హై పెర్ఫామెన్స్ ఎస్4 సెడాన్‌ను విడుదల చేసిన ఆడి ఇండియా
భారత లగ్జరీ కార్ మార్కెట్లో ప్రస్తుతం ద్వితీయ స్థానంలో కొనసాగుతున్న జర్మన్ లగ్జరీ కార్ మేకర్ ఆడి ఇండియా, ఎలాగైనా మొదటి స్థానాన్ని దక్కించుకోవాలని సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం కొత్త కొత్త మోడళ్లను కంపెనీ తమ వినియోగదారులకు పరిచయం చేస్తోంది. గడచిన నెలలో సరికొత్త 2012 వెర్షన్ ఏ4 సెడాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన ఆడి ఇండియా ఇప్పుడు తాజాగా మరో హై పెర్ఫామెన్స్ సెడాన్‌ను ఇండియాకు పరిచయం చేసింది.
శక్తివంతమైన ఇంజన్‌తో తీర్చిదిద్దిన 'ఆడి ఎస్4' అనే హై పెర్ఫామెన్స్ లగ్జరీ సెడాన్‌ను ఆడి ఇండియా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆడి ఎస్4లో ఉపయోగించిన పవర్‌ఫుల్ వీ6 3.0 టిఎఫ్ఎస్ఐ గరిష్టంగా 333 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం ఐదు సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేందుకు దోహదపడుతుంది.

హెక్సాగనల్ షేప్‌లో ఉండే సింగిల్-ఫ్రేమ్ గ్రిల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ హెడ్‌ల్యాంప్‌తో కూడిన విశాలమైన జెనాన్ హెడ్‌ల్యాంప్స్, వెనుక వైపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ప్లాటినమ్ గ్రేతో కూడిన రేడియటేర్ గ్రిల్, గ్రిల్‌పై క్రోమ్ కోట్ చేయబడిన హారిజాంటల్ క్రాస్ బార్స్, గ్రిల్‌పై 'ఎస్4' బ్యాడ్జ్, అల్యూమినియం-లుక్ ఫినిష్‌తో కూడిన సైడ్ మిర్రర్స్, కారు పక్క భాగంలో ఉండే 'వి6 టి' బ్యాడ్జ్‌లను ఈ కారుపై గమనించవచ్చు.
ఆడి ఎస్4లో అమర్చిన సిక్స్-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 333 బిహెచ్‌పిల శక్తిని, 440 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఆడి ఎస్4 సెడాన్ లీటరు పెట్రోల్‌కు 10.34 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఆడి ఎస్4 సెవన్-స్పీడ్ ఎస్ ట్రానిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్)తో లభిస్తుంది. భారత మార్కెట్లో ఈ హై పెర్ఫామెన్స్ ఆడి ఎస్4 సెడాన్ ధర రూ.45,31,000 (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర) నుంచి ప్రారంభమవుతుంది.
ప్రస్తుతం ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా 19 డీలర్‌షిరప్‌లు ఉండగా, 2012 చివరి నాటికి ఈ సంఖ్యను 25కు పెంచుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది. అహ్మదాబాద్, బెంగుళూరు, ఛండీఘడ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ వెస్ట్, గుర్గావ్, హైదరాబాద్, ఇండోర్, భోఫాల్, జైపూర్, కొచ్చి, కోల్‌కటా, లుథియానా, ముంబై వెస్ట్, నాగ్‌పూర్, పూనే, సూరత్ నగరాల్లో ఆడి ఇండియా షోరూమ్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








