వి12 వ్యాంటేజ్ రోడ్‌స్టర్‌ను విడుదల చేసిన ఆస్టన్ మార్టిన్
బ్రిటీష్ లగ్జరీ కారు కంపెనీ ఆస్టన్ మార్టిన్ మరో కొత్త అందాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అత్యంత సుందరమైన విలాసవంతమైన కార్లను తయారు చేయడంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ బ్రిటన్ కంపెనీ తాజాగా 'ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ రోడ్‌స్టర్' కారును విడుదల చేసింది. ఆస్టన్ మార్టిన్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న వి12 వ్యాంటేజ్ స్పోర్ట్స్ కారు ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కన్వర్టిల్ వెర్షన్‌ను తయారు చేసింది.
లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌గా వస్తున్న ఈ ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారు ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో ఉపయోగించిన 6-లీటర్ వి12 ఇంజన్ గరిష్టంగా 515 బిహెచ్‌పిల శక్తిని, 570 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది
ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ రోడ్‌స్టర్ గరిష్టంగా గంటకు 305 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఆస్టన్ మార్టిన్ వ్యాంటేజ్ కూపేలో ఉన్న సాంకేతిక ఫీచర్లనే రోడస్టర్‌లోనూ గమనించవచ్చు. అయితే, డిజైన్ పరంగా మాత్రం కొద్దిపాటి మార్పులు ఇందులో ఉన్నాయి. ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ కారు ధర బ్రిటన్ 150,000 పౌండ్లుగా ఉంది. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.1.29 కోట్లకు పైమాటే. మరి ఈ స్టయిలిష్ స్టన్నింగ్ కారును ఆస్టన్ మార్టిన్ ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఆస్టన్ మార్టిన్ ఇటీవలే తమ డిబిఎస్ మోడల్ స్థానాన్ని సరికొత్త వాంక్విష్ మోడల్‌తో రీప్లేస్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదివరకటి వెర్షన్‌ను కొనసాగింపుగా ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ వాంక్విషన్ కారును విడుదల చేస్తున్నామని, డిబిఎస్ కన్నా ఇది టెక్నాలజీ పరంగానూ, లుక్ అండ్ స్టయిల్ పరంగానూ మెరుగ్గా ఉంటుందని కంపెనీ వివరించింది.
ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ ధర 1,90,000 బ్రిటీష్ పౌండ్లు (మన దేశ కరెన్సీలో దిగుమతి సుంకాలు కలుపుకోక మునుపు సుమారు రూ.1.66 కోట్లు, సుంకాలను కలుపుకుంటే రూ.2 కోట్లకు పైమాటే)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. 565 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను కలిగిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ కేవలం 4.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 183 మైళ్ల వేగంతో పరుగులు తీస్తుంది.


Click it and Unblock the Notifications








