నవంబర్ నెలలో 8.25 శాతం తగ్గిన కార్ల అమ్మకాలు
కార్ కంపెనీలకు గడచిన పండుగ సీజన్ ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టలేదు. పండుగ సీజన్‌లో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, దానికితోడు అధిక వడ్డీరేట్లు, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో కొనుగోలుదారులు కొత్త కార్లను కొనేందుకు ఆసక్తి చూపలేదు. గతేడాది నవంబర్ నెలతో పోల్చుకుంటే, గడచిన నెలలో మొత్తం కార్ల అమ్మకాలు 8.25 శాతం క్షీణించి 1,72,493 యూనిట్ల నుంచి 1,58,257 యూనిట్లకు పడిపోయాయి. అలాగే, మోటార్‌సైకిల్ అమ్మకాల విషయానికి వస్తే, ఇవి 8,67,088 యూనిట్ల నుంచి 8,67,518 యూనిట్లకు పెరిగాయి.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నవంబర్ 2012లో అన్ని విభాగాలకు చెందిన వాహనాల అమ్మకాలు 1.79 శాతం వృద్ధిని సాధించి 15,15,600 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా.. ఇదే సమయంలో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1.23 శాతం పెరిగి 11,75,429 యూనిట్లు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో అమ్మకాలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ వ్యాఖ్యానించారు.
కాగా, నవంబర్ 2012 నెలలో దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు కేవలం 2.35 శాతం మాత్రమే పెరిగి 74,793 యూనిట్లుగా నమోదవ్వగా, దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ కంపెనీ టాటా హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 34,698 యూనిట్లకు తగ్గిపోయాయి. అలాగే, టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు కూడా 42.49 శాతం క్షీణించి 13,538 యూనిట్లకు పరిమితం అయ్యాయి.


Click it and Unblock the Notifications









