అమ్మటం లేదు, భాగస్వామి కోసం చూస్తున్నాం: ఆస్టన్ మార్టిన్
బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఈ కంపెనీను అమ్మేస్తున్నారని ఇటీవల వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్టన్ మార్టిన్ సంస్థను పూర్తిగా విక్రయించడం లేదని, కంపెనీలో భారీ మొత్తంలో పెట్టుబడుల పెట్టగల పటిష్టమైన భాగస్వామి కోసం మాత్రమే అన్వేషిస్తున్నామని కంపెనీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. వాస్తవానకి ఆస్టన్ మార్టిన్‌లో దాదాపు 64 శాతం వాటా కలిగిన 'ఇన్వెస్టిమెంట్ డార్' ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తమ ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు ఈ కంపెనీ ఆస్టన్ మార్టిన్‌లో ఉన్న తమ వాటాల్లో కొంత వాటాలను విక్రయించాలని యోచిస్తోంది.
ఇప్పటికే ఈ వాటాల కొనుగోలు రేసులో ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అన్ని కంపెనీల కన్నా ముందున్న సంగతి తెలిసిందే. ప్రారంభంలో భాగంగా, ఆస్టన్ మార్టిన్‌లో 40 శాతం వాటాలను 400 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించి మహీంద్రా కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. అనంతరం ఈ వాటను 50 శాతానికి పెంచుకోవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇరు కంపెనీలు అధికారికంగా ప్రకటన చేసేందుకు మాత్రం నిరాకరిస్తున్నాయి.

ఆస్టన్ మార్టిన్ కువైటీ యజమానులు కంపెనీలోని తమ మెజారీటీ వాటాలను విక్రయించటం ద్వారా వచ్చే పెట్టుబడులతో సంస్థను మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ విక్రయంపై తమకు సలహా ఇచ్చేందుకు గాను 'రోథ్స్‌ఛైల్డ్'ను ఇన్వెస్టిమెంట్ డార్ తమ సలహాదారుగా నియమించుకుంది. ఈ వాటాల అమ్మకం విషయంపై గడచిన కొద్ది నెలలుగా పలు పటిష్టమైన కొనుగోలుదారులతో ప్రత్యేక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో మహీంద్రా, టొయోటా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.
ఆస్టన్ మార్టిన్‌ను కొనుగోలు చేయగల పటిష్టమైన కొనుగోలుదారుల్లో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఒకటి. ఒకవేళ మహీంద్రా ఈ వాటాలను కొనుగోలు చేసినట్లయితే, దాని వలన కంపెనీకు ఎంతమేర ఆదాయం వాటిళ్లుతుందనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. కాగా.. మహీంద్రా ఇటీవలే కొరియాకు చెందిన ప్యాసింజర్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఆస్టన్ మార్టిన్‌ను కూడా మహీంద్రా కొనుగోలు చేసినట్లయితే, మహీంద్రా ఖాతాలో లగ్జరీ కార్ బ్రాండ్ వచ్చి చేరటమే కాకుండా, గ్లోబల్ మార్కెట్లో కూడా మహీంద్రాకు మంచి గుర్తింపు లభించే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








