2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో వేదిక, సమయంలో మార్పు
మొత్తానికి అనుకున్నట్లే జరిగింది. ఇప్పటి వరకూ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతూ వస్తున్న అంతర్జాతీయ ఆటో ఎక్స్, ఇకపై వేరే ప్రాంతానికి తరలిపోనుంది. ప్రగతి మైదాన్‌లో మౌళిక సదుపాయాల కొరత, స్టాల్‌కు స్టాల్‌కు మధ్య దూరం ఎక్కువగా ఉండటం ఫలితంగా మీడియా నిర్దేశిత సమయానికి చేరుకోలేకపోవటం, దీనికితోడు గడచిన ఆటో ఎక్స్‌పో ఏర్పాట్లలో తలెత్తిన అవకతవకలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 2014లో జరగనున్న ఆటో ఎక్స్‌పోను గ్రేటర్ నోయిడాలో నిర్వహించనున్నారు.
మరోవైపు డెట్రాయిట్ మోటార్ షో కూడా జనవరి నెలలో జరుగుతుండటం, ఇది కూడా అంతర్జాతీయ మోటార్ షో కావటంతో కార్ కంపెనీలు ఒకేసారి ఇటు భారత్‌లోను అటు అమెరికాలోను స్టాల్స్ నిర్వహించడం కష్టం అవుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని 2014వ అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోను గ్రేటర్ నోయిడాకు తరలిస్తున్నామని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ప్రకటించింది. అయితే, ఈ ఆటో ఎక్స్‌పో ఇక నుంచి జనవరి నెలలో కాకుండా ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తామని, ఇందులో భాగంగానే 2014వ ఆటో ఎక్స్‌పోను ఫిబ్రవరి 6-12 తేదీలలో గ్రేటర్ నోయిడాలో నిర్వహించనున్నామని సియామ్ తెలిపింది.


Click it and Unblock the Notifications









