బెంట్లీ నుంచి అత్యంత వేగంతో పరుగులు తీసే కారు
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ 'బెంట్లీ' మరో అద్భుతాన్ని ఆటోమొబైల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. బెంట్లీ ఇదివరకెన్నడూ తయారు చేయని విధంగా, అత్యంత వేగంతో పరుగులు పెట్టే సూపర్ కారును ఆవిష్కరించింది. "కాంటినెంటల్ జిటి స్పీడ్" అనే పేరుతో బెంట్లీ రూపొందించిన ఈ కారు గంటకు గరిష్టంగా 329 కిలోమీటర్ల (గంటకు 205 మైళ్లు) వేగంతో పరుగులు తీస్తుంది.
బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్ కారులో 6-లీటర్, 48-వాల్వ్, ఫోర్-క్యామ్, ట్విన్ టర్బోఛార్జ్‌డ్ డబ్ల్యూ12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 625 పిఎస్‌ల శక్తిని, 800 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్ కేవలం 4.2 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది. ఇందులో జెడ్ఎఫ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (8 గేర్లు కలిగిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్)ను ఉపయోగించారు. కనురెప్ప పాటులో ఇది ఆటోమేటిక్‌గా వేగాన్ని బట్టి గేర్ మార్చుకోగలదు.
బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్ కారులో ఉపయోగించిన ఈ కొత్త గేర్ బాక్స్ 12 శాతం అధికంగా మైలేజీనిచ్చేందుకు, తక్కువ కర్బన వ్యర్థాలను విడుదల చేసేందుకు సహకరిస్తుంది. బెంట్లీ కంపెనీ నుంచి 'కాంటినెంటల్ జిటి' మోడల్ కార్లు అత్యధికంగా అమ్ముడుపోతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా బెంట్లీ కార్లకు మంచి క్రేజ్ ఉంది. బోల్డ్ డిజైన్ కలిగి ఉండే బెంట్లీ కార్లు అధిక పెర్ఫామెన్స్ కలిగి ఉండటమే కాకుండా, మంచి విలాసవంతమైన ఫీచర్లు కలిగి ఉండి, సుఖవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.


Click it and Unblock the Notifications









