ఫోర్స్ వన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. అదేంటనకుంటున్నారా...! అయితే ఇది చదవండి. మన బిగ్ బికు కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రేజ్‌ను బిజినెస్‌గా మార్చుకునేందుకు ఫోర్స్ మోటార్స్, అమితాబ్‌తో చేతులు కలిపింది. ఇప్పటి వరకూ టెంపో ట్రావెలర్, ట్రాక్స్ వంటి వాణిజ్య వాహనాల తయారీలో ప్రసిద్ధి గాంచిన ఫోర్స్ మోటార్స్ మొట్టమొదటిసారిగా దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో తమ తొలి ఎస్‌యూవీ ఫోర్స్ వన్‌ని తాజాగా విడుదల చేసిన విషయం విదితమే.
ఫోర్స్ మోటార్స్ అందిస్తున్న 'ఫోర్స్ వన్' ఎస్‌యూవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్‌ను నియమించుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఫోర్స్ వన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్‌కు ఎంత మొత్తాన్ని చెల్లించిన విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. వాస్తవానికి మన బిగ్ బి రేంజ్ కోట్లలలోనే ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. ఫోర్స్ వన్ ఎస్‌యూవీని ఆగస్టు 15 ముంబైలో ఘనంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు.

ఇక ఫోర్స్ వన్ ఎస్‌యూవీ విషయానికి వస్తే.. ఇది 2148 సీసీ ఇన్‌లైన్-ఫోర్ డీజిల్ ఇంజన్ కలిగిన ఫోర్స్ వన్ ఎస్‌యూవీ 138 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 32 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉపయోగించిన 2.2 ఎఫ్ఎమ్‌టెక్ ఇంజన్ మెర్సిడెస్ బెంజ్ నుంచి పొందినది. ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏడుగురు ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించే వీలున్న ఈ ఎస్‌యూవీలో అధిక స్థలం ఉండి దూర ప్రయాణాల్లో కూడా ఎంతో సౌకర్యాన్ని ఇస్తుంది
ఈ ఎస్‌యూవీలో అమర్చబడిన ఎల్ఈడి హెడ్‌లైట్లు మరో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ప్రస్తుతం ఇది టూ-వీల్ (4x2) డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. వచ్చే ఏడాదిలో ఇందులో ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను కూడా ఫోర్స్ మోటార్స్ విడుదల చేయనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఫోర్స్ వన్ ఎస్‌యూవీ లీటరుకు 11.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. భారత మార్కెట్లో ఫోర్స్ వన్ ఎస్‌యూవీ ధరలను రూ. 10.65 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ), రూ. 11.1 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








