి తీసుకుంటే, వీటిపై మ్యాన్యువల్/ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన కార్లు ఇచ్చే మైలేజ్ ఇంచు మించు సమానంగానే ఉంటుంది.
అయితే, మన మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? వాటిలో ఏది ఎక్కువ మైలేజీనిస్తుంది? వాటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అన్ని కార్ల ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీకి చెందినవి మరియు మైలేజ్ గణాంకాలు ఏఆర్ఏఐ సర్టిఫై చేసినవి. ఈ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌లను ఫీచర్లు, ధర, మైలేజ్ అంశాలను ఆధారంగా చేసుకొని పోల్చడం జరిగింది.

మారుతి సుజుకి రిట్జ్
రిట్జ్ ఆటోమేటిక్ కేవలం విఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. సరసమైన ధరకే బెస్ట్ బ్రాండెడ్ ఆటోమేటిక్ కారును కొనాలనుకునే వారికి రిట్జ్ ఫస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. విస్తృతమైన మారుతి నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్మూత్‌గా పనిచేస్తుంది. హైవేలో దీని పెర్ఫామెన్స్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఇందుకు కారణం 5వ గేర్ లేకపోవటమే. విఎక్సఐ వేరియంట్లో ఏబిఎస్, ఈబిడి, పవర్ విండోస్, టిల్ట్ స్టీరింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. కాకపోతే ఇందులో స్టీరియో ఉండదు.

మారుతి సుజుకి రిట్జ్
ధర: రూ.6.19 లక్షలు
గేర్ బాక్స్: 4-స్పీడ్ ఆటోమేటిక్
మైలేజ్: 17.16 కెఎమ్‌పిఎల్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
ఈ సెగ్మెంట్లో లేటెస్ట్‌గా వచ్చిన హ్యుందాయ్ మోడల్ గ్రాండ్ ఐ10. ఇది ఐ10 కన్నా బెస్ట్ సిటీ కార్. ఇందుకు ప్రధాన కారణం దీని విశాలమైన ఇంటీరియర్ స్పేస్ మరియు బెస్ట్ ఇన్ క్లాస్ ఫిట్ అండ్ ఫినిష్. ఐ20 కారులో ఉపయోగించిన ఆటోమేటిక్ గేర్ బాక్సునే ఇందులోను ఉపయోగించారు. కానీ, సేఫ్టీ ఫీచర్లతో పోల్చుకుంటే గ్రాండ్ ఐ10 కన్నా రిట్జ్ కారే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే, గ్రాండ్ ఐ10 టాప్ ఎండ్ వేరియంట్లో సైతం ఏబిఎస్, ఈబిడి వంటి సేఫ్టీ ఫీచర్లు లేకపోవటమే. గ్రాండ్ ఐ10 రెండు వేరియంట్లలో లభిస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
ధర: రూ.5.95 లక్షలు (స్పోర్ట్స్), రూ.6.23 లక్షలు (ఆస్టా)
గేర్ బాక్స్: 4-స్పీడ్ ఆటోమేటిక్
మైలేజ్: 18.9 కెఎమ్‌పిఎల్

హోండా బ్రియో
ఓ మంచి సిటీ ఆటోమేటిక్ కారుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు బ్రయోకి ఉన్నాయని చెప్పవచ్చు. కాంపాక్ట్ డిజైన్, స్మూత్ హ్యాండ్లింగ్, 5-స్పీడ్ గేర్ బాక్స్ అన్నింటికి మించి జపనీస్ హోండా ఇంజన్ వంటి అంశాలను బ్రియో ఆటోమేటిక్‌లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీని 5-స్పీడ్ గేర్ బాక్స్ వలన ఇది హైవేలపై రిట్జ్, గ్రాండ్ ఐ10 కన్నా బెస్ట్ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇంకా ఇందులో ఏబిఎస్, ఈబిడి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

హోండా బ్రియో
ధర: రూ.6.12 లక్షలు
గేర్ బాక్స్: 5-స్పీడ్ ఆటోమేటిక్
మైలేజ్: 18.9 కెఎమ్‌పిఎల్

హ్యుందాయ్ ఐ20
ప్రీమియం ఫీచర్లతో కూడిన ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కోరుకునే వారికి హ్యుందాయ్ ఐ20 బెస్ట్ అని చెప్పొచ్చు. దీని యూరోపియన్ డిజైన్, బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్, విశాలమైన ఇంటీరియర్ స్పేస్ ఈ కారులోని ప్రత్యేకతలు. సిటీ రోడ్లపై సౌకర్యవంతంగా, విలాసవంతంగా ప్రయాణించడానికి ఇది అనువుగా ఉంటుంది. కానీ దీని 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ వలన ఇది హైవేపై అండర్ పెర్ఫామెన్స్ అనిపిస్తుంది.

హ్యుందాయ్ ఐ20
ధర: రూ.7.88 లక్షలు
గేర్ బాక్స్: 4-స్పీడ్ ఆటోమేటిక్
మైలేజ్: 15.04 కెఎమ్‌పిఎల్

నిస్సాన్ మైక్రా
సిటీలో మంచి మైలేజీనిచ్చే ఆటోమేటిక్ కారు కోరుకునే వారికి నిస్సాన్ మైక్రా ఓ చక్కటి ఆప్షన్. ఇందులోని సివిటి (కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్ బాక్స్ అత్యుత్తమ మైలేజీని ఆఫర్ చేస్తుంది (ఈ తరహా గేర్ బాక్స్‌ను హోండా యాక్టివా వంటి ఆటోమేటిక్ స్కూటర్లలో ఉపయోగిస్తుంటారు). ఫీచర్ల పరంగా హోండా బ్రియోకు నిస్సాన్ మైక్రాకు దగ్గర పోలికలు ఉంటాయి. డ్రైవింగ్, హ్యాండ్లింగ్ కూడా రెండు ఇంచు మించు ఒకేలా అనిపిస్తాయి. అయితే, బ్రియోతో పోల్చుకుంటే మైక్రాలో ఇంటీరియర్, బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది.

నిస్సాన్ మైక్రా
ధర: రూ.6.49 లక్షలు
గేర్ బాక్స్: సివిటి (కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్)
మైలేజ్: 19.34 కెఎమ్‌పిఎల్

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ
ధర గురించి మర్చిపోయి, పవర్‌ఫుల్ అండ్ స్పోర్టీయర్ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కావాలనుకునే వారు చక్కగా ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో పాపులర్ అవార్డ్ విన్నింగ్ 1.2 లీటర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది సిటీ డ్రైవ్ కన్నా హైవే డ్రైవింగ్‌కి చక్కగా ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ హైలైన్‌లో ప్రీమియం సెడాన్ కార్లలో లభించే అన్ని ఫీచర్లు లభ్యమవుతాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ
ధర: రూ.7.99 లక్షలు
గేర్ బాక్స్: 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్
మైలేజ్: 17.2 కెఎమ్‌పిఎల్

మహీంద్రా ఈ2ఓ
అఫ్‌కోర్స్.. ఇది ఆటోమేటిక్ పెట్రోల్ కారు కాదు. కానీ ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు గురించి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. పెట్రోల్ ఇంధనంపై నెల నెలా డబ్బులు చెల్లించడం ఇష్టం లేని వారు, సిటీ రోడ్లపై సగటున రోజుకు 40-60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారికి ఈ ఎలక్ట్రిక్ కారును ఎంచుకోవచ్చు. ఇది వన్ టైమ్ ఇన్వెస్టిమెంట్ లాంటిది. కారు కొనుగోలు చేసిన తర్వాత దీని మెయింటినెన్స్‌కు పెద్దగా ఖర్చు ఉండదు, ఇంధన బాధ అస్సలే ఉండదు. ఇది చూడటానికి కాంపాక్ట్‌గా ఉన్నప్పటికీ, ఇందులో నలుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీని స్మార్ట్ ఫీచర్లు ఇందులో మరో ప్రత్యేకత. ఎటుచూసినా చికాకులు లేని సిటీ డ్రైవింగ్‌కి మహీంద్రా ఈ2ఓ ఓ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

మహీంద్రా ఈ2ఓ
ధర: 6.44 లక్షలు
గేర్ బాక్స్: ఫుల్ ఆటోమేటిక్
మైలేజ్: పూర్తి ఛార్జ్‌పై 100 కిలోమీటర్లు

మరి ఏది బెస్ట్..?
ఇప్పటి వరకు చెప్పుకున్న ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్ అని అడిగితే, ఫస్ట్ ఛాయిస్‌గా హోండా బ్రియోను చెప్పుకోవచ్చు. ఈ సెగ్మెంట్లోని పోటీదారులతో పోల్చుకుంటే బ్రియోలో మంచి రీఫైన్డ్ ఇంజన్, బెటర్ డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, హోండా బ్రియో కన్నా మరింత ఎక్కువ స్పేస్ కలిగిన ప్రీమియం కారును కోరుకునే వారు నిస్సాన్ మైక్రాను ఎంచుకోవచ్చు. కానీ, మీరు బడ్జెట్‌ను మర్చిపోయి పవర్‌ఫుల్, స్పోర్టీ ఆటోమేటిక్ కారును కోరుకునే వారైతే చక్కగా పోలో జిటి కారును కానీ లేదా ఐ20 కారును కానీ ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ ఐ20 కన్నా పోలో జిటి టిఎస్ఐ అన్ని విధాలుగా బాగుటుంది. కానీ ఫోక్స్‌వ్యాగన్ సర్వీస్ నెట్‌వర్క్‌తో పోల్చుకుంటే, హ్యుందాయ్ సర్వీస్ నెట్‌వర్క్ చాలా విస్తృతంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అనుకునే వారికి మహీంద్రా ఈ2ఓ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








