ఆడి క్యూ3 ఎస్‌యూవీని విడుదల చేసిన ఆడి ఇండియా
జర్మనీకు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో కొత్త కొత్త కార్లను విడుదల చేస్తూ కొనుగోలుదారులను సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవలే కొత్త 2012 వెర్షన్ ఆడి ఏ4 సెడాన్‌ను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు తాజాగా ఆడి క్యూ3 క్రాసోవర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇటు సెడాన్‌లో కంఫర్ట్‌ను, అటు ఎస్‌యూవీలోని పవర్‌ను కలబోసి కొత్త ఆడి క్యూ3 క్రాసోవర్‌ను ఆడి రూపొందించింది.
ఆడి క్యూ3 ఎస్‌యూవీని తొలిసారిగా ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో, ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చేతుల మీదుగా ఆడి ఇండియా దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఆడి క్యూ3 లగ్జరీ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో, 2.0 టిడిఐ ఇంజన్‌తో లభ్యమవుతుంది. ఆడి క్యూ3 ప్రారంభ వేరియంట్ ధర రూ. 26.71 లక్షలుగా ఉండగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 32.10 లక్షలుగా ఉంది. ప్రస్తుతానికి 500 యూనిట్ల ఆడి క్యూ3 ఎస్‌యూవీలకు మాత్రమే బుకింగ్స్ తీసుకోనున్నామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.
ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా ఉన్న 19 డీలర్ల ద్వారా ఆడి క్యూ3 కోసం బుకింగ్‌లను స్వీకరిస్తామని, తాము ఇప్పటికే మార్కెట్లో విడుదల చేసి, సక్సెస్ సాధించిన ఆడి క్యూ5, ఆడి క్యూ7 సరసన ఆడి క్యూ3 కూడా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ ఏడాది జనవరి - మే మధ్య కాలంలో మొత్తం 3,281 ఆడి కార్లను విక్రయించామని, గతేడాది ఇదే సమయంలో పోలిస్తే ఇది 37 శాతం అధికమని ప్రెస్కీ తెలిపారు.
ప్రస్తుతం ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా 19 డీలర్‌షిరప్‌లు ఉండగా, 2012 చివరి నాటికి ఈ సంఖ్యను 25కు పెంచుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది. అహ్మదాబాద్, బెంగుళూరు, ఛండీఘడ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ వెస్ట్, గుర్గావ్, హైదరాబాద్, ఇండోర్, భోఫాల్, జైపూర్, కొచ్చి, కోల్‌కటా, లుథియానా, ముంబై వెస్ట్, నాగ్‌పూర్, పూనే, సూరత్ నగరాల్లో ఆడి ఇండియా షోరూమ్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








