లగ్జరీ ఫీచర్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో సరికొత్త ఎస్‌యూవీ..7 సీటర్ సెగ్మెంట్‌లో టైరాన్ సంచలనం
జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త లగ్జరీ సెవెన్ సీటర్ ఎస్‌యూవీ టైరాన్ R-లైన్ (Tayron R-Line) రాబోతోంది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్, అదిరిపోయే ఫీచర్లతో రూపొందిన ఈ కారు, ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయనుంది. దీని పర్ఫార్మెన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఈ రివ్యూలో చూద్దాం.
ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ R-లైన్ చూడగానే ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ముందు భాగంలో ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా, గ్రిల్ మధ్యలో ఉండే వోక్స్‌వ్యాగన్ లోగో తెల్లటి కాంతితో మెరుస్తూ కారుకు ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది. గ్రిల్‌పై క్రోమ్ వాడకుండా, పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ఇది మరింత మోడ్రన్‌గా కనిపిస్తుంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, ఫ్రంట్ పార్కింగ్ కెమెరా దీనికి మరింత రక్షణను, సౌకర్యాన్ని జోడిస్తాయి.

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 19-అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్ కారుకు మంచి గ్రిప్ ఇస్తాయి. విండోల చుట్టూ ఉన్న సన్నని క్రోమ్ లైన్, రూఫ్ రైల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ కారుకు హుందాతనాన్ని తెచ్చాయి. వెనుక వైపు కూడా కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ బార్ ఉంది, ఇక్కడ లోగో ఎరుపు రంగులో మెరుస్తుంది. ఎలక్ట్రానిక్ బూట్ ఓపెనింగ్ సౌకర్యం వల్ల సామాన్లను లోడ్ చేయడం చాలా సులభం.

కారు లోపలికి అడుగుపెట్టగానే మనకు ఒక విలాసవంతమైన ప్రపంచం కనిపిస్తుంది. డాష్‌బోర్డ్ మీద ఉన్న 15-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. డ్రైవర్ కోసం 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ R-లైన్ కొలతల విషయానికి వస్తే, టైరాన్ R-లైన్ 4,792 mm పొడవు, 1,866 mm వెడల్పు, 1,665 mm ఎత్తును కలిగి ఉంది. దీని 2,789 mm వీల్‌బేస్ వల్ల లోపల ప్రయాణికులకు విశాలమైన స్థలం లభిస్తుంది. అలాగే, సుమారు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల ఎగుడుదిగుడు రోడ్లపై కూడా ఇది సులభంగా ప్రయాణిస్తుంది.

ముందు సీట్లకు మెమరీ ఫంక్షన్, వెంటిలేషన్, హీటింగ్ మాత్రమే కాకుండా మసాజ్ ఫీచర్ కూడా ఉండటం విశేషం. దీనివల్ల లాంగ్ డ్రైవ్స్ అసలు అలసటగా అనిపించవు. హార్మన్ కార్డాన్ 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ ప్రియులకు పసందైన విందును అందిస్తుంది.

రెండవ వరుసలో కూర్చునే వారికి మంచి లెగ్ రూమ్, అడ్జస్టబుల్ సీట్లు ఉన్నాయి. మూడవ జోన్ క్లైమేట్ కంట్రోల్ ద్వారా వెనుక ఉన్నవారు తమకు నచ్చిన ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవచ్చు. అయితే, మూడవ వరుస సీట్లు పిల్లలకు మాత్రమే సరిపోతాయి. ఒకవేళ మీకు ఎక్కువ లగేజీ స్పేస్ కావాలంటే, వెనుక రెండు వరుసల సీట్లను పూర్తిగా మడిచివేయవచ్చు. అప్పుడు ఏకంగా 850 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది, ఇది ఒక చిన్న టెంపో అంత సామాను పట్టేంత పెద్దది.

టైరాన్ R-లైన్‌లో 2.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 201 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గేర్లను చాలా వేగంగా, సున్నితంగా మారుస్తుంది. ఈ కారులో 4MOTION ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉండటం వల్ల అన్ని రకాల రోడ్ల మీద ఇది అద్భుతమైన పట్టును ప్రదర్శిస్తుంది. కేవలం 7.2 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని పవర్‌కు నిదర్శనం.

డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ చాలా తేలికగా, ఖచ్చితత్వంతో ఉంటుంది. సిటీలో నడపడానికి ఈజీగా ఉండటమే కాకుండా, హైవే మీద స్పోర్ట్ మోడ్‌లో వేగంగా వెళ్తున్నప్పుడు మంచి కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది. సస్పెన్షన్ సిస్టమ్ గుంతలను చక్కగా తట్టుకుంటుంది, బాడీ రోల్ (కారు ఊగడం) చాలా తక్కువగా ఉంటుంది. సేఫ్టీ విషయంలో వోక్స్‌వ్యాగన్ రాజీ పడలేదు. 9 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS ఫీచర్లు, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఇది ఒక కోటలాంటి రక్షణను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








